T20 World Cup 2024: కావాలని ఓడిపోతే నిషేధం తప్పదు.. మార్ష్‌కు ఐసీసీ వార్నింగ్

T20 World Cup 2024: కావాలని ఓడిపోతే నిషేధం తప్పదు.. మార్ష్‌కు ఐసీసీ వార్నింగ్

స్కాట్లాండ్ తో మ్యాచ్ తమకు పెద్ద కీలకం కాదని ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తమ వల్ల ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తే తమతో పాటు అన్ని జట్లకు కలిసి వస్తుందని.. ఇంగ్లాండ్ ప్రమాదకరమైన జట్లలో ఒకటని తర్వాత స్టేజ్ లో వారిని ఎదుర్కోవాల్సి వస్తే కష్టమని హేజిల్‌వుడ్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే . తాజాగా ఈ విషయం ఇప్పుడు ఐసీసీ దృష్టికి వెళ్ళింది. 

ఒకవేళ స్కాట్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆసీస్‌ ఉద్దేశ్యపూర్వకంగా ఓడిపోతే మాత్రం ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ పై నిషేధం పడనుంది. ఐసీసీ విచారణ జరిపి అందులో ఆస్ట్రేలియా కావాలనే ఓడిపోతే ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఆర్టికల్‌ 2.11 ప్రకారం ఆసీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తారు. ఇప్పుడు ఇంగ్లాండ్ భవితవ్యం ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మ్యాచ్ పై ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధిస్తేనే ఇంగ్లాండ్ సూపర్ 8 ఆశలు సజీవంగా ఉంటాయి. 

గ్రూపు బిలో భాగంగా ఆడిన మూడు మూడు మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించి సూపర్ 8 బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మరోవైపు ఆడిన మూడు మ్యాచ్ ల్లో 5 పాయింట్లతో స్కాట్లాండ్ సూపర్ 8 కు దగ్గరలో ఉంది. జూన్ 16 న సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ స్కాట్లాండ్ గెలిచినా.. లేకపోతే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయినా ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్ తక్కువ తేడాతో ఓడిపోయినా సూపర్ 8 కు చేరుకునే అవకాశం ఉంది.  

నమీబియా, ఒమన్‌ జట్లు ఇప్పటికే ఎలిమినేట్‌ అయిపోయాయి. మిగిలిన ఒక బెర్త్ కోసం ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మధ్య పోటీ నడుస్తుంది. ఇంగ్లాండ్ తమ చివరి రెండు మ్యాచ్ లు ఒమన్, నమీబియాతో భారీ తేడాతో గెలవడంతో పాటు.. స్కాట్లాండ్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతేనే ఇంగ్లాండ్ సూపర్ 8 కు చేరుకుంటుంది. ఇంగ్లాండ్ ఆడబోయే రెండు మ్యాచ్ లతో పాటు స్కాట్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే వర్షం కారణంగా మ్యాచ్ రద్ధయితే ఇంగ్లాండ్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ప్రస్తుతం రెండు మ్యాచ్ లాడిన ఇంగ్లాండ్ ఖాతాలో 1 పాయింట్ ఉంది. ఆస్ట్రేలియా 6 పాయింట్లతో, స్కాట్లాండ్ ఐదు పాయింట్లతో టాప్ 2 లో ఉన్నాయి.