న్యూఢిల్లీ: తన హయాంలో టెస్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని కొత్తగా ఎన్నికైన ఐసీసీ చైర్మన్ జై షా అన్నారు. క్రికెట్ పురోగతికి అడ్డంకులు సృష్టించే వాటిని తొలగించేందుకు కూడా ప్రయత్నిస్తామన్నారు. ‘సహజంగానే టీ20 చాలా ఉత్సాహభరితమైన ఫార్మాట్. అయినప్పటికీ టెస్ట్‌లకు కూడా ప్రాధాన్యత కల్పిస్తాం. ఇదే ఆటకు పునాదిగా నిలుస్తుంది. క్రికెటర్లు టెస్ట్ ఫార్మాట్ వైపు వెళ్లేలా చూడాలి. మా ప్రయత్నాలు కూడా ఆ దిశగానే ఉంటాయి’ అని షా పేర్కొన్నారు. టాలెంట్ సెర్చ్ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆటను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. ‘క్రికెట్ స్థాయిని పెంచేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తా. కీలకమైన ఈ బాధ్యతల్లో అడుగుపెడుతున్న నేను మీ అంచనాలను అందుకోవడానికి ప్రయత్నిస్తా’ అని జై వ్యాఖ్యానించారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ అడుగుపెట్టబోతుండటం పరివర్తనకు నిదర్శనమన్నారు. ఇది కేవలం మైలురాయిగానే మిగిలిపోకుండా ఆటను మరింత ఉన్నత స్థాయికి వెళ్లేలా చూడాలన్నారు. తన పదవి కాలంలో మహిళా, వికలాంగ క్రికెటర్ల ఎదుగుదల కోసం కూడా కృషి చేస్తానని జై షా వెల్లడించారు.