
ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. దీంతో నెంబర్ వన్ జట్టుగా రోహిత్ సేన ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టనుంది. ఇంగ్లాండ్ పై ఇటీవలే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 3-0 తేడాతో గెలుచుకున్న తర్వాత భారత్ టాప్ ర్యాంక్ కు చేరుకుంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 119 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మరోవైపు శ్రీలంకపై ఆస్ట్రేలియా 0-2 తేడాతో ఓడిపోయిన తర్వాత మూడవ స్థానం నుండి రెండవ స్థానానికి చేరుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఇటీవలే ముక్కోణపు సిరీస్ ఆడాయి. కివీస్ జట్టు టైటిల్‌ను గెలుచుకుని నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు ఫైనల్లో ఓడిపోయిన పాకిస్థాన్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. సౌతాఫ్రికా జట్టు ఐదో స్థానంలో ఉంది. ఇటీవలే వన్డేల్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ఇంగ్లాండ్ ఏడో స్థానానికి దిగిపోయింది. స్వదేశంలో వరుస విజయాలు సాధిస్తున్న శ్రీలంక ఆరో స్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ వరుసగా 8,9,10 స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన 8 జట్లు ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ ఆడనున్నాయి.
భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ ఏ లో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి లో ఉన్నాయి.శ్రీలంక, వెస్టిండీస్ ఈ మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీ మొత్తం 20 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. హైబ్రిడ్ మొదల్లో జరగనున్న ఈ టోర్నీకి పాకిస్థాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్నాయి. అన్ని జట్లతో పోల్చుకుంటే పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.