T20 World Cup 2024: వరుసగా మూడు సంచలన ఫలితాలు.. అంచనాలకు అందని వరల్డ్ కప్

T20 World Cup 2024: వరుసగా మూడు సంచలన ఫలితాలు.. అంచనాలకు అందని వరల్డ్ కప్

సాధారణంగా వరల్డ్ కప్ అంటే ఒకటి రెండు సంచలన ఫలితాలు సహజం. కానీ ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ దీనికి పూర్తి భిన్నం.  టోర్నీ ప్రారంభమై వారం కాకముందే అనూహ్య ఫలితాలు వచ్చాయి. గత రెండు రోజుల్లో జరిగిన మ్యాచ్ లు చూసుకుంటే ఏకంగా నాలుగు చిన్న జట్లు పెద్ద జట్లపై విజయం సాధించాయి. దీంతో ఈ సారి టీ20 వరల్డ్ కప్ ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. అండర్ డాగ్ గా బరిలోకి దిగిన జట్లు టాప్ జట్లకు షాక్ ఇవ్వడంతో ఈ టోర్నీ చర్చనీయాంశంగా మారింది. ఈ సంచలనాల ఫలితాలతో పాకిస్థాన్, న్యూజీలాండ్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. 

ఐర్లాండ్ పై కెనడా సమిష్టి విజయం:

క్రికెట్ లో ఐర్లాండ్ కు ఒక గుర్తింపు ఉంది. చిన్న జట్టే అయినా తమదైన రోజున పెద్ద జట్లకు షాక్ ఇస్తుంది. ఈ మెగా టోర్నీకి ముందు  పాకిస్థాన్ పై తొలి టీ20లో ఈజీగా విజయం సాధించింది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ లో కెనడా ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటుంది. ఈ జట్టు వరల్డ్ కప్ కు అర్హత సాధించడమే గొప్ప అనుకుంటే.. ఏకంగా ఐర్లాండ్ జట్టుకు షాక్ ఇచ్చి.. టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు చేస్తే.. బౌలింగ్ లో క్రమశిక్షణగా రాణించి ఐర్లాండ్ ను 125 పరుగులకే కట్టడి చేసింది. 

న్యూజిలాండ్ కు షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్:

అంతర్జాతీయ క్రికెట్ లో సంచలనాలకు మారు పేరైన ఆఫ్ఘనిస్తాన్.. మరోసారి మ్యాజిక్ చేసింది. అగ్రశ్రేణి జట్లలో ఒకటైన న్యూజీలాండ్ జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది. కివీస్ పై ఏకంగా 84 పరుగుల తేడాతో గెలవడం హైలెట్ గా మారింది. ఈ రేంజ్ లో విజయం ఊహించనిది. మొదట బ్యాటింగ్ లో రాణించిన ఆఫ్ఘన్లు.. తర్వాత బౌలింగ్ లో మరింతగా రెచ్చిపోయారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టును 15.2 ఓవర్లలో కేవలం 75 పరుగులకే పరిమితం చేసింది.             

బంగ్లా చేతిలో లంక పరాభవం:

బంగ్లాదేశ్ తో పోలిస్తే శ్రీలంక బలమైన జట్టు. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంకకు బంగ్లా షాక్ ఇచ్చింది. విజయం సాధించింది. మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకను 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన  బంగ్లాదేశ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఛేజింగ్‌లో తౌహిద్  20 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి 40 పరుగులు చేశాడు.