రాణించిన భారత కుర్రాడు.. జింబాబ్వేపై ఉగాండా ఘన విజయం

రాణించిన భారత కుర్రాడు.. జింబాబ్వేపై ఉగాండా ఘన విజయం

వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్, ఆఫ్గనిస్తాన్ వంటి అసోసియేట్ టీమ్‌లు.. ఇంగ్లాండ్, దక్షణాఫ్రికా, పాకిస్తాన్ వంటి అగ్రశ్రేణి జట్లకు మట్టికరిపించిన జ్ఞాపకాలు మరవకముందే మరో సంచలనం నమదైంది. తూర్పు ఆఫ్రికా దేశమైన ఉగాండా.. ఐసీసీ టెస్టు హోదా క‌లిగిన జింబాబ్వేను ఓడించి ఔరా అనిపించింది. 

వచ్చే ఏడాది(2024) ఐసీసీ పురుషుల టీ20 ప్ర‌పంచ‌ క‌ప్‌ జరగనున్న విషయం తెలిసిందే. దీనికి వెస్టిండీస్‌, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. అందులో భాగంగా ఆఫ్రిక‌న్ రీజియ‌న్  క్వాలిఫ‌య‌ర్స్ పోటీల్లో ఉన్న ఉగాండా.. జింబాబ్వేను చిత్తు చేసింది. మొద‌ట జింబాబ్వేను 136 ప‌రుగుల‌కే  కట్టడి చేసిన ఉగాండా.. అనంతరం ల‌క్ష్యాన్ని 19.1 ఓవ‌ర్లలోనే ఛేదించింది. 

రాణించిన సికందర్ రజా

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. జింబాబ్వే కెప్టెన్ సికంద‌ర్ ర‌జా 39 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో 48 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఉగాండా బౌల‌ర్ల‌లో భార‌త సంత‌తి ఆట‌గాడు దినేశ్ న‌క్రానీ తన 4 ఓవ‌ర్ల‌లో 12 ప‌రుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

అనంత‌రం 137 పరుగుల స్వ‌ల్ప లక్ష్యాన్ని ఉగాండా మరో ఐదు బంతులు మిగిలివుండగానే చేధించింది.  ఉగాండా బ్యాటర్లలో అల్పేశ్ రంజానీ (40; 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రియాజ‌త్ అలీ షా (42; 28 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స‌ర్) రాణించారు. 

రెండో విజ‌యం

ఈ టోర్నీలో ఉగాండాకు ఇది రెండో విజ‌యం. తొలి మ్యాచ్ లో టాంజానియాను ఓడించిన ఉగాండా.. అనంతరం రెండో మ్యాచ్ లో న‌మీబియా చేతిలో ఓటమిపాలైంది. ఆ జట్టు త‌ర్వాతి మ్యాచ్‌ల‌లో నైజీరియా, రువాండా, కెన్యాతో త‌ల‌ప‌డాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల‌లో విజ‌యాలు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో నిలిస్తే ప్ర‌పంచ‌క‌ప్ క్వాలిఫ‌య‌ర్స్‌లో చోటు ద‌క్కించుకోవచ్చు.