ఐసీసీ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లకు భారీ ఝలక్ ఇచ్చింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో స్లో ఓవర్‌రేట్ వేసినందుకు కాను ఇరు జట్లకు మూడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లు కోత విధించారు. దీంతో ఇరు జట్ల పాయింట్ల శాతంలో భారీ మార్పు సంభవించింది. ముఖ్యంగా న్యూజిలాండ్ ఐదో స్థానానికి పడిపోయింది. సొంతగడ్డపై ఈ మ్యాచ్ కివీస్ ఓడిపోవడంతో భారీగా డ్యామేజ్ జరిగింది.
ఈ షాక్ లో ఉండగానే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లకు స్లో ఓవరేట్ కారణంగా మ్యాచ్ ఫీజ్ లో 15 శాతం జరిమానా విధించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 47.92 శాతంతో ఐదో స్థానంలో.. 42.50 శాతంతో ఇంగ్లాండ్ ఆరో స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లాండ్ ఇప్పటికే టెస్ట్ ఛాంపియన్ షిప్ అవకాశాలు దాదాపు కోల్పోగా.. కివీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో న్యూజి లాండ్ పై గెలిచింది. కివీస్ విధించిన 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 12.4 ఓవర్లలో ఛేదించారు.
టెస్ట్ ఛాంపియన్ షిప్ లో పాయింట్స్ టేబుల్ లో సౌతాఫ్రికా దూసుకొస్తోంది. ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరుకుంది. డర్బన్ వేదికగా కింగ్స్ మీడ్ లో శ్రీలంకపై జరిగిన జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించడం ద్వారా సౌతాఫ్రికా విజయాలు శాతం 59.26 కు చేరుకుంది. భారత్ 61.11 శాతం విజయాలతో అగ్ర స్థానంలో కొనసాగుతుంది.