భారత్, సౌతాఫ్రికా మధ్య కేప్ టౌన్ టెస్ట్ ఆశ్చర్యకర రీతిలో ముగిసింది. కనీసం రెండు రోజులు కూడా జరగకుండా 4 సెషన్ లో పూర్తయింది. కేవలం 107 ఓవర్లలోనే ముగిసిన ఈ మ్యాచ్ లో భారత్.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. పిచ్ ఎంత బౌలర్లకు అనుకూలించినా రెండు అగ్ర శ్రేణి జట్ల మధ్య ఇలాంటి టెస్టు మ్యాచ్ జరగడం షాక్ కు గురి చేసింది. ఈ పిచ్ పై మాజీలు సైతం విమర్శలు గుప్పించగా.. తాజాగా ఐసీసీ న్యూలాండ్స్ పిచ్ కు పూర్ రేటింగ్ ఇచ్చింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కేప్ టౌన్ పిచ్ 'సంతృప్తికరంగా లేదు' అని రేట్ చేసింది. క్రికెట్ సౌతాఫ్రికా (CSA) అప్పీల్ చేయడానికి 14 రోజుల గడువు ఉంది. ఈ లోపు పిచ్ పై వివరణ ఇవ్వకపోతే ఈ వేదికకు ఒక డీమెరిట్ పాయింట్ ఇవ్వబడుతుంది. రూల్స్ ప్రకారం ఒక వేదిక 6 డీమెరిట్ పాయింట్లను చేరుకుంటే, అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వకుండా 12 నెలల పాటు నిషేధించబడుతుంది. ఒకవేళ 12 డీమెరిట్ పాయింట్లను పొందినట్లయితే 24 నెలల పాటు నిషేధించబడుతుంది.
మ్యాచ్ ఆసాంతం బౌలింగ్ కు అనుకూలించిన ఈ పిచ్ పై భారత బౌలర్లు సఫారీ బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. 147 ఏళ్ళ టెస్టు క్రికెట్ చరిత్రలో తక్కువ బంతుల పరంగా ముగిసిన టెస్టు ఇదే కావడం గమనార్హం. 1932 లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య మెల్ బోర్న్ లో జరిగిన టెస్టు మ్యాచ్ 656 బంతుల్లోనే ముగిసింది. కేప్ టౌన్ టెస్ట్ ద్వారా 92 ఏళ్ళ రికార్డ్ ను భారత్, దక్షిణాఫ్రికా జట్లు బ్రేక్ చేశాయి.
తొలి రోజే ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ (6/15) కెరీర్ బెస్ట్ గణాంకాలతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా కేవలం 55 పరుగులకే ఆలౌటయ్యారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ లో సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ 153 పరుగులకే చిత్తయింది. కోహ్లీ 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రబడా, జాన్సెన్, ఎంగిడి తలో మూడు వికెట్లు తీసుకున్నారు.
3 వికెట్లకు 62 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా భారత పేసర్ బుమ్రా ధాటికి విలవిల్లాడింది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో సఫారీలు కేవలం 176 పరుగులకే ఆలౌటయ్యారు. మార్కరం 106 పరుగులతో ఒంటరి పోరాటం చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 6 వికెట్లు తీసుకోగా.. ముఖేష్ 2 వికెట్లు, సిరాజ్, ప్రసిద్ కృష్ణకు చెరో వికెట్ లభించింది.
79 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వరుస బౌండరీలతో హోరెత్తించాడు. 23 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత గిల్(10), కోహ్లీ(12) త్వరగా ఔటైనా రోహిత్ (17),అయ్యర్(4) మ్యాచ్ ను ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్ భారత్ గెలవడంతో సిరీస్ 1-1 తో డ్రా అయింది.
?Breaking News ?
— SportsTiger (@The_SportsTiger) January 9, 2024
ICC Rates Cape Town Pitch For IND vs SA 2nd Test 'Unsatisfactory'
?: CSA/Getty Images#SAvIND #INDvSA #TestCricket #Cricket #WTC #ICC #CapeTown #Newlands pic.twitter.com/u15NGMvyjq