దుబాయ్: వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇవ్వనున్న చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు ఈ నెల 29న సమావేశం కానుంది. ఈ టోర్నీ కోసం పాక్ వెళ్లేందుకు ఇండియా నిరాకరించడంతో షెడ్యూల్ ప్రకటన ఆలస్యం అవుతోంది.
తమ మ్యాచ్‌లు తటస్థ వేదికపై జరిగేలా చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ కోరుతుండగా.. పీసీబీ అందుకు ఒప్పుకోవడం లేదు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ బోర్డు మెంబర్స్ వర్చువల్‌గా సమావేశం కానున్నారు. డిసెంబర్ 1వ తేదీన బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఈ బోర్డు మీటింగ్‌లోనే చాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితిని తొలగించాలని భావిస్తున్నారు.