ICC Test Rankings: టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకున్న రూట్.. టాప్ 10 లో ముగ్గురు భారత ఆటగాళ్లు

ICC Test Rankings: టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకున్న రూట్.. టాప్ 10 లో ముగ్గురు భారత ఆటగాళ్లు

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 872 రేటింగ్ పాయింట్స్ ఉండగా విలియంసన్ కు 859 పాయింట్స్ ఉన్నాయి. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో రూట్ సత్తా చాటాడు. 

సెంచరీతో సహా.. మొత్తం 291 పరుగులు చేసి ఈ సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరి టెస్టులో 87 పరుగులు చేయడం ద్వారా రూట్ ఈ ఘనతను అందుకున్నాడు.రూట్ టాప్ ర్యాంకింగ్‌కు చేరుకోవడం అతని కెరీర్‌లో ఇది తొమ్మిదోసారి. 2015 ఆగస్టులో తొలిసారి టాప్ ర్యాంకింగ్‌కు చేరుకున్నాడు. 2023 లో యాషెస్ లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్ తర్వాత చివరిసారిగా రూట్ అగ్రస్థానంలో ఉన్నాడు.

వెస్టిండీస్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో రాణించిన బ్రూక్ మూడో టెస్టులో విఫలమవడంతో 7 వ ర్యాంక్ కు పడిపోయాడు. టీమిండియా తరపున ముగ్గురు ఆటగాళ్లు టాప్ 10 లో చోటు దక్కించుకున్నారు. రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ వరుసగా 6,8,10 స్థానాల్లో నిలిచారు.బౌలింగ్ విషయానికి వస్తే టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ (870) తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బుమ్రా (847) మూడో స్థానంలో.. జడేజా(788) ఏడో స్థానంలో ఉన్నారు. టీమ్స్ లో ఆస్ట్రేలియా (124) అగ్ర స్థానంలో.. ఇండియా(120) రెండో స్థానంలో ఉన్నాయి.