- నేటి నుంచి అండర్–19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్
మలేసియా: ఇండియా యంగ్ క్రికెటర్లు ప్రపంచ వేదికపై తమ సత్తాను చాటుకోవాలని చూస్తుండగా ఐసీసీ అండర్19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. శనివారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ యంగ్ ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 2023లో జరిగిన తొలి ఎడిషన్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి విజేతగా నిలిచిన అమ్మాయిల జట్టు మరో టైటిల్‌పై కన్నేసింది. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడుతున్నాయి. నిక్కి ప్రసాద్ కెప్టెన్సీలోని ఇండియా...మలేసియా, శ్రీలంక, వెస్టిండీస్‌తో కూడిన గ్రూప్–-ఎలో ఉంది.
తొలి రోజు గ్రూప్–డిలోని ఆస్ట్రేలియా–స్కాట్లాండ్, గ్రూప్–బిలోని ఇంగ్లండ్–ఐర్లాండ్ పోటీ పడనుండగా.. ఆదివారం జరిగే తమ తొలి పోరులో వెస్టిండీస్‌తో టోర్నీని ఆరంభించనుంది. ప్రతీ గ్రూప్‌లోని టాప్–3 జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. అక్కడ రెండు గ్రూపుల్లో పోటీ పడతాయి. ఈ రెండు గ్రూపుల్లో టాప్2 టీమ్స్ సెమీస్‌కు చేరుకుంటాయి.
ఫిబ్రవరి2న ఫైనల్ జరుగుతుంది. గత ఎడిషన్‌లో చాంపియన్‌గా నిలిచిన టీమ్‌లో ఆడిన హైదరాబాదీ గొంగడి త్రిష ప్రస్తుత జట్టులో కూడా ఉంది. ఇటీవలే అండర్19 ఆసియా కప్‌లో ఇండియా విజేతగా నిలవడంలో తను కీలక పాత్ర పోషించింది. మరో హైదరాబాదీ కేసరి ధృతి కూడా ఈ వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న ఇండియా జట్టుకు ఎంపికైంది.