ఏం పోయేకాలం వచ్చింది: ఆలయాల్లో సాయిబాబా విగ్రహాల తొలగింపు

ఏం పోయేకాలం వచ్చింది: ఆలయాల్లో సాయిబాబా విగ్రహాల తొలగింపు

ఏం జరుగుతుంది అయ్యా దేశంలో.. తిరుమల లడ్డూ వివాదం చల్లారకముందే.. ఇప్పుడు సాయిబాబా ఇష్యూ పుట్టింది. ఏదో ఒక చోట.. పొరపాటుగా అనుకుంటే పర్వాలేదు.. అలా కాకుండా ఏకంగా 14 ఆలయాల్లో.. సాయిబాబా విగ్రహాలను బలవంతంగా తొలగించారు. సాయిబాబా విగ్రహాలకు ముసుగులు వేశారు.. ఇదెక్కడో కాదు.. మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది. అసలు సాయిబాబా విగ్రహాల తొలగింపు ఎందుకు.. దీని వెనక ఏం జరిగింది.. ఈ పనులు చేస్తుంది ఎవరు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం..

 

ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని ఉన్న ఆలయాల్లో సాయిబాబా విగ్రహాల తొలగింపు వివాదాస్పదంగా మారింది. వారణాసిలోని 14 ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలను సనాతన్ రక్షక్ సేన అనే సంస్థ తొలగించింది. కొన్ని సాయి బాబా విగ్రహాలకు ముసుగులు వేసింది. ఈ సనాతన్ రక్షక్ సేనకు అజయ్ శర్మ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారు. వారణాసిలోని మరో 28 ఆలయాల్లో సాయి బాబా విగ్రహాల తొలగింపే లక్ష్యంగా సనాతన్ రక్షక్ సేన ముందుకెళుతుండటం బాబా భక్తుల్లో ఆందోళనకు కారణమైంది. వారణాసిలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన బడా గణేష్ మందిర్లో కూడా సాయిబాబా విగ్రహాన్ని తొలగించారు. 

సాయిబాబా విగ్రహాల తొలగింపుపై సనాతన్ రక్షక్ సేన సభ్యులు మాట్లాడుతూ.. సాయిబాబాను ఆరాధించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని చెప్పారు. అయితే హిందూ దేవుళ్లు, దేవతల ఆలయాల్లో సాయి బాబా విగ్రహాలను తాము అనుమతించేది లేదని సనాతన్ రక్షక్ సేన సభ్యులు స్పష్టం చేశారు. సనాతన్ రక్షక్ సేన ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడు అజయ్ శర్మ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ వారణాసిలోని 14 ఆలయాల్లో సాయి బాబా విగ్రహాలు తొలగించామని తెలిపారు. మరిన్ని సాయి బాబా విగ్రహాలను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సాయి బాబా విగ్రహాలను ఆరాధించడం అంటే దెయ్యాలను ఆరాధించడమేనని అజయ్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.