తెలంగాణ కిచెన్: కూల్​ వెదర్​లో నూల్​ వెరైటీ

కూల్​ కూల్​ వెదర్​లో నూల్​ వెరైటీలు ఈ వారం స్పెషల్.  ఈ సీజన్లోఎక్కువగా దొరికే చిలగడ దుంపతో కేరళ స్టైల్ నూల్ ఇడియాప్పమ్, పొరలు పొరలుగా ఉండే నూల్ పరోటాతోపాటు నూడుల్స్​తో కట్లెట్​..ఇలా వెరైటీ కాంబినేషన్​లతో టేస్టీ రెసిపీలు ఇవి. మరింకెందుకాలస్యం...వీటిని అస్సలు మిస్ కాకండి. 

నూల్​ అప్పమ్

కావాల్సినవి :

  • చిలగడ దుంప (స్వీట్​ పొటాటో): ఒక కిలో
  • బియ్యప్పిండి : అర కిలో
  • ఉప్పు : ఒక టీస్పూన్
  • పచ్చి కొబ్బరి తురుము :పావు కిలో
  • నూనె : రెండు టీస్పూన్లు
  • అరిటాకులు, నీళ్లు,
  • ఉప్పు : సరిపడా

తయారీ  : 

చిలగడ దుంపల్ని శుభ్రంగా కడిగి, ముక్కలుగా కట్ చేయాలి. వాటిని ఆవిరి మీద ఉడికించాలి. అందుకోసం ఇడ్లీ పాత్ర వాడొచ్చు. తర్వాత వాటి తొక్కతీసి మెత్తగా మెదపాలి. బియ్యప్పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. నీళ్లు పోస్తూ ముద్దగా అయ్యేవరకు కలపాలి. మూతపెట్టి కాసేపు పక్కన ఉంచాలి. రెడీ చేసుకున్న పిండి ముద్దను జంతికల గొట్టంలో వేసి గుండ్రంగా తిప్పుతూ అరిటాకు ముక్కల మీద వేయాలి. ఆపై కొబ్బరి తురుము చల్లాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు వేడిచేసి ఇడ్లీ ప్లేటు పెట్టి దానిపై అరిటాకులను ఉంచాలి. మూతపెట్టి ఆవిరి మీద ఉడికించాలి. అవి ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన కొబ్బరి తురుముతో కొబ్బరి పాలు తీయాలి. ఆ పాలను ఉడికించిన

ఇడియాప్పమ్​ మీద పోయాలి. అంతే.. టేస్టీ, హెల్దీ నూల్​ అప్పమ్ రెడీ.

నూడుల్స్ కట్లెట్

కావాల్సినవి :
నూడుల్స్ : ఒక ప్యాకెట్
నీళ్లు, ఉప్పు, నూడుల్స్ మసాలా : సరిపడా
ఆలుగడ్డ, పచ్చిమిర్చి  : ఒక్కోటి 
ఉల్లిగడ్డ తరుగు,
బటానీలు : ఒక్కో టేబుల్ స్పూన్
క్యారెట్, క్యాప్సికమ్ తురుము,
మైదా పిండి, కార్న్​ ఫ్లోర్ :  ఒక్కోటి రెండు టేబుల్‌‌‌‌ స్పూన్లు
కారం, జీలకర్ర పొడి  : అర టీస్పూన్
పసుపు : పావు టీస్పూన్

తయారీ : నీళ్లు వేడి చేసి నూడుల్స్ వేసి ఉడికించాలి, వాటిని ఒక గిన్నెలో వేసి అందులో ఉడికించి, మెదిపిన ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, క్యారెట్ తరుగు, బటానీలు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.  ఆ మిశ్రమాన్ని ఉండలు చేసి చేత్తో అదిమితే కట్లెట్ ఆకారం వస్తుంది. ఒక గిన్నెలో మైదా, కార్న్​ ఫ్లోర్ వేసి నీళ్లు పోసి కలపాలి. మరోవైపు నూడుల్స్​ను ముక్కలు చేసి పెట్టాలి. కట్లెట్​ని ముందుగా మైదా మిశ్రమంలో ముంచి తర్వాత నూడుల్స్​లో
దొర్లించాలి. పాన్​లో నూనె వేడి చేసి కట్లెట్​లు వేయాలి. రెండు వైపులా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్​లోకి తీయాలి. కాస్త చల్లారాక కెచెప్​తో తింటే టేస్టీగా ఉంటాయి. 

నూల్ పరోటా

కావాల్సినవి :
మైదా లేదా గోధుమ పిండి :
రెండున్నర కప్పులు
ఉప్పు : సరిపడా
చక్కెర : ఒక టేబుల్ స్పూన్
నీళ్లు : ఒకటిన్నర కప్పులు
నూనె : అర కప్పు
నెయ్యి : అర కప్పు

తయారీ  : ఒక గిన్నెలో మైదా లేదా గోధుమ పిండి, ఉప్పు, చక్కెర వేసి కలపాలి. అందులో నీళ్లు పోస్తూ చపాతీ ముద్దలా కలపాలి. మూతపెట్టి పావుగంటసేపుపక్కన ఉంచాలి. ఆ తర్వాత తీసి మరోసారి బాగా పిండినిసాగదీసి, ఆపై చిన్న ఉండలు చేయాలి. వాటిని చపాతీల్లాచేసి, చాకుతో సన్నగా  కట్ చేయాలి. ఒక గిన్నెలో నూనె, నెయ్యి వేసి కలపాలి. అందులో వీటిని ముంచి ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి. తర్వాత వాటిని పొడవుగా సాగదీసి, గుండ్రంగా చుట్టాలి. గాలి చొరబడకుండా మూతపెట్టి పది నిమిషాలు ఉంచాలి. ఆపై వాటిని చేత్తో కాస్త అదమాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో పరోటాను వేసి రెండు వైపులా కాల్చాలి. అంతే... పొరపొరలుగా ఉండే నూల్ పరోటా తినడానికి రెడీ.