దుమ్మురేగాలి : ఇండియా, పాక్ క్రికెట్ మ్యాచ్ కు.. స్పెషల్ వందే భారత్ రైళ్లు

దుమ్మురేగాలి : ఇండియా, పాక్ క్రికెట్ మ్యాచ్ కు.. స్పెషల్ వందే భారత్ రైళ్లు

చిరకాల ప్రత్యర్థులు మరోసారి ఢీకొట్టుకోబోతున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అక్టోబర్ 14వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య హాట్ ఫైట్ జరగబోతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు  అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియానికి భారీగా అభిమానులు రానున్నారు.  నరేంద్ర మోదీ స్టేడియం కెపాసిటీ లక్షా 30 వేలు. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. దీనికి తోడు అహ్మదాబాద్‌, పరిసర ప్రాంతాల హోటళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మ్యాచ్ జరిగే రోజు హైదరాబాద్ కు ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనదారులు తమ ఛార్జీల రేట్లను కూడా పెంచుకుని క్యాష్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. మ్యాచ్ జరిగే రోజు అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన టికెట్‌ ధరలు కూడా భారీగానే ఉన్నాయి. దీంతో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చే  అభిమానుల పర్సు ఖాళీ అవడం ఖాయం. ఈ క్రమంలోనే క్రికెట్‌ అభిమానులకు భారతీయ రైల్వే ఓ శుభవార్త చెప్పింది.

అక్టోబర్ 14వ తేదీన భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్ జరిగే రోజున అహ్మదాబాద్‌కు స్పెషల్ గా వందే భారత్‌ రైళ్లను నడపనున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది.  రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ఈ ప్రత్యేక వందే భారత్ రైళ్లు నడవనున్నాయి. అయితే టికెట్ల రేట్లు, షెడ్యూల్‌  వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.