- ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌లో విగ్రహం
- రామదాసు వారసులకు అప్పగింత
నేలకొండపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా భద్రాచలంలో సీతారాముల ఆలయాన్ని నిర్మించిన భక్త రామదాసు (కంచర్ల గోపన్న) తొలి విగ్రహం బయటపడింది. జిల్లాలోని నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌లో భక్త రామదాసు విగ్రహాన్ని ఇటీవల గుర్తించారు. వారం రోజుల కింద పోలీసు స్టేషన్ ఆవరణలో ఉన్న విగ్రహాన్ని చూసిన ఆర్టీఐ కార్యకర్త పసుమర్తి శ్రీనివాస్ రావు ఫొటోలు తీసి కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్, కట్టా శ్రీనివాస్‌కు పంపారు.
వాటిని పరిశీలించిన వారు భక్త రామదాసు విగ్రహంగా నిర్ధారించి, ఆయన వారసుల్లో పదో తరానికి చెందిన కంచర్ల శ్రీనివాస్ రావుకు సమాచారం ఇచ్చారు. కాగా, రామదాసు విగ్రహం గుర్తించడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు ఆయన ఊహా చిత్రాలు మాత్రమే ఉన్నాయి. పోలీస్ స్టేషన్‌లో ఉన్న విగ్రహం కాసెపోసికట్టిన ధోతి, పైబట్ట వేయకుండా ఉంది. అంజలి ముద్రతో, మీసాలతో, తల వెనక జారుముడి వేసుకున్న గోష్పాదశిఖతో ఉన్న భక్తుడు కత్తి మొన కిందికి పెట్టి నిల్చున్నట్టు ఉంది.
భుజాల మీద శంఖ చక్రాల ముద్రలు ఉండగా, ఆయన వైష్ణవ భక్తుడని తెలుస్తున్నది. చెవులకు ఉన్న కుండలాలు, మెడలో హారం ఆయన నిరాడంబరతను తెలుపుతున్నాయని చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్, కట్టా శ్రీనివాస్ తెలిపారు. ఆహార్యాన్ని బట్టి ఆ విగ్రహం అక్కన్న, మాదన్నలది కాదని, భక్తరామదాసుదేనని అభిప్రాయపడ్డారు. దీంతో కంచర్ల శ్రీనివాస్ రావు నేలకొండపల్లికి వచ్చి విగ్రహాన్ని పరిశీలించారు.
ఎస్‌ఐ సతీశ్.. రామదాసు వారసులను సత్కరించి విగ్రహాన్ని వారికి అందజేశారు. దానిని శ్రీనివాస్ రావు స్థానిక భక్త రామదాసు ధ్యాన మందిరానికి అప్పగించారు. పూజారులు ప్రత్యేక పూజలు చేసి భక్తుల దర్శనం కోసం ఉంచారు. ఫిబ్రవరి 11 నుంచి భక్త రామదాసు ఆరాధన ఉత్సవాలు జరుగుతాయని, అంతకు ముందే విగ్రహం దొరకడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.