విగ్రహావిష్కరణలు పెరుగుతున్నాయి

విగ్రహావిష్కరణలు పెరుగుతున్నాయి

దివంగతులైన మహానీయుల విగ్రహాల ఆవిష్కరణ చేసినంత మాత్రాన  అభివృద్ధి రాదు. కులాల వారీగా ప్రజలను విడదీసి రాజకీయాలు చేయడం మానవీయత అనిపించుకోదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కులాల వారిగా విగ్రహాల సంస్కృతి బాగా పెరిగింది. ప్రజలను ఉద్వేగాలలో పెంచి రాజకీయ పబ్బం గడుపుకునే వారికి విగ్రహాలనేవి ఆయుధాలు అయ్యాయి. ఈ తీరున విగ్రహాలు పెట్టుకుంటూ వెళితే మనుషుల కంటే విగ్రహాలే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. పూజించే సంస్కృతి, బానిస మనస్తత్వాల కారణంగానే విగ్రహాలు పెట్టే సంస్కృతి ప్రబలుతున్నది. 

ఇది అంటువ్యాధుల కంటే కూడా విపరీతమైన వేగంతో పాకుతున్నది. మనుషులను, ప్రజలను - మతస్తులుగా, కులస్తులుగా చీల్చడం సులువు. కనుకనే  కొందరు స్వార్థపూరిత రాజకీయ నాయకులు విగ్రహాల సంస్కృతిని కొంతమంది ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా ఈ దేశంలో ప్రోత్సహిస్తున్నారు. మనుషుల్లో నిగ్రహాలు లేకుండా విగ్రహాలు పెట్టుకోవడం, ఆ మహనీయుల ఆలోచనలను కనీసం తెలుసుకోలేని, మచ్చుకు కూడా పాటించని, పైగా వారి ఆశయాలకు, ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేసేవారు వందల అడుగుల విగ్రహాలను పెట్టినంత మాత్రాన వీరు వారైపోరు. 

విగ్రహాలు పెట్టుకోవడం వల్ల అభివృద్ధి చేసినట్టు కాదు. విగ్రహాల పేరున గుంపులను తయారు చేస్తే ఆ గుంపులే రేపు మూకలుగా తయారై  విచక్షణను కోల్పోయి, హింసా ప్రవృత్తిని ప్రకోపింపచేసుకుని తోటి మనుషులను హతమారుస్తాయి. అందులో రాజకీయ నాయకుడు కూడా ఉంటారు కదా! జన సమర్థం గల ప్రదేశాలలో, రోడ్లకు మధ్యన, డివైడర్ల పైన విచ్చలవిడిగా ఎవరికి తోచినట్టు వారు కులతత్వంతో, మతతత్వంతో, పార్టీ తత్వంతో ఇలా విగ్రహాలు నాటుకుంటూ పోతే జరిగే ప్రమాదాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? 


- కె శ్రీనివాసాచారి,సామాజిక కార్యకర్త