
ఆర్థిక స్వావలంబన కొరవడి చదువులకు దూరమయ్యే యువతీయువకులను ట్రైన్ చేయడానికి ఐసీఐసీఐ ఫౌండేషన్ 2013లో ఐసీఐసీఐ అకాడమీ ఫర్ స్కిల్స్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పింది. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో భాగంగా నెలకొల్పిన ఈ అకాడమీ దేశవ్యాప్తంగా 25 సెంటర్ల ద్వారా ఇప్పటివరకు దాదాపు లక్షా 30 వేల మంది (52 వేల మంది మహిళలు) కి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించింది. సెల్లింగ్ స్కిల్స్, ఆఫీస్ అడ్మినిస్ర్టేషన్, ఎలక్ర్టికల్ అండ్ హోం అప్లయన్సెస్ రిపేర్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ రిపేర్, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్, పంప్స్ అండ్ మోటార్ రిపేర్, పెయింట్అప్లికేషన్ టెక్నిక్స్, ట్రాక్టర్ మెకానిక్, టు అండ్ త్రీ వీలర్ సర్వీస్ టెక్నీషియన్, రీటెయిల్ సేల్స్, అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్, హోం హెల్త్ ఎయిడ్ వంటి 12 కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. మరిన్ని వివరాలకు www.icicifoundation.org/icici-aca demy-for-skills/ వెబ్‌లింక్ చూడొచ్చు.
అర్హతలివే..
పదోతరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఉండాలి. డిగ్రీ లోపు నేరుగా అకాడమీలో సంప్రదించి అడ్మిషన్ పొందొచ్చు. సంస్థ నిర్వహించే అవగాహన కార్యక్రమాలు, ఎన్జీవోలు, ప్రభుత్వం, టాప్ కంపెనీల రెఫరెన్స్ ద్వారా కూడా ప్రవేశం కల్పిస్తారు. రెండు పాస్‌పోర్ట్ సైజ్ఫోటోగ్రాఫ్స్, ఐడీ, అడ్రస్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్లాలి.
ఎక్స్పర్ట్ టీచింగ్
హైదరాబాద్‌లో అసెంబ్లీకి ఎదురుగా ఉన్న ఐసీఐసీఐ అకాడమీ.. ఆఫీస్ అడ్మినిస్ర్టేషన్, సెల్లింగ్ స్కిల్స్, రీటెయిల్ స్కిల్స్ వంటి మూడు కోర్సుల్లో ఫ్రీ ట్రైనింగ్ ఇస్తోంది. శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. యూనిఫామ్స్, కోర్సు మెటీరియల్, స్టేషనరీ వంటివి అందిస్తారు. అధునాతన క్లాస్‌రూమ్స్, అడ్వాన్స్డ్ కంప్యూటర్ ల్యాబ్స్ లో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. అకాడమీ సొంతంగా రూపొందించున్న కరిక్యులమ్ బోధిస్తారు. కోర్సు ట్రైనింగ్‌కు అదనంగా కమ్యూనికేషన్ అండ్ ఫైనాన్స్ స్కిల్స్, ఎటిక్వెట్ అండ్ గ్రూమింగ్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. కోర్సుకు సంబంధించిన సందేహాలతో పాటు కెరీర్స్, ఉద్యోగావకాశాలు వంటి వాటిపై ఫ్యాకల్టీ అవగాహన కల్పిస్తారు.
350 కంపెనీల్లో జాబ్స్
ట్రైనింగ్ పూర్తిచేసుకున్నవారికి అకాడమీలోనే ఇంటర్వ్యూలు, ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహించి దాదాపు 350 పైగా కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తారు. రిలయన్స్ ట్రెండ్స్, ఫ్యూచర్ ఫ్యాషన్, టాటా క్రోమా, ల్యాండ్‌మార్క్, లైఫ్‌స్టైల్, ట్యాలీ, వంటి సంస్థలు హైదరాబాద్‌లో ట్రైన్ అయిన స్టూడెంట్స్‌ను రిక్రూట్ చేసుకుంటున్నాయి.
– వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్