వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక భారీ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 175 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 355 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో యూఏఈ 180 పరుగులకే కుప్పకూలింది.
టాస్ గెలిచి యూఏఈ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. నిస్సంక(57)- దిముత్ కరుణరత్నే(52) జోడి తొలి వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత వచ్చిన కుషాల్ మెండిస్(78), సమరవిక్రమ(73), చరిత అసలంక(48), వహిందు హసరంగా(23) కూడా మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 355 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 356 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ బ్యాటర్లు ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. హసరంగా 6 వికెట్లు తీసి వారిని కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
మరో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఒమన్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 281 పరుగులు చేయగా, ఒమన్ 48.1 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని చేధించింది.
కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో 2 బెర్తుల కోసం విండీస్, శ్రీలంక, జింబాబ్వే సహా మొత్తం 10 జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో విన్నర్, రన్నరప్‌లు భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్లతో వన్డే వరల్డ్‌కప్-2023లో పోటీపడతాయి. గ్రూప్-ఏలో జింబాబ్వే, నేపాల్, వెస్టిండీస్, యూఎస్ఏ, నెదర్లాండ్స్ జట్లు ఉండగా.. గ్రూప్-బిలో శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్, ఒమన్, స్కాట్లాండ్ జట్లు పోటీపడుతున్నాయి.