T20 World Cup 2024: శని ఉన్నాడు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అంపైర్లు వీరే

T20 World Cup 2024: శని ఉన్నాడు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అంపైర్లు వీరే

20 జట్లు.. 55 మ్యాచ్‌లు.. 28 రోజులు.. అమెరికా, వెస్టిండీస్‌ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచ కప్ 2024 సమరానికి ఐసీసీ.. శుక్రవారం(మే 03) మ్యాచ్ అధికారుల జాబితాను వెల్లడించింది. 20 జట్లు తలపడే ఈ టోర్నీలో 20 మంది అంపైర్లు, ఆరుగురు మ్యాచ్ అధికారులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అంపైర్ల జాబితాలో ఇద్దరు భారతీయులు చోటు దక్కించుకున్నారు. 

చారిత్రక ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం మా మ్యాచ్ రిఫరీలు, అంపైర్ల బృందాన్ని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఎంపిక చేసిన బృందంలో అనుభవజ్ఞులైన మ్యాచ్ అధికారులు ఉన్నారు. వీరు అత్యుత్తమంగా రాణిస్తారని మేము విశ్వసిస్తున్నాము. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్ వంటి ప్రముఖ అధికారులు ఈ జాబితాలో ఉన్నారు.

టీ20 ప్రపంచ కప్ 2024 కు అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు

అంపైర్లు: క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లాహుడియన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్‌బరో, జయరామన్ మదనగోపాల్, నితిన్ మీనన్, సామ్ నోగాజ్‌స్కీ, అహ్సన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రూసికా రీఫెల్, లాంగ్‌టన్ రీఫెల్ రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్.

మ్యాచ్ రిఫరీలు: డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, జవగల్ శ్రీనాథ్.

టీమిండియా పాలిట విలన్‌.. రిచర్డ్ కెటిల్‌బరో

రిచర్డ్ కెటిల్‌ బరో పేరు వింటేనే భారత అభిమానులకు ఎక్కడలేని భయం. అతను అంపైర్‌గా వ్యవహరించిన అన్ని  ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓడటమే అందుకు ప్రధాన కారణం. టీ20 వరల్డ్ కప్ 2014 ఫైనల్‌లో శ్రీలంక చేతిలో ఓడిన భారత జట్టు.. అనంతరం ప్రపంచ కప్ 2015 సెమీ-ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో, టీ20 ప్రపంచ కప్ 2016 ఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. అంతేకాదు, గతేడాది అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లోనూ ఓడింది. ఈ మ్యాచ్లన్నింటికీ రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌గా ఉన్నాడు. దీంతో అతని పేరు మరోసారి కనపడగానే కొత్త కొత్త అనుమానాలు లేవనెత్తుతున్నారు.