పుణె: వరల్డ్ కప్‌లో పెద్ద జట్లంటూ ఏవీ లేవని టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అన్నాడు. అందరూ సక్సెస్‌ఫుల్ టీమ్స్ గురించే మాట్లాడుతుంటే ఈ మెగా ఈవెంట్‌లో సంచలన ఫలితాలు వస్తుంటాయని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్, సౌతాఫ్రికాకు అఫ్గాన్, నెదర్లాండ్స్ షాకివ్వడంపై కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘వరల్డ్ కప్‌లో పెద్ద జట్లేమీ లేవు. మీరు పెద్ద జట్లపై మాత్రమే దృష్టి పెట్టడం ప్రారంభించినప్పుడల్లా ఒక అనూహ్య ఫలితం వస్తుంది’ అని చెప్పాడు.
ఇక గురువారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆ టీమ్ కెప్టెన్ షకీబ్ బౌలింగ్‌తో ఇండియాకు సవాల్ ఉంటుందన్నాడు. ‘షకీబ్ చాలా అనుభవజ్ఞుడైన బౌలర్. కొత్త బాల్స్‌తో చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. బ్యాటర్లను ఎలా బుట్టలో వేసుకోవాలో అతనికి బాగా తెలుసు. ఇలాంటి బౌలర్లను మనం అత్యుత్తమంగా ఆడాలి’ అని అభిప్రాయపడ్డాడు.