భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. బార్బడోస్ వేదికగా శనివారం (జూన్ 29) సాయంత్రం 8 గంటలకు ఈ మెగా ఫైనల్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మరోవైపు తొలిసారి ఫైనల్ కు చేరిన దక్షిణాఫ్రికా ఒత్తిడిలో కనిపిస్తుంది. 11 ఏళ్ళ తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలవాలని భారత్ భావిస్తుంటే.. తొలి సారి వరల్డ్ కప్ టైటిల్ దక్కించుకోవాలని దక్షిణాఫ్రికా గట్టి పట్టుదలతో కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో సఫారీ బౌలర్లతోనే భారత్ కు అసలు సమస్య ఉన్నట్లు తెలుస్తుంది.
టోర్నీలో దక్షిణాఫ్రికా బౌలర్లు ఏ రేంజ్ లో చెలరేగుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పేసర్లు ఆ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్ లు ఒకసారి పరిశీలిస్తే కేవలం ఒకసారి మాత్రమే 160 కి పైగా స్కోర్ సమర్పించుకున్నారు. బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్‌లో సఫారీలు బలంగా ఉన్నారు. టాప్ వికెట్ల వీరుల జాబితాలో ముందు వరుసలో లేకపోయినా పేసర్లు మార్కో జాన్సెన్, రబాడ, అన్రిచ్‌తో పాటు స్పిన్నర్లు కేశవ్, షంసి సమష్టిగా రాణిస్తున్నారు.
కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టును ముందుకు తీసుకొచ్చారు. జట్టు స్వల్ప టార్గెట్ సెట్ చేసినా బౌలర్లు ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించారు. ఫైనల్లో ఇదే ప్రదర్శన కొనసాగిస్తే భారత్ కు కష్టాలు తప్పవు. విరాట్ ఫామ్ లోకి లేకపోవడం మైనస్ గా మారింది. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ మినహాయిస్తే నిలకడగా ఆడేవారు కరువయ్యారు. ప్రమాదకరమైన సౌతాఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించకపోతే ఫైనల్ గెలవడం కష్టమే. ఇప్పటివరకు ఇరు జట్లు టోర్నీలో తలపడలేదు. దీంతో ఈ మ్యాచ్ పై ఆసక్తి పెరిగింది.