అభిమానుల ఉత్కంఠకు తెరపడిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. నేడు వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల చేసింది. అయితే రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఈ టోర్నీ నిర్వహించడం అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఫార్మాట్ ఏంటి? సెమీస్ చేరే జట్లను ఎలా నిర్ణయిస్తారు? అన్న ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. అందుకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రౌండ్ రాబిన్ ఫార్మాట్ అంటే ఏంటి?
రౌండ్ రాబిన్ పద్ధతిలో వరల్డ్ కప్ టోర్నీ నిర్వహించడం ఇది మూడోసారి. అంతకుముందు 1992, 2019లో ఈ ఫార్మాట్‌లోనే టోర్నీని నిర్వహించారు. ఈ పద్ధతిలో టోర్నీలో పాల్గొంటున్న ప్రతి జట్టు.. ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సివుంటుంది. ఈ లెక్కన అన్ని జట్లు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడతాయి. ఇందులో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచి టాప్-4లో చోటు దక్కించుకున్న జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. పాయింట్ల పట్టికలో నంబర్-1, నంబర్-4 జట్ల మధ్య తొలి సెమీఫైనల్(నవంబర్ 15న ముంబై) జరగనుండగా.. నంబర్-2, నంబర్-3 జట్ల మధ్య రెండో సెమీఫైనల్(నవంబర్ 16న కోల్‌కతా) మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్(నవంబర్ 19న అహ్మదాబాద్)లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంటాయి.
టీమిండియా రికార్డులు అంతంత మాత్రమే
రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో భారత జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. తొలిసారిగా 1992లో భారత జట్టు ఈ ఫార్మాట్‌లో ఆడినప్పుడు సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. అనంతరం 2019 ఎడిషన్‌లో సెమీ-ఫైనల్ చేరుకున్నప్పటికీ.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై ఫైనల్ చేరుకోలేకపోయింది. ఈసారైనా ఆ గండం గండెక్కుతుందేమో చూడాలి.
ఈ ఫార్మాట్‌లో టోర్నీ నిర్వహించడం అన్ని జట్లకు టైటిల్ గెలిచే అవకాశాలు కలిగిస్తోంది. ఒక మ్యాచులో ఓడినా.. తరువాత మ్యాచుల్లో గెలిచి సెమీఫైనల్ రేసులో నిలవచ్చు. దీంతో లీగ్ మ్యాచులు ముగిసేవరకు ఉత్కంఠ పోరు తప్పకపోవచ్చు.