న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ.11,746 కోట్ల (స్టాండెలోన్) కు పెరిగింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ. 10,261 కోట్లతో పోలిస్తే 14.5 శాతం వృద్ధి చెందింది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.40,697 కోట్ల నుంచి రూ.47,714 కోట్లకు చేరుకోగా, ఇందులో వడ్డీ ఆదాయం రూ.40,537 కోట్లుగా ఉంది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.34,920 కోట్ల వడ్డీ ఆదాయాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ సాధించింది.
బ్యాంక్ అసెట్ క్వాలిటీ క్యూ2 లో మెరుగుపడింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో 2.48 శాతంగా రికార్డ్ అయిన గ్రాస్ ఎన్‌పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్) రేషియో, క్యూ2 లో 1.97 శాతానికి తగ్గింది. అలానే నెట్ ఎన్‌పీఏ రేషియో 0.43 శాతం నుంచి 0.42 శాతానికి మెరుగుపడింది. కన్సాలిడేటెడ్ బేసిస్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌కు క్యూ2 లో రూ.12,948 కోట్ల నికర లాభం వచ్చింది. ఏడాది ప్రాతిపదికన 19 శాతం గ్రోత్ నమోదు చేసింది.
అదరగొట్టిన యెస్ బ్యాంక్..
కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే యెస్ బ్యాంక్ నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో 147 శాతం పెరిగింది. ప్రొవిజన్లు తగ్గడంతో బ్యాంక్ నెట్ ప్రాఫిట్ రూ.228.64 కోట్ల నుంచి రూ.566.59 కోట్లకు (కన్సాలిడేటెడ్) చేరుకుంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో రూ.516 కోట్ల నెట్ ప్రాఫిట్‌ను యెస్ బ్యాంక్ సాధించింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం క్యూ2లో ఏడాది ప్రాతిపదికన 14.3 శాతం పెరిగి రూ.2,200 కోట్లకు చేరుకోగా, వడ్డీయేతర ఆదాయం 16.3 శాతం వృద్ధి చెంది రూ.1,407 కోట్లను టచ్ చేసింది. బ్యాంక్ ఇచ్చిన అప్పులు 12.4 శాతం పెరిగాయి.
డిపాజిట్లు 18 శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు 17–18 శాతం పెరుగుతాయని యెస్ బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ అన్నారు. బ్యాంక్ గ్రాస్ ఎన్‌పీఏ రేషియో క్యూ2లో 1.6 శాతంగా రికార్డ్ అయ్యింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో నమోదైన 2 శాతం నుంచి తగ్గింది.