తెలుగు రాష్ట్రాల్లో  కొత్తగా 57 ICICI బ్రాంచ్‌‌‌‌లు

తెలుగు రాష్ట్రాల్లో  కొత్తగా 57 ICICI బ్రాంచ్‌‌‌‌లు
  •                మొత్తంగా తెలంగాణలో 223, ఏపీలో 179 బ్రాంచ్‌‌లు
  •                 కర్నాటకలో కూడా 44 కొత్త బ్రాంచ్‌‌లు

ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌‌ తెలంగాణ, ఆంధ్రాలో మరిన్ని కొత్త బ్రాంచ్‌‌లను తెరిచింది. ఈ ఏడాది తన రిటైల్ నెట్‌‌వర్క్ విస్తరణలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 57 బ్రాంచ్‌‌లను ఓపెన్ చేసినట్టు ప్రకటించింది. ఈ విస్తరణతో, తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్‌‌కున్న మొత్తం బ్రాంచ్‌‌లు 402గా, ఏటీఎంలు 1,580గా ఐసీఐసీఐ బ్యాంక్‌‌ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా బ్యాంక్ బ్రాంచ్‌‌ల విస్తరణలో భాగంగా ఇక్కడ కూడా కొత్త శాఖలను ఏర్పాటు చేసినట్టు ఐసీఐసీఐ తెలిపింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ దేశవ్యాప్తంగా 450 కొత్త బ్రాంచ్‌‌లను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుప్ బాగ్చి చెప్పారు. వాటిలో 388కి పైగా బ్రాంచ్‌‌లను ఇప్పటికే ఓపెన్ చేసినట్టు పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 402 బ్రాంచ్‌‌ల్లో 179 బ్రాంచ్‌‌లు ఏపీలో, 223 బ్రాంచ్‌‌లు తెలంగాణలో ఉన్నట్టు చెప్పారు. కొత్తగా తెరిచిన 57 బ్రాంచ్‌‌ల్లో 23 ఏపీలో,34  తెలంగాణలో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కొత్త బ్రాంచ్‌‌ల్లో రెండింటిని బ్యాంకింగ్ సేవలు అందని, కర్నూల్ జిల్లా కరివీనాలో, మహబూబ్‌‌నగర్ జిల్లా బోయినపల్లెలో ఏర్పాటు చేసినట్టు ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. ఇతర బ్రాంచ్‌‌లను హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో తెరిచినట్టు చెప్పింది.

కర్నాటకలో కూడా 44 కొత్త బ్రాంచ్‌‌లను ఏర్పాటు చేసింది. వాటిలో ఏడు బ్రాంచ్‌‌లను ఇప్పటి వరకు బ్యాంకింగ్ సేవలందని గ్రామాల్లో తెరిచింది. మిగిలిన బ్రాంచ్‌‌లను బెంగళూరు, చిక్‌‌మంగళూరు, చిత్రదుర్గా వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్టు బ్యాంక్ ప్రకటించింది. ఈ విస్తరణతో కర్నాటకలో 333 బ్రాంచ్‌‌లు, 1,280 ఏటీఎంలు ఉంటాయని బ్యాంకు తెలిపింది.

సగానికి పైగా బ్రాంచ్‌‌లు రూరల్, సెమీ అర్బన్‌‌ల్లోనే…

దేశవ్యాప్తంగా ఐసీఐసీఐ బ్యాంక్‌‌కు సుమారు 5260 బ్రాంచ్‌‌ల రిటైల్ నెట్‌‌వర్క్ ఉంది. సగానికి పైగా బ్రాంచ్‌‌లు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఫైనాన్సియల్ ఇన్‌‌క్లూజిన్ అందించడమే లక్ష్యంగా బ్రాంచ్‌‌లను ఏర్పాటు చేసింది. రిటైల్ బ్యాంకింగ్‌‌కు బ్రాంచ్ నెట్‌‌వర్క్‌‌ను విస్తరించడం ఎంతో ముఖ్యమని బాగ్చి చెప్పారు. కస్టమర్లతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రొడక్ట్‌‌లను, ఆఫర్స్‌‌ను అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు బ్యాంకింగ్ సేవలు అందని ప్రాంతాలు, గ్రామాలతో పాటు ప్రముఖ నగరాల్లో కొత్త బ్రాంచ్‌‌లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. చాలా బ్రాంచ్‌‌లు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పనిచేస్తాయని, కొన్ని రాత్రి 8 వరకు తెరిచే ఉంటాయని ఐసీఐసీఐ బ్యాంక్ చెప్పింది. అకౌంట్లు, డిపాజిట్లు, పర్సనల్, ఆటో, హోమ్ లోన్లు వంటి రిటైల్ ప్రొడక్ట్‌‌లను ఈ బ్రాంచ్‌‌లు ఆఫర్ చేస్తున్నాయి. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో అదనంగా అగ్రి ప్రొడక్ట్‌‌లు, జువెల్ లోన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వంటి సేవలను అందిస్తున్నాయి.