111 జీవో ఎత్తేస్తే.. సిటీ ముప్పు బాధ్యతెవరిది? : పాలసీ ఎనలిస్ట్ దొంతి నర్సింహా రెడ్డి

హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక పాత్ర వహించాయి. 2020లో ఉస్మాన్ సాగర్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోగా, 2027లో హిమాయత్ సాగర్ కూడా పూర్తి చేసుకుంటుంది. రెండింటి నీటి నిలువ సామర్థ్యం 6.86 టీఎంసీలు. ఇంత నీరు వచ్చేందుకు కారణం.. నీటి పరీవాహక ప్రాంతం తగిన స్థాయిలో ఉండటం. రెండింటికీ కలిపి 2,105 చదరపు కిలోమీటర్లు అంటే దాదాపు 5,20,157 ఎకరాలు. ఇది హాంగ్ కాంగ్, మారిషస్, లగ్జెంబర్గ్ పరిమాణంతో సమానం. మూసీ నదికి ఇది ఎగువ పరీవాహక ప్రాంతం  లేదా హెడ్ వాటర్స్ గా పరిగణిస్తారు. ఇక్కడ పడిన వర్షం వాగుల ద్వారా రెండు చెరువులకు చేరి, వాటి ద్వారా మూస, ఈసా ఉపనదుల్లోకి పారి, అవి సంగం దగ్గర కలిశాక నదిగా కనపడుతుంది. ఈ ఉప నదుల ద్వారా వచ్చే వర్షపు నీటి ప్రవాహం వల్ల హైదరాబాద్ నగరం వరదలకు గురి కాకుండా,1908 వరదల బీభత్సం పునరావృతం కాకుండా, నగరానికి నిరంతరం మంచి నీరు అందించే వ్యవస్థలో ఈ రెండు జలాశయాలు గుండెకాయలుగా మారాయి.

తెలంగాణ ప్రభుత్వం ప్రకారం.. ఒకప్పుడు నగర నీటి సరఫరాలో 28 శాతం అందించిన ఈ జలాశయాలు ఇప్పుడు రెండు శాతంలోపు అందిస్తున్నాయి. కాబట్టి వీటి అవసరం లేదనేది సర్కారు వాదన. అప్పుడు, ఇప్పుడు కూడా ఈ జలాశయాలు దాదాపు 7 లక్షల కుటుంబాల దాహార్తిని తీరుస్తున్నాయి.15 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల కొండ పోచమ్మ జలాశయం కట్టడానికి అయిన ఖర్చు దాదాపు రూ.2 వేల కోట్లు. అందులో సగం నీటి సామర్థ్యం ఉన్న ఈ రెండు జలాశయాలు100 ఏండ్లుగా సేవలు అందిస్తున్నాయి. వాటి విలువ రూ.వెయ్యి కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది. వాటిని కాదని, అవి అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదించడం మూర్ఖత్వానికి పరాకాష్ట. ఈ రెండు జలాశయాలు మంచి నీరు నిరంతరంగా అందించడానికి, ఇవి కలుషితం కాకుండా ఉండడానికి నిజాం నవాబు కొన్ని ఫర్మానాలు జారీ చేశారు. 1989లో కూడా ప్రభుత్వం నిషేధిత ఉత్తర్వులు ఇచ్చింది.1994లో ఇంకొక ఉత్తర్వు వచ్చింది. నగరం పెరుగుతున్న దృష్ట్యా పరివాహక ప్రాంతంలో గ్రామీణం నుంచి పట్టణానికి మారే క్రమంలో ఈ ఉత్తర్వుల తీవ్రత క్రమంగా తగ్గింది. ఒక కమిటీ సిఫారసుల మేరకు 111 జీవో 1996లో జారీ అయింది. మొత్తం 2 వేల చదరపు కిలోమీటర్లు కాకుండా కేవలం ఒక10 కిలోమీటర్ల రేడియస్ తో(314 చదరపు కిలోమీటర్లలో) ఆంక్షలు విధించింది. ఈ నిబంధనల ద్వారా మొత్తం పరీవాహక ప్రాంతంలో15 శాతం కంటే తక్కువ విస్తీర్ణంలో కాలుష్యకారక పరిశ్రమలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాలు నిషేధంలోకి వచ్చాయి. అంటే, నగర అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా 1989 ఉత్తర్వును నీరుగార్చుతూ కొత్త నిబంధనలు వచ్చాయి. ఈ నిబంధనలు కూడా సరిగ్గా అమలు చేయలేదు.111 జీవో పరిధిలో గడిచిన 27 ఏండ్లలో అనేక అక్రమ నిర్మాణాలు వచ్చాయి. ఈ పరిధిలో వచ్చే 84 గ్రామాల ప్రజల అభివృద్ధి కుంటుబడింది. బడా పారిశ్రామికవేత్తలు, ధనికులు ఈ ప్రాంతంలో పదులు, వందల ఎకరాలు కొనుక్కున్నారు. క్రమంగా భూమి నుంచి ఈ ప్రాంతవాసులు దూరం అయ్యారు. అటు, భూమి లేని పేదలకు వ్యవసాయ భూమి నిర్మాణాలకు, గెస్ట్ హౌసులకు మారడంతో, వ్యవసాయం పనులు దొరకలేదు. భూమి ఉన్న చిన్న రైతులు రియల్ వ్యాపారస్తుల మాయలో పడి ఉన్నది అమ్ముకున్నారు.

భూములపై ఆధిపత్యం కోసం..

111జీవో మీద సుప్రీంకోర్టు, హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్​లో కేసులు దాఖలు అయ్యాయి. 1999లో సుప్రీం కోర్టు ఈ జీవో111 అమలును సమర్థించింది. అక్రమ నిర్మాణాలను తొలగించాలన్న వ్యాజ్యంలో కూడా సుప్రీం కోర్టు, హైకోర్టులు జంట జలాశయాల పరిరక్షణ అవసరమని గుర్తించాయి. ఈ అంశం మీద ఇప్పటికీ ఆరుగురు అధికారులతో కూడిన కమిటీలు ఏర్పడ్డాయి. గత ఏడాది ఏర్పాటు చేసిన సోమేశ్ కుమార్ కమిటీ, 2016లో ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలు ఇప్పటి వరకు రాలేదు. ఈ అంశం విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ పారదర్శకంగా లేదు. కమిటీ నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రాజెక్ట్ డీపీఆర్​లు అన్నీ గోప్యమే. ప్రభుత్వం కోర్టులో చెబుతున్న దానికి, బయట చేస్తున్న ప్రకటనలకు పొంతనే లేదు. పూర్తి సమాచారం కోర్టుకు కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇందులో బలవంతుల ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. 2016లో సేవ్ గండిపేట్ పేరుతో మిషన్ కాకతీయలో భాగంగా రూ.12 కోట్లు కేటాయించారు. అదే సంవత్సరం కృష్ణా జలాలు జంటజలాశయాలకు తరలించేందుకు రూ.27.24 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. ఈ లోపు, అంతకు ముందు, అనేక సంస్థలకు, వ్యక్తులకు ప్రభుత్వం ఈ ప్రాంతంలో భూముల ధారాదత్తం చేస్తూనే వచ్చింది. ఈ జంట జలాశయాల రక్షణకు ఎగువన, దిగువన అప్పటి నిజాం భూములు కొన్నారు. ఈ భూములు ప్రభుత్వపరమైన తర్వాత గడిచిన 30 ఏండ్లలో అవి కబ్జాదారులకు, అవినీతిపరుల చేతిలోకి వెళ్లాయి. ప్రభుత్వం దగ్గర ఆయా భూముల వివరాలు లేవు. ఉన్నా ప్రజల ముందు పెట్టడం లేదు. వలస వచ్చిన పెట్టుబడిదారులు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, ఈ భూములను తమ సొంతం చేసుకుంటే, తెలంగాణ ఉద్యమంలో వీటిని స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడి భూముల మీద వారి ఆధిపత్యం తగ్గలేదు. వీరి ప్రయోజనాల కోసం జీవో111 మీద నిత్యం రాష్ట్ర ప్రభుత్వం దాడి చేస్తున్నది.

రియల్​ ఎస్టేట్​ లేఔట్​?

నిరుడు మార్చి15న తెలంగాణ ముఖ్యమంత్రి శాసనసభలో జంట జలాశయాల అవసరం తీరిపోయిందని చెబుతూ, 84 గ్రామాల అభివృద్ధి కోసం 111 జీవోను ఎత్తివేసే నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. తర్వాత జీవో69 జారీ చేశారు. దీని మీద కేసు వేస్తే, 111 జీవోకు ఇంకా బలమైన నిబంధనలు తెస్తున్నామని, జీవో పరిధిలో కొత్త ప్రణాళిక తయారు చేస్తున్నామని కోర్టులో ప్రభుత్వం చెప్పింది. వాదనలు పూర్తి కాలేదు, తుది తీర్పు రాలేదు. ఈలోపే మే19న తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో జీవో111 పూర్తిగా ఎత్తివేసే నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ అకస్మాత్తు నిర్ణయం జంట జలాశయాల మనుగడకు, హైదరాబాద్​ఎకో సిస్టమ్​కు గొడ్డలిపెట్టు. జంట జలాశయాలను కాపాడేందుకు పటిష్టమైన నిబంధనలతో కూడిన కొత్త ‘పచ్చ’ ప్రణాళిక తెస్తున్నామనే హామీకి విరుద్ధంగా, ఈ గ్రామాలకు కూడా సాధారణ హెచ్​ఎండీఏ నిబంధనలు వర్తింపజేయడం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఊపు తీసుకురావడానికే అని స్పష్టం అవుతున్నది. జంట జలాశయాల్లో మురుగు నీరు రాకుండా 22 శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, విస్తీర్ణం చుట్టూ రింగ్ రోడ్డు, అంతర్గత రోడ్ల వెడల్పు తదితర ఏర్పాట్ల మీద వార్తలు సగటు రియల్ ఎస్టేట్ లేఔట్ ప్రకటనల మాదిరిగానే ఉన్నాయి. ఈ రెండు జలాశయాల్లో గోదావరి నీళ్లు నింపుతామని ప్రభుత్వం హామీ ఇస్తున్నది. ఎందుకు? ఈ చెరువుల్లోకి నీరు పుష్కలంగా వస్తున్నది. సాధారణంగా, ఇవి నిండాలంటే 3 ఏండ్లు పట్టేది. ఈ మధ్య కుండపోత వర్షాలకు, పరివాహక ప్రాంతంలో విధ్వంసం వల్ల చాలా తొందరగా నీళ్లు నిండుతున్నాయి. సమస్య చెరువులు నిండకపోవటం కాదని ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. చెరువుల పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు రాకుండా, కలుషిత జలాలు ఉత్పన్నం కాకుండా, చెరువులో కలవకుండా ఏర్పాట్లు చేయాలి. దూర ప్రాంతం నుంచి నీళ్లు తెస్తే, ఇక్కడ పడ్డ వర్షం నీళ్లు ఎక్కడికి పోతాయి? 111 పరిధిలో ఏ భూమి ఎంత ఉన్నది?

గత 3 ఏండ్ల నుంచి వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాలు, ఎన్నడూ లేని విధంగా, పలుమార్లు మునిగాయి. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. కొందరు ప్రాణాలు కోల్పోయారు. చినుకు పడితే మురుగు నీటి వరద ఎందుకు వస్తుందని ప్రజలు ప్రశ్నిస్తుంటే, దానికి సమాధానం ప్రభుత్వం వద్ద లేదు. కానీ, వరద నివారణకు కట్టిన జంట జలాశయాలను తుదముట్టించే పనిలో పడింది. పేరుకు 84 గ్రామాల అభివృద్ధి అని వల్లె వేసినా, ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులతో ఇది పూర్తిగా రాజకీయ, ఆర్థిక స్వప్రయోజనాల కోసమని ప్రజలకు అర్థమైంది. 111 జీవో పరిధిలో 1.32 లక్షల ఎకరాలు ఉంటే, అందులో ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి, వ్యవసాయ భూమి తదితర వివరాలు ఇవ్వలేదు. మొత్తం విస్తీర్ణం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అందుబాటులోకి తీసుకువస్తున్న వైనం కనిపిస్తున్నది. గత ఏడాది శాసనసభలో ముఖ్యమంత్రి ఈ 84 గ్రామాల ప్రజలకు ప్రత్యేక అభివృద్ధి పథకం కానీ, నిధులు కానీ ప్రకటించలేదు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న అసైన్డ్ భూములను లబ్ధిదారుల నుంచి బలవంతంగా సేకరించి హైదరాబాద్ నగర ‘అన్యాయ’ అభివృద్ధి, అసమానత్వ వృద్ధికి బాటలు వేస్తూనే ఉన్నది సర్కారు. సామాజిక న్యాయ సూత్రాలు పట్టించుకోకుండా, రాజ్యాంగం విధించిన పరిమితులను అధిగమించి, పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూ, తెలంగాణ నమూనా పేరుతో, గ్రామీణ ప్రజలను సహజ వనరులకు ‘దూరం’ చేస్తున్నది. స్వతంత్ర జీవనోపాధులకు నీటి వనరులు, భూములు, వ్యవసాయం చాలా కీలకం. భూమిలేని పేదలకు భూమి అందించే ఆలోచన చేయకుండా, భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల నుంచి నగరీకరణ పేరు మీద భూమి వినియోగం చట్టాలను మార్చి సంపద అందరికి కాకుండా కొందరికే అందే విధంగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి. జీవో111 ఎత్తివేత నిర్ణయం కూడా అందులో భాగమే.

సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధంగా..

111జీవో ఎత్తివేత ప్రభుత్వ నిర్ణయమా కాదా అనేది కూడా ఇతమిత్థంగా తెలియదు. ఈ నిర్ణయం బలపరిచే ప్రభుత్వ ఉత్తర్వులు రాలేదు. లేదా ప్రజల అందుబాటులో లేదు. ఏదేమైనా, దీన్ని ఎత్తివేసేందుకు బలమైన కారణం ప్రభుత్వం వద్ద లేదు. అధికారమూ లేదు. ఈ జీవో111 సుప్రీం కోర్టు, హైకోర్టులు మూడుసార్లు బలపరిచాయి. భూతాపం పెరుగుతున్న పరిస్థితుల్లో, తీవ్రమైన వాతావరణ మార్పుల నేపథ్యంలో, కలుషిత వాతావరణం పెరుగుతున్న సందర్భంలో, సగటు విస్తృత హైదరాబాద్ నగర జీవికి జంట జలాశయాల అవసరం ఎంతైనా ఉంది. ఉన్న నీటి వనరులను రూపుమాపే అధికారం ప్రభుత్వానికి లేదు. మొత్తం పరీవాహక ప్రాంతం పరిరక్షణకు విధానకల్పనకు ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ఉన్నది. సమతుల్య అభివృద్ధికి, సామాజిక న్యాయ సూత్రాలకు లోబడి స్థానికులతో కూడిన సుస్థిర అభివృద్ధికి ప్రభుత్వం అడుగులు వేయాలి. ఈ దిశగా పౌర సమాజం తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తుంది. భూమి, నీరు సహజ వనరులు. ఇవి అందరికీ, నిరంతరం అందేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.

రాబోయే ముప్పు పట్టదా?

111 జీవో ఎత్తివేస్తే, ఆ ప్రాంతంలో ఆకాశహర్మ్యాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు వస్తాయి. మురుగు నీటి ప్రవాహం పెరుగుతుంది. ఈ జలాశయాల్లోకి ఇప్పటికే రోజు10 మిలియన్ లీటర్ల మురుగు నీరు చేరుతున్నదని జల మండలి అంచనా వేసింది. నిబంధనలు ఎత్తివేస్తే, కలుషిత నీటి ప్రవాహం పెరిగి, ఒక సంవత్సర కాలంలోనే కలుషిత నీటితో హుసేన్ సాగర్ దశకు చేరుకునే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే గండిపేట్, హిమాయత్ సాగర్ దిగువ ప్రాంతంలో అడ్డదిడ్డ నిర్మాణాల వల్ల మూస, ఈసా నదుల్లో మురుగు నీటి ప్రవాహం నిరంతరం అయింది. వర్షపు నీటిని ఈ జంట జలశయాలకు చేర్చే వాగులు కబ్జాకు గురి అవుతున్నాయి. ఇసుక మైనింగ్, గుట్టల విధ్వంసం, చెట్ల నరికివేత వల్ల ఈ పరీవాహక ప్రాంతం అస్తవ్యస్తం అయితది. జీవో111 ప్రాంతంలో కాంక్రీట్ మయం అయితే హైదరాబాద్ నగరానికి వరద ముప్పు పదింతలు పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాల్లో మురుగు వరద చేరి ఆయా ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఒకప్పుడు, ఈ పరివాహక ప్రాంతంలో వర్షం పడితే అవి చాదర్ ఘాట్ చేరడానికి కనీసం మూడు రోజులు పట్టేది. క్రమంగా, ఈ వరద వేగం పెరిగి కొన్ని గంటలలోనే చేరే పరిస్థితి వస్తుంది. మంచి నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. హైదరాబాద్ నగరంలో పడే ప్రతి చుక్క వెంటనే కలుషితం అవుతున్నది. వర్షం పడినప్పుడు వచ్చే లక్షల లీటర్ల నీటిని ఒడిసిపట్టుకునే వ్యవస్థ ఇప్పుడు లేదు. హైదరాబాద్ నగర పరిధిలో పడే నీరు వృథాగా, కలుషితమై, కిందకు పారుతుంది. జంట జలాశయాలతో ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యానికి మనుగడ ఉంటుంది. పక్షులు, వన్య ప్రాణులు ఈ నీటి ఆధారంగా జీవిస్తున్నాయి. జీవో 111 పోతే జీవ వైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. దగ్గరలో ఉన్న మృగవనం పార్కుకు, ఇతర పచ్చదనానికి నష్టం వాటిల్లుతుంది. భారీ నిర్మాణాల వల్ల ఇప్పటికే ఎన్నో విలువైన పక్షి జాతులు అంతరించాయి. భవిష్యత్తులో ఈ ముప్పు ఇంకా ఎక్కువవుతుంది.

-  డా. దొంతి నర్సింహా రెడ్డి,
పాలసీ ఎనలిస్ట్