న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల కోసం భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి(అంతర్ గావ్)లో కొత్త సైట్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని కేంద్రం వెల్లడించింది. అయితే, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్(జీఎఫ్ఏ) కింద ఈ సైట్ క్లియరెన్స్ కు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రపోజల్ అందలేదని పేర్కొంది. ఈ మేరకు ఎంపీ ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మురళి మెహోల్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆరు ప్రదేశాలను ప్రతిపాదించగా.. వరంగల్, ఆదిలాబాద్ (బ్రౌన్ ఫీల్డ్), జక్రాన్ పల్లి(గ్రీన్ ఫీల్డ్) ఎయిర్ పోర్టుల ఏర్పాటు సాంకేతికంగా సాధ్యమని అధ్యయనంలో తేలిందన్నారు.ఈ మూడు ఎయిర్ పోర్టుల కోసం పౌర విమానయాన శాఖ నుంచి అవసరమైన అనుమతులు పొందాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్టు సమాధానంలో పేర్కొన్నారు. కాగా, జీఎఫ్ఏ పాలసీ ప్రకారం.. ఈ ఎయిర్ పోర్టులకు కావాల్సిన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, నిధులు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అమలు బాధ్యత సంబంధిత ఎయిర్ పోర్ట్ డెవలపర్ లేదా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేశారు.
అలాగే, రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆలేరు, కాగజ్‌పూర్ ఎయిర్ పోర్టులు/ఎయిర్‌స్ట్రిప్‌లు ఉడాన్ డాక్యుమెంట్‌లోని అన్‌సర్డ్వ్ ఎయిర్‌పోర్టుల తాత్కాలిక జాబితాలో అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు. అయితే, ఈ ఎయిర్‌స్ట్రిప్‌ల నుంచి ఆర్‌సీఎస్ విమానాలను నడపడానికి ఇప్పటి వరకు ఎయిర్‌లైన్ బిడ్డర్ ఎవరూ ప్రతిపాదనను సమర్పించలేదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా భవిష్యత్‌లో ఈ ఎయిర్‌స్ట్రిప్‌లను కనెక్ట్ చేసే మార్గాల కోసం ఎయిర్‌లైన్ దరఖాస్తు చేస్తే నిబంధనల ప్రకారం ముందుకెళ్తామని కేంద్ర మంత్రి చెప్పారు.