ఇచ్చంపల్లి కట్ట చెక్కు చెదరలే!.. 160 ఏండ్లయినా దెబ్బతినని  కట్టడాలు

  • ఇచ్చంపల్లి కట్ట చెక్కు చెదరలే!
  • గతేడాది వరదలకు కుప్పకూలిన కన్నెపల్లి కాంక్రీట్​ గోడ
  • ఆ స్థాయి వరదకూ తట్టుకొని నిలబడిన ఇచ్చంపల్లి గోడలు 
  • 160 ఏండ్లయినా దెబ్బతినని  కట్టడాలు
  • అబ్బురపరిచేలా నాటి ఇంజినీరింగ్‌‌‌‌ నైపుణ్యం

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు:  ప్రపంచం అబ్బురపడేలా నిర్మించామని చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్​హౌస్​ కాంక్రీట్​ గోడ గతేడాది గోదావరికి వచ్చిన వరదలకు కూలిపోగా,160 ఏండ్ల కింద నిర్మించిన ఇచ్చంపల్లి కట్టడాలు మాత్రం చెక్కుచెదరలేదు. జూలై14న ఎన్నడూ లేనంతగా 28 లక్షల క్యూసెక్కుల  వరద రావడం వల్లే కన్నెపల్లి వద్ద కాంక్రీట్ గోడ కూలినట్లు ఇంజినీర్లు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఇదే మాట చెప్పి కాంట్రాక్టర్​ తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. కానీ 1860లో నిర్మించిన ఇచ్చంపల్లి గోడలు ఇంతకాలం ఎన్నో వరదలను తట్టుకుని  నిలబడ్డాయి. గోదావరి అడుగు భాగం నుంచి మూడు మీటర్ల ఎత్తుతో కట్టిన రాళ్ల గోడలో ఒక్కరాయి కూడా జూలై 14నాటి వరదకు ఊడిపోలేదు. 

భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో నిజాం  హయాంలో  చేపట్టిన ఇచ్చంపల్లి ఆనకట్టను ఫ్రాన్స్​నుంచి వచ్చిన ఇంజినీర్ల ఆధ్వర్యంలో నిర్మించారు. స్థానికంగా తయారు చేసిన డంగు సున్నాన్నే ఇందుకు వినియోగించారు. గోదావరికి అడ్డుగా రాతి కట్ట నిర్మిస్తున్న సమయంలో ప్లేగు వ్యాధి ప్రబలి  పలువురు ఇంజినీర్లు, కూలీలు చనిపోగా ప్రాజెక్ట్‌‌‌‌ నిర్మాణాన్ని మధ్యలోనే  ఆపేశారు. కన్నెపల్లి పంపుహౌజ్​ గోదావరికి 700 మీటర్ల దూరంలో నిర్మించగా.. ఇచ్చంపల్లి పూర్తిగా గోదావరి మధ్యలో నిర్మించారు.  28 లక్షల క్యూసెక్కుల వరదకే కన్నెపల్లి పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌  కాంక్రీట్‌‌‌‌ గోడ పగిలి మోటార్లు మునిగిపోగా,  సరిగ్గా అదే సమయంలో గోదావరి, ఇంద్రావతి నుంచి  32 లక్షల క్యుసెక్కుల వరద ముంచెత్తినా ఇచ్చంపల్లి కట్టడాలకు ఏమీ కాలేదు. 

నదిలో  ప్రవాహానికి అడ్డంగా రాళ్లగోడతో పాటు చత్తీస్‌‌‌‌ గఢ్‌‌‌‌ వైపు కట్టిన రాతి గోడలు కూడా పటిష్టంగా ఉన్న విషయం తాజాగా ‘వెలుగు’ టీమ్​ పరిశీలనలో తేలింది. వందలాది ఇంజినీర్లు, అత్యంత ఆధునాతన టెక్నాలజీ,  మిషనరీని ఉపయోగించి నిర్మించిన కాంక్రీట్​గోడ, కట్టిన మూడేండ్లకే కూలిపోతే, 160 ఏండ్ల కింద కట్టిన నిర్మాణం చెక్కుచెదరకపోవడాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. నేటి ఇంజినీర్ల కంటే నాటి ఇంజినీర్ల నైపుణ్యం గొప్పదా? లేదంటే అప్పటి పనులతో పోల్చినప్పుడు ఇప్పటి పనుల్లో క్వాలిటీ తగ్గిందా? అని చర్చించుకుంటున్నారు.