Champions Trophy 2025: దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్‌లు.. టికెట్ ధర వెల్లడించిన ఐసీసీ

Champions Trophy 2025: దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్‌లు.. టికెట్ ధర వెల్లడించిన ఐసీసీ

క్రికెట్ అభిమానులను అలరించడానికి ఐసీసీ టైటిల్ సిద్ధంగా ఉంది. 2017 తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది. తొమ్మిదో ఎడిషన్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్‌,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. 

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండటంతో ఐసీసీ.. టికెట్ల విక్రయాలు మొదలు పెట్టింది. సోమవారం(ఫిబ్రవరి 03) నుంచి విడతల వారీగా టికెట్ల అందుబాటులోకి రానున్నాయి. ఎప్పటిలానే ఈసారి ఇండియా- పాక్ పోరుకు అధిక డిమాండ్ తప్పట్లేదు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ టికెట్లు త్వరగా అమ్ముడయ్యే అవకాశం ఉంది. మరికొన్ని గంటల్లో దుబాయ్ ఆతిథ్యమివ్వనున్న మ్యాచ్‪ల టికెట్లు అందుబాటులోకి రానున్నాయి

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడబోయే మూడు గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లతో పాటు మొదటి సెమీఫైనల్ టిక్కెట్లను సోమవారం (ఫిబ్రవరి 3) సాయంత్రం నుండి విక్రయించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. అదే విధంగా దుబాయ్ వేదికగా జరగనున్న మ్యాచ్ సాధారణ టికెట్ల ధరలను వెల్లడించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సాధారణ స్టాండ్ టిక్కెట్ ధరలు 125 దిర్హామ్‌లు (భారత కరెన్సీలో సుమారు 2964  రూపాయలు) నుండి ప్రారంభమవుతాయని.. అధికారిక టికెటింగ్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయని ఐసీసీ స్పష్టం చేసింది.

ALSO READ | Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ల బుకింగ్ ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండి

భారత కాలమాన ప్రకారం ఈ నాలుగు మ్యాచ్ ల టికెట్ ధరలు సాయంత్రం 5:30 గంటలకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరుగుతున్న 10 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు గత వారం అమ్మకానికి వచ్చిన టిక్కెట్లు ఇప్పుడు ఆన్‌లైన్ కొనుగోలు కోసం అందుబాటులో ఉన్నాయని ఐసిసి తెలిపింది. మార్చి 9న జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ టిక్కెట్‌లను..  దుబాయ్‌లో మొదటి సెమీ-ఫైనల్ ముగిసిన తర్వాత కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయని ఐసీసీ తెలిపింది.

టికెట్లు బుక్ చేసుకునే విధానం

స్టెప్ 1: https://www.iccchampionstrophy.com/tickets కి వెళ్లండి

స్టెప్ 2: 'దుబాయ్ హోస్ట్ చేసిన మ్యాచ్‌లు' విభాగాన్ని ఎంచుకోండి.

స్టెప్ 3: మీరు చూడాలనుకుంటున్న మ్యాచ్‌ని ఎంచుకుని, మీరు విదేశీ యాత్రికులైతే మీ పాస్‌పోర్ట్ నంబర్‌, మీరు కొనాలనుకుంటున్న 
టికెట్ల సంఖ్యను ఎంటర్ చేయండి. ఒక వ్యక్తి ఒక్కో మ్యాచ్‌కు గరిష్టంగా నాలుగు టికెట్లు కొనుగోలు చేయవచ్చు.

స్టెప్ 4: మీకు ఇష్టమైన సీట్లను ఎంచుకుని.. మీ కమ్యూనికేషన్ వివరాలను నమోదు చేయండి.

స్టెప్ 5: చివరగా మీకు నచ్చిన చెల్లింపు పద్ధతిలో పేమెంట్ చెల్లించండి. మీరు బుకింగ్ సమయంలో ఎంటర్ చేసిన ఇమెయిల్ IDకి టికెట్లు బుకింగ్ అయినట్లు మెసేజ్ వస్తుంది.