నిల్వ చేసుకుంటేనే నీళ్లు..ఈసారి జూరాలకు భారీగా వరద

నిల్వ చేసుకుంటేనే నీళ్లు..ఈసారి జూరాలకు భారీగా వరద
  •     12 టీఎంసీలు ఎత్తిపోస్తేనే రెండు పంటలకు నీళ్లు వచ్చే అవకాశం 

గద్వాల, వెలుగు: కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉన్న నడిగడ్డకు సాగునీటికి ఇబ్బందులు ఉండవద్దు. గత ఏడాది జూరాల ప్రాజెక్టుకు సరిగా నీళ్లు రాకపోవడం, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద ఉన్న రిజర్వాయర్లు నిండకపోవడంతో పంటలకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది జూరాల ప్రాజెక్టుకు సమృద్ధిగా వరద నీరు వస్తోంది. ఈ నీటిని వీలైనంతగా ఎత్తిపోసుకుంటే ఈ ఏడాది రెండో పంటకు నెట్టెంపాడు కింద నీళ్లు ఇచ్చేందుకు సాధ్యమవుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి వరద సమయంలో 90 రోజుల పాటు దాదాపు 12 టీఎంసీలు నెట్టెంపాడు ప్రాజెక్టు కోసం ఎత్తిపోస్తే 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. కానీ, గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగా నెట్టెంపాడు ప్రాజెక్టు అస్తవ్యస్తంగా మారింది. పూర్తి స్థాయిలో ర్యాలంపాడు రిజర్వాయర్ లో నీరు నిల్వ ఉంచలేని పరిస్థితి నెలకొంది.

  • 12 టీఎంసీలు స్టోరేజీ చేసేది ఎలా?

నెట్టెంపాడు లిఫ్ట్  కింద రెండు పంటలకు పూర్తి స్థాయిలో నీళ్లివ్వాలంటే 12 టీఎంసీలు అవసరం. కృష్ణ నదికి వరదలు వచ్చే సమయంలో 90 రోజులు నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ర్యాలంపాడు రిజర్వాయర్ ను నాలుగు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. గుడ్డేముదొడ్డి రిజర్వాయర్ ను 1. 6 టీఎంసీలకు డిజైన్  చేసి నిర్మించారు. అయితే నాలుగేండ్లుగా ర్యాలంపాడు రిజర్వాయర్ కు బుంగలు పడడంతో ప్రస్తుతం రెండు టీఎంసీలు మాత్రమే నిల్వ చేస్తున్నారు. గుడ్డందొడ్డిలో 1.6 టీఎంసీలు నిల్వ ఉంచుతున్నారు. అలాగే నాగర్ దొడ్డి, సంగాల, చిన్నోనిపల్లి, నాగర్ దొడ్డి, ముచ్చోనిపల్లి, తాటికుంట రిజర్వాయర్లలో కూడా నీటిని నింపాలి. చిన్నోనిపల్లి, సంగాల రిజర్వాయర్లు ఇంకా కంప్లీట్  కాకపోవడంతో వాటిలో నీళ్లు నింపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తంగా ఐదు  టీఎంసీలు కూడా కూడా ఎత్తిపోయలేని పరిస్థితి ఉంది. రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో నీటిని ఎత్తిపోయకపోతే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద రెండో పంటకు నీరు ఇవ్వడం కష్టమేనని అంటున్నారు.

  • ఇప్పటివరకు ఎత్తిపోసింది 1.7 టీఎంసీలే..

జూరాల బ్యాక్  వాటర్  నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇప్పటివరకు ర్యాలంపాడు, గుడ్డందొడ్డి రిజర్వాయర్లకు కేవలం 1.7 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. గుడ్డం దొడ్డిలో 0.33, ర్యాలంపాడు  రిజర్వాయర్ లో 1.43 టీఎంసీలు, నాగర్​దొడ్డి 0.1 టీఎంసీ, తాటికుంట 0.5 టీఎంసీ మాత్రమే నీరు నిల్వ ఉంది. ఇంకా చాలా రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయలేదు. వరద తగ్గితే  ఎత్తిపోసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నెట్టెంపాడు లిఫ్ట్  నుంచి 21 టీఎంసీలు​ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటివరకు అత్యధికంగా 12 టీఎంసీలే ఎత్తిపోసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1.7 టీఎంసీ మాత్రమే ఎత్తిపోయడంతో ఈ ప్రాజెక్టు కింద సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది.
పెండింగ్ లో పనులు..
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద 99,100 ప్యాకేజీ పనులు పెండింగ్ లో ఉన్నాయి. కాలువలకు లైనింగ్ లేదు, ర్యాలంపాడ్  రిజర్వాయర్ కు రిపేర్లు చేయలేదు. పంట కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రెండు రిజర్వాయర్లు కంప్లీట్  కాలేదు. కాంగ్రెస్  హయాంలో కట్టిన నెట్టెంపాడు లిఫ్ట్  ఇరిగేషన్  పెండింగ్ పనులను గత బీఆర్ఎస్  ప్రభుత్వం చేపట్టకపోవడం రైతులకు శాపంగా మారుతోంది.
జూరాల కింద ఇచ్చే అవకాశం..
జూరాల ప్రాజెక్టు కింద ఈసారి రెండో పంటకు కూడా నీళ్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది రెండో పంటకు నీళ్లు ఇవ్వకపోవడంతో ప్రాజెక్టు చరిత్రలోనే మొదటిసారి క్రాప్  హాలిడే  ప్రకటించారు. జూరాల ప్రాజెక్టు లెఫ్ట్, రైట్  కెనాల కింద 1.03 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఈ ఏడాది జూరాల ప్రాజెక్టుకు వానాకాలం చివరి వరకు నీళ్లు వస్తే రెండో పంటకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.

  • చివరి వరకు వరద వస్తేనే..

ఈ వానాకాలం చివరి వరకు వరదలు వస్తే నెట్టెంపాడు లిఫ్ట్  ఇరిగేషన్  కింద రెండో పంటకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు 1.7 టీఎంసీలు ఎత్తి పోశాం. నీళ్లు అయిపోయే కొద్ది మళ్లీ మోటార్లు స్టార్ట్  చేసి నీటిని ఎత్తిపోస్తాం.
-  రహీముద్దీన్, ఈఈ, నెట్టెంపాడు ప్రాజెక్ట్