కస్టమర్ల డబ్బుతో క్రికెట్ బెట్టింగ్.. రూ. 8.50 కోట్లు వాడుకున్న ఐసీఐసీఐ డిప్యూటీ మేనేజర్

కస్టమర్ల డబ్బుతో క్రికెట్ బెట్టింగ్.. రూ. 8.50 కోట్లు వాడుకున్న ఐసీఐసీఐ డిప్యూటీ మేనేజర్

బ్యాంకులో పనిచేస్తున్న ఓ వ్యక్తి బ్యాంకుకే కన్నం వేశాడు. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా బ్యాంకు కస్టమర్ల ఖాతాల నుంచి రూ. 8.5 కోట్లు కొల్లగొట్టాడు. బ్యాంకుకు కన్నం వేసిన వ్యక్తి సాధారణ ఉద్యోగి కాదు..అతను ఏకంగా బ్యాంకు డిప్యూటీ మేనేజర్ బైరిశెట్టి కార్తీక్. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే..అతను సొంతానికి ఈ సొమ్మును వాడుకోలేదు. ఎవరికి అప్పు ఇవ్వలేదు. ఏ అప్పు కట్టలేదు.  మరి ఏం చేశాడంటే..ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఖాతాదారుల సొమ్ముతో బెట్టింగ్..

వరంగల్​ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకులో  బైరిశెట్టి కార్తీక్​ గోల్డ్​లోను సెక్షన్​లో డిప్యూటీ మేనేజర్​గా పని చేస్తున్నాడు. బ్యాంకులో గోల్డ్​లోన్​, రెన్యువల్స్​, ముగింపు ఖాతాలను అతను చూసుకుంటాడు. అయితే కార్తీక్ కు క్రికెట్ బెట్టింగ్ పై మోజు ఎక్కువ. అతను రెగ్యులర్ గా బెట్టింగ్ లు కాస్తుంటాడు. ఈ క్రమంలోనే  భారీ మొత్తంలో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడ్డాడు. ఖాతాదారుల సొమ్ముతో బెట్టింగ్ నిర్వహిస్తూ.. కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాడు. అందులో భాగంగా 128 మంది ఖాతాదారుల పేరిట బంగారం రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించి.. ఏకంగా రూ.8.50 కోట్ల రూపాయలను బెట్టింగ్ లో పెట్టాడు. 

అనుమానం రాలేదా..?

బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులు లోన్ తీర్చేందుకు వచ్చినప్పుడు కార్తీక్ వారి నుంచి డబ్బులు తీసుకుని బంగారు ఆభరణాలను ఇచ్చేవాడు. కానీ లోన్ అకౌంట్ మాత్రం క్లోజ్ చేసేవాడు కాదు. ఆయా ఖాతాల్లో నెల నెల వడ్డీ జమ చేసేవాడు. ఖాతాదారులు చెల్లించిన నగదును తన బినామీ ఖాతాలో వేసుకునే వాడు. దీంతో ఈ అక్రమాలపై ఖాతాదారులు ఎవరూ బ్యాంకు పై అధికారులకు ఫిర్యాదు చేయలేదు. ఖాతాదారుల పేరిట కార్తీక్..నకిలీ ఇన్ వాయిస్ లు సృష్టించే వాడు. బ్యాంకు సిబ్బంది సంతకాలు ఫోర్జరీ చేసి ..రూ. 8.50 కోట్లు  స్వాహా చేశాడు. 

మరి ఎలా బయటపడిందంటే

 బ్యాంకు అడిటింగ్​ అధికారులు ఖాతాలను చెక్​ చేయడంతో విషయం వెలుగు చూసింది. రూ.8.65 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అడిట్ చేసిన అధికారులు గుర్తించారు. ఈమేరకు బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో డిప్యూటీ మేనేజర్​ కార్తీక్​ చేసిన మోసం బయటపడింది. ఈ విషయం తెలియడంతో  కార్తీక్ పారిపోయాడు. కార్తీక్ కోసం గాలించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారించగా..చేసిన నేరం ఒప్పుకున్నాడు.  2019 నుంచి 2023 ఆగస్టు వరకు నర్సంపేట ఐసీఐసీఐ బ్యాంకులో  128 మంది ఖాతాదారులను వాడుకొని రూ.8.50 కోట్లు మోసం చేసినట్లు తెలిపాడు. బ్యాంకులో కొట్టేసిన డబ్బుతో ఆన్​లైన్​ క్రికెట్​ బెట్టింగ్​ఆడి పోగొట్టుకున్నాడని పోలీసులకు తెలిపాడు.  బైరిశెట్టి కార్తీక్​ను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.