న్యూఢిల్లీ: నికర వడ్డీ ఆదాయం పెరగడంతో పాటు మొండిబాకీలు నిలకడగా ఉండడంతో 2024 డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) లో ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం 15 శా తం వృద్ధి చెంది రూ.11,792 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ నెట్ ప్రాఫిట్ రూ.11,495 కోట్లుగా ఉంటుందని బ్లూమ్‌బర్గ్ పోల్ అంచనా వేసింది.
ఐసీఐసీఐ బ్యాంక్‌కు క్యూ3 లో రూ. 20,371 కోట్ల నికర వడ్డీ ఆదాయం వచ్చింది. 2023 డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే 9 శాతం పెరిగింది. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌పీఏల) కోసం చేసే ప్రొవిజన్లు, కాంటింజెన్సీలు మాత్రం 17 శాతం పెరిగి రూ.1,227 కోట్లకు చేరుకున్నాయి.
ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోతను మొదలు పెట్టేంతవరకు నికర వడ్డీ మార్జిన్స్ నిలకడగా ఉంటాయని ఐసీఐసీఐ బ్యాంక్ భావిస్తోంది. రేట్ల కోత మొదలయ్యాక డిపాజిట్ల కంటే లోన్ల వడ్డీ రేట్లు తొందరగా మారతాయని, ఈ ప్రభావం మార్జిన్స్‌పై పడుతుందని పేర్కొంది.
బ్యాంక్ గ్రాస్ ఎన్‌పీఏల రేషియో ఏడాది ప్రాతిపదికన 2.30 శాతం నుంచి 1.97 శాతానికి, నెట్ ఎన్‌పీఏల రేషియో 0.44 శాతం నుంచి 0.42 శాతానికి మెరుగుపడ్డాయి.