మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశంలోనే పేరు ప్రఖ్యాతలున్న గొప్ప వ్యక్తి. మైసూరు రాష్ట్రంలో దివాన్ గా పనిచేశాడు. ఓసారి ఆయన విదేశాలకు వెళ్దామని బ్యాంక్ లో తన కరెంట్ అకౌంట్ మీద ఓవర్ డ్రాఫ్ట్ అడగాలని ‘బ్యాంక్ ఆఫ్ మైసూర్’ అధికారులకు ఉదయం పదకొండుంపావుకు వస్తానని కబురు చేశాడు. సరిగ్గా 11.14 నిమిషాలకు కారు దిగితే ఆయన కోసం ఎదురు చూస్తున్న బ్యాంకు మేనేజర్ నారాయణ రెడ్డి అవాక్కయ్యాడు. అదీ ‘మోక్షగుండం’ సమయపాలన. లోపలికి వెళ్లాక.. ఓవర్ డ్రాఫ్ట్ కాగితాలను పరిశీలించిన విశ్వేశ్వరయ్య అందులో తక్కువ వడ్డీ ఉండటం చూసి- ‘మేనేజర్ గారూ! ఇంత తక్కువ వడ్డీని నాపై ప్రత్యేకంగా చొరవ చూపి తగ్గించారా? అందరికీ ఇలాగే చేస్తున్నారా?’ అని ప్రశ్నించాడు. మేనేజర్ ‘మీ కోసం ప్రత్యేకం’ అన్నట్టు చూస్తే ‘వడ్డీ మిగతావాళ్లకు ఎలా వసూలు చేస్తున్నారో నాకూ అలాగే చేయండ’ని పట్టుబట్టి మరీ రాయించుకున్నాడు. తనకు ఎలాంటి ప్రత్యేకత వద్దన్నాడు. ఇందులో కొసమెరుపు ఏమిటంటే- అసలు బ్యాంక్ ఆఫ్ మైసూర్‌ను స్థాపించిందే విశ్వేశ్వరయ్య. మైసూర్ స్టేట్ దివాన్‌గా పనిచేసిన అంత పెద్ద ఉన్నతోద్యోగి సాధారణ వ్యక్తిలా బ్యాంకు అధికారులతో వ్యవహరించడం ఆయన ఆదర్శాలకు నిలువెత్తు నిదర్శనం.
నేటి సెలబ్రిటీలు?
మరి నేటి సెలబ్రిటీలు ఎలా ఉన్నారు? స్టార్ క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలుగా చెలామణి అవుతున్న ధనవంతులు, రాజకీయ నాయకులు, సినిమా తారలు, కాంట్రాక్టర్లు.. అందరూ సెలబ్రిటీలే. ఒక్క సీరియల్లో ఒక్క ఎపిసోడ్లో నటించినా ఆ మహానుభావుడు లేదా ఆ నటీమణి స్టార్ కాంపెయినరే. తెలుగు- ఆంగ్ల సంకర భాషతో అష్టవంకర్లు తిరుగుతూ అకారణ హాస్యంతో తన వాచాలతను ప్రదర్శించినా సరే, వారే మన మీడియాకు ఆదర్శ ఆరాధ్య పురుషులు. ఇంకా విచిత్రం ఏమిటంటే వాళ్లు తప్పులు చేస్తే ఇంకాస్త పాపులర్ అవుతారు. పబ్బుల్లోనో, హుక్కా సెంటర్లలోనో, బైక్ రైడింగ్లోనో, డ్రంక్ అండ్ డ్రైవ్‌లోనో, ఏదైనా ఫామ్ హౌజ్ వ్యభిచారంలోనో పట్టుబడితే వాళ్లకు మరింత పవిత్రత, ప్రచారం ఖాయం! వాళ్ల సినిమాలు, సీరియళ్లూ, ఇతర యాంకరింగులూ ఇంకా భారీ రేటింగ్ తో నడుస్తాయి. ఈ ‘అర్హత’ వాళ్లకు మరింతగా ఉపయోగపడుతుంది. వీలైతే ఆడవాళ్లనో, ఏదైనా కులాన్నో, మతాన్నో విమర్శిస్తే మరింత పాపులర్ అవుతారు. ఇటీవల సినిమా రంగంలోని అగ్రశ్రేణి నటులు, నిర్మాతలు, దర్శకులు, కొందరు పోరంబోకు యాక్టర్లు ‘డ్రగ్స్ స్కాం’లో మళ్లీ ఇరుక్కున్నారు. వాళ్లేదో అశ్వమేధయాగాలు, రాజసూయయాగాలు చేసే మునుల్లా నీతివాక్యాలు వల్లిస్తారు. వాళ్ల పెళ్లిండ్లు, సంతానం కనడాలు, విడాకులు యావత్ జాతికే ముఖ్యాంశాలు కావడం విడ్డూరం. వీళ్లలో కొందరు కోకోకోలాకు, కోల్గేటుకు ప్రచార కర్తలు. జీవితాంతం సంపాదించిన డబ్బుతో, పేరుతో ఇటీవల వీరిలో కొందరు రాజకీయ నాయకుల అవతారం ఎత్తుతున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ నాయకుల చంక కిందకు చేరి తమ పనులు నొక్కించుకుంటున్నారు. స్టూడియోల పేరుతో కొందరు, రాయితీల పేరుతో మరికొందరు తమ కార్యాలయ గంధర్వుల ద్వారా అనుకున్నవి సాధించుకుంటున్నారు. ఇక్కడ మాత్రం ప్రాంతీయ భేదాలు లేవు. వీళ్లెక్కడికెళ్లినా ప్రత్యేక సదుపాయాలు.- తిరుమలకు వెళ్లినా అది కూడా తమ ప్రచారానికే వాడుకుంటున్నారు. తమ దగ్గర ఉన్న డబ్బుపై ప్రభుత్వాల కన్నుబడకుండా ఉండేందుకు వీళ్లు ఆడుతున్న నాటకాలకు ఎన్ని ‘ఆస్కార్’లు ఇచ్చినా తక్కువే. విచిత్రం ఏమిటంటే- వీళ్లంతా ఇవాళ సెలబ్రిటీలు. ప్రజలంతా వాళ్ల ముఖాలు చూడడానికి, వాళ్లతో కలవడానికి వెర్రిగెంతులు వేస్తున్నారు. వాళ్ల బతుకులూ, వాళ్ల తప్పులూ, ఒప్పులూ.. అన్నీ ఇవాళ మీడియాకు దినభత్యమే. పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి జరిగి మన సైనికులు ప్రాణాలు వదులుతుంటే ఇక్కడ ఓ సినిమా నాయకుడి జన్మదిన సంబరాలను చేస్తుంది ఓ న్యూస్ ఛానల్. విస్తృత సమాజ జీవనాన్ని గాలికి వదిలేసి ఎవరికీ పనికిరాని అంశం వీళ్లకు గొప్ప మసాలా. పరోక్షంగా అక్రమ సంబంధాలను, ఇల్లీగల్ సెటిల్మెంట్లను ప్రజల మెదళ్లలోకి ఎక్కించడం
మన ఛానళ్లభావ దారిద్ర్యం!
ALSO READ :పేరు మారినంత మాత్రాన.. తీరు మారదు : ప్రధాని మోదీ
గంధర్వులకే నటన నేర్పగల సమర్థులు వీళ్లు?
రాజకీయవేత్తలు, టాప్ లెవెల్లో ఉన్నవారు మాత్రమే బాగుంటే సరిపోదు. తమ పార్టీల్లో గ్రామస్థాయి పదవుల్లో ఉన్నవాళ్లకు కూడా సరైన శిక్షణ ఇవ్వాలి. అకడమిక్ గా నాయకులు చేయాల్సిన పనులను, ఆదర్శాలను, పాతతరం నాయకుల విలువలను శిక్షణలో భాగంగా నేర్పించాలి. అవేవీ లేకుండా కేవలం ‘రాజకీయాలే’ నేర్పిస్తే ఆ నాయకుడి పని ‘పదవే పరమావధి’గా భావించి దేశాన్ని దోచేస్తాడు. తాను స్థాపించిన బ్యాంకులోనే సాధారణ అకౌంట్ హెూల్డర్గా ఉండాలనుకునే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి ప్రుడెన్షియల్ బ్యాంక్, చార్మినార్ బ్యాంకులను నిండా ముంచిన నాయకులు తెలుసుకోవాలి. కొల్లాయిగట్టి అర్ధనగ్న అవతారమెత్తిన గాంధీజీ జీవితాన్ని.. కింగ్ ఫిషర్ హీరో విజయ్ మాల్యా జీవితం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. విదేశీయులను వెళ్లగొట్టడం కోసం గాంధీజీ త్యాగాలు చేస్తే, దేశాన్ని మోసం చేసి సుఖాలను అనుభవించడం కోసం విజయ మాల్యా విదేశాలకు పారిపోయాడు. ఎంత తేడా? తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, కవులు రాజకీయ రంగంలోకి వచ్చినా పచ్చి రాజకీయ వాసనలు లేకపోతే జీవించలేని స్థితిలోకి ప్రజలను నెట్టేశారు. భారతదేశపు చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్ ఒక గొప్ప ఉర్దూ కవి. అందుకే బ్రిటిష్‌వారు అతని దగ్గర నుంచి సులభంగా భారతదేశాన్ని లాగేసుకున్నారు. అతను ఓ చక్రవర్తి కొడుకు కావడం యాదృచ్ఛికం. కానీ ఓ కవి రాష్ట్రపతి కావడమనేది ఇప్పుడు సాధ్యం కాదు. అంబేద్కర్‌కు రాజ్యాంగ పాఠాలు చెప్పగల దిట్టలు, గాంధీకే అహింస ప్రబోధాన్ని తిరగేసి చెప్పగల సమర్థులు ఇప్పుడు గ్రామానికో వ్యక్తి కనిపిస్తున్నాడు. గంధర్వులకే నటన నేర్పగల నటులూ ఉన్నారు. ఇక మనల్ని సెలబ్రిటీల నుంచి ఎవరు కాపాడగలరు ?
రాజకీయనాయకుల తీరు మరోలా..
మన రాజకీయ నేతలూ ఈరోజు సెలబ్రిటీలే. ప్రజలకు సేవ చేయాల్సిన నాయకుల్లో కొందరు తమ జ్ఞాన విస్తృతిని పెంచుకోకుండా అంగబలం, అర్థబలం, కులబలంతో పదవులు వెలగబెట్టడం విడ్డూరం. గాంధీ, నేతాజీ, పటేల్, శాస్త్రీ, ఇందిర, జేపీ, వాజ్‌పేయి లాంటి నేతలు ప్రజల కోసం తమ సర్వస్వాన్ని వదులుకున్నారు. కొందరు తమ నైతిక విలువలకు కట్టుబడి జీవితాన్ని కొనసాగించారు. సిద్ధాంతాలకు విలువిచ్చారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ, సోమేపల్లి సోమయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, జార్జి ఫెర్నాండెజ్‌లు పెద్ద నాయకులైనా, అంత పెద్ద పదవులు నిర్వహించినా చాలా సాదాసీదాగా ఉండేవారు. సరే.. రానురాను నిరాడంబరంగా జీవించడం వదిలేసినా, ప్రజలతో మమేకం అయ్యే నాయకులను ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు. అధికార దర్పం తగ్గించడం కోసం కేంద్రం వీఐపీల వాహనాలపై ‘ఎర్రబుగ్గ’ను తొలగించింది. కానీ ఓడిపోయిన సర్పంచులు కూడా తమ కార్లపై ఎర్రరంగుతో పేర్లు రాసుకుని వీఐపీల్లా పోజు ఇస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో కొందరికి రాజకీయ పునరావాసం కోసం పదవుల్లో ఉన్న వాళ్లందరినీ కోర్టు ఆదేశాల ద్వారా తొలగించారు. అలాగే తెలంగాణలో కార్యదర్శులను నియమించడంపై వివాదం వచ్చింది. పదవులు అధికార దర్పం ప్రదర్శించడానికి కాదు.
మహనీయుల ఆదర్శాలు ఏవి?
12వ శతాబ్దంలో బిజ్జల మహారాజు దగ్గర ప్రధానిగా, భండారిగా పనిచేసిన బసవేశ్వరుడు తన దగ్గర వ్యక్తిగత విషయాలను మాట్లాడడానికి వచ్చిన మనుషులను ఒక్క నిమిషం ఆపి, అక్కడ అప్పటి వరకున్న దీపం ఆర్పి రెండవ దీపం వెలిగిస్తాడు. ఎందుకు ఆ దీపం ఆర్పారని వచ్చినవాళ్లు ప్రశ్నిస్తే అది ప్రభుత్వ దీపం. ఇది నా సొంత దీపం అనేవాడట! ఇదీ వాళ్ల నిబద్ధత. ‘ప్రజాధనం అనేది భారతదేశపు బీద ప్రజలకు చెందింది. కాబట్టి ప్రజాధనాన్ని వ్యయం చేసే విషయంలో అత్యంత జాగరూకతతో మెలగాలి’ అని మహాత్మాగాంధీ స్వయంగా ప్రకటించారు. ఇవాళ సెక్యూరిటీ పేరుతో, ఆడంబరాల పేరుతో ఎంతో రాజకీయం నడుస్తోంది. దేశానికి అణుశాస్త్రాన్ని, ఏరోనాటికల్ వ్యవస్థను అందించిన డా. ఏపీజే అబ్దుల్ కలాం తన పదవీ విరమణ తర్వాత పాఠాలు బోధించడానికి వెళ్లిపోయారు. చివరకు బోధిస్తూనే మరణించారు. తన పరిశోధనలకు రాయల్ సొసైటీ వాళ్లు డబ్బులిస్తామన్నా తిరస్కరించిన హరగోవింద్ ఖురానా, జగదీశ్ చంద్రబోస్ లాంటి మహనీయులను ఈనాడు ‘పరిశోధనలను వేలం పెడుతున్నవాళ్లు’ అధ్యయనం చేయాలి.
- డా.పి. భాస్కర యోగి,సోషల్ ఎనలిస్ట్