అక్టోబర్ 3 నుంచి యూఏఈ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ టోర్నీ బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉండగా.. రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో యూఏఈకి తరలించారు. తాజాగా, ఈ మెగా టోర్నీకి సంబంధించి మ్యాచ్ టికెట్ల రేట్లను ఐసీసీ వెల్లడించింది. ప్రారంభ ధరను 5 దిర్హామ్‌లుగా నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో రూ.114 మాత్రమే.
టికెట్ కొనక్కర్లేదు.. ఫ్రీ ఎంట్రీ
ఈ మెగా టోర్నీకి సంబంధించి ఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల లోపు వారికి ఉచిత ప్రవేశం కల్పించింది. టోర్నీ ఎడారి దేశంలో జరగుతుండటం అందుకు ప్రధాన కారణం. ఎక్కువ మంది ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించడంతో పాటు యువతలో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల ప్రకటన సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై టీ20 వరల్డ్‌కప్ లేజర్ షోను ప్రదర్శించారు.
టైటిల్ పోరులో 10 జట్లు
ఈ మెగా టోర్నీ 18 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. టైటిల్ రేసులో మొత్తం 10 జట్లు ఉండగా.. వీటిని రెండు గ్రూపులు విభజించారు. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్ ఉన్నాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. అనంతరం గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
లీగ్ మ్యాచ్‌లు దుబాయ్, షార్జా వేదికగా జరకానున్నాయి. అక్టోబర్ 17, 18 తేదీల్లో సెమీఫైనల్స్ నిర్వహించనున్నారు. సెమీఫైనల్స్‌కు షార్జా వేదిక కానుంది. ఇక ఫైనల్ దుబాయ్ వేదికగా అక్టోబర్ 20న జరగనుంది. సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 1 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.