భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా బైలడిల్లా అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య ప్రాంత ఇన్‌చార్జి మాచర్ల ఏసోబు (70) అలియాస్ జగన్, రణధీర్, దాదా చనిపోయారు. ఈ మేరకు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఎన్‌కౌంటర్‌లో మొత్తం 9 మంది చనిపోగా అందులో జగన్‌తో పాటు పీఎల్‌జీఏ సభ్యురాలు శాంతి, ఏరియా కమిటీ మెంబర్లు మడకం సుశీల, గంగి ముచికీ, కోసా మడవి, డివిజన్ కమిటీ సభ్యులు లలిత, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ గార్డు కవిత, డివిజన్ కమిటీ సభ్యుడు హిడ్మే మడకాం, ప్లాటూన్ సభ్యుడు కమలేశ్ అన్నట్లు ఐజీ తెలిపారు.
9 మందిపై మొత్తం రూ. 60 లక్షల రివార్డు ఉండగా, ఇందులో జగన్ ఒక్కడిపైనే రూ. 25 లక్షల రివార్డు ఉందన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో రెండు 303 రైఫిల్స్, రెండు 12 బోర్ రైఫిల్స్, రెండు బర్మార్ బందూక్‌లు, ఎస్‌ఎల్‌ఆర్, దేశీయ కార్బన్ 9ఎంఎం, 8 ఎంఎఎం రైఫిల్, 315 బోర్ రైఫిల్, బీజీఎల్ లాంచర్‌తో పాటు భారీగా పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్టు ఐజీ తెలిపారు.
జగన్ సొంతూరు హనుమకొండ జిల్లా టేకులగూడెం
హనుమకొండ, వెలుగు : మావోయిస్ట్ నేత మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ చనిపోవడంతో అతడి సొంతూరు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులవారిగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. టేకులగూడెం గ్రామానికి చెందిన ఏసోబు 1974లో 21 ఏండ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. 1978లో రైతు కూలీ సంఘం అధ్యక్షుడిగా పని చేసిన ఏసోబు తర్వాత పూర్తిగా అడవులకే అంకితం అయ్యాడు.
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో కీలకంగా ఎదిగి, పార్టీ అగ్రనేతలైన కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి గణపతికి స్పెషల్ ప్రొటెక్షన్ వింగ్ కమాండర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత కేంద్ర కమిటీ మిలిటరీ సభ్యుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం చత్తీస్‌గఢ్ రాష్ట్ర కమిటీ మిలిటరీ ఇన్‌చార్జిగా, మహారాష్ట్ర – చత్తీస్‌గఢ్ బార్డర్ ఇన్‌చార్జిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
ఏసోబు చనిపోయినట్లు దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పాటు ఏసోబు కుమారుడైన మహేశ్ చంద్రకు సమాచారం ఇచ్చాడు. దీంతో అతడి డెడ్‌బాడీని స్వగ్రామం టేకులగూడెం తీసుకొచ్చేందుకు మహేశ్చంద్రతో పాటు మరికొందరు దంతెవాడకు బయలుదేరారు. గురువారం ఉదయం టేకులగూడెం తీసుకొచ్చి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు.
నలుగురు అర్బన్ నక్సల్స్ అరెస్ట్
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రం అబూజ్‌మఢ్ అటవీ ప్రాంత గ్రామాలపై ఎన్‌ఐఏ రెండు రోజులుగా దాడులు నిర్వహిస్తోంది. నారాయణ్‌పూర్ జిల్లా ఓర్చా, కస్తూరిమెట్ట, మండలి, మల్కల్ గ్రామాల్లో తనిఖీలు చేపట్టిన ఎన్‌ఐఏ అర్బన్ నక్సల్స్ అంటూ నలుగురిని అరెస్ట్ చేసింది. మొత్తం 35 మంది వరకు అర్బన్ నక్సల్స్ ఉన్నారని ఎన్‌ఐఏ ఆఫీసర్లు చెబుతున్నారు. మాడ్ బచావో మంచ్ పేరిట గతంలో రోడ్లను తవ్వి, చెట్లను నరికి ఆందోళనకి దిగారు. ఈ సంస్థ మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని, ఆందోళనల పేరుతో భద్రతా దళాలపై దాడులు చేయడంతో, ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ ఆందోళనలకు కొర్రాం లక్మారాం సూత్రధారి అంటూ కేసు నమోదు చేశారు.