IND vs AUS: ట్రావిస్ హెడ్‌తో గొడవ.. సిరాజ్‌పై ఐసీసీ చర్యలు

అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్‌లపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. రెండో రోజు ఆటలో భాగంగా వీరిద్దరూ గ్రౌండ్ లో గొడవకు దిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిరాజ్ ను గట్టిగా మందలించింది. అతని మ్యాచ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినందుకు సిరాజ్ కు ఐసీసీ ఈ శిక్ష విధించింది. దీంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ ను విధించారు. 

మరోవైపు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ కు మ్యాచ్ ఫీజ్ విధించలేదు. అతనికి కేవలం  ఒక డీమెరిట్ పాయింట్ ను మాత్రమే  విధించారు. ఆట ముగిసిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు తమ నేరాలను అంగీకరించారని ఐసీసీ తెలిపింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ అత్యుత్సాహం చూపిన విషయం విదితమే. మొదట మార్నస్ లబుషేన్‌పై బంతిని విసిరేసిన సిరాజ్.. అనంతరం ట్రావిస్ హెడ్ పై మాటలు తూలాడు. ఔట్ చేసిన ఆనందంలో హెడ్‌కు ఆవేశపూరిత సెండ్-ఆఫ్ ఇచ్చాడు. ఆడింది చాలు.. ఛల్ పో బే పో అన్నట్లు సైగలు చేశాడు. అందుకు హెడ్ అదే రీతిలో బదులిచ్చాడు. ఈ ఘటన తీవ్ర వివాదస్పదమైంది. 

ALSO READ | Cricket War : షమీ vs రోహిత్.. టీమిండియాలో భగ్గుమన్న విభేదాలు

హెడ్‌పై నోరు పారేసుకుని సిరాజ్.. ఆస్ట్రేలియా అభిమానుల దృష్టిలో విలన్‌గా మారాడు. అంతేకాదు, సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు సైతం సిరాజ్ తీరును తప్పుబట్టారు. స్లెడ్జింగ్ చేయడానికి పరిమితులు ఉంటాయని.. వాటిలో లోబడే ప్రవర్తించాలని భారత పేసర్ కు సర్ది చెప్పారు. మొత్తానికి చూస్తుంటే, ఈ గొడవ సర్దు మరిగినట్లే కనిపిస్తోంది. మూడో రోజు ఆటలో సిరాజ్, ట్రావిస్ హెడ్ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మొత్తానికి వీరిద్దరూ తమ సమస్యను పరిష్కరించుకున్న ఐసీసీ నుంచి తప్పించుకోలేకపోయారు.