ఆ ఊరిలో అమ్మాయి పుడితే 5వేలు డిపాజిట్.. పెద్దయ్యాక ఊరోళ్లే పెళ్లి కూడా చేస్తారు

ఆ ఊరిలో అమ్మాయి పుడితే 5వేలు డిపాజిట్.. పెద్దయ్యాక ఊరోళ్లే పెళ్లి కూడా చేస్తారు

మా ఊరి మహాలక్ష్మి

అదో చిన్న గ్రామం. కానీ.. ఆ ఊరివాళ్ల మనసు చాలా పెద్దది. ఎంత పెద్దదంటే.. ఒక పేదింట్లో పెళ్లీడుకొచ్చిన​ అమ్మాయి ఉంటే ఆమె పెళ్లి చేసేంత. అవును ఆ ఊళ్లో ఒక అమ్మాయి పెళ్లి చేయడానికి అమ్మానాన్నలు ఇబ్బంది పడుతుంటే.. చూసి తట్టుకోలేక ఊరంతా కలసి ఆ అమ్మాయి పెళ్లి చేశారు. అంతేకాదు.. ఏ పేదింటి అమ్మాయికి ఇలాంటి దుస్థితి రాకూడదని ఒక ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు. దాని ద్వారా  ఆ ఊళ్లో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరా ఐదువేల రూపాయలు డిపాజిట్‌ చేస్తున్నారు.

కొండయ్యపల్లి.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఒక మారుమూల గ్రామం. ఆ ఊళ్లో ఉండే పెంటయ్య దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. చేనేత పని చేస్తూ బతికే పెంటయ్యకు ఊళ్లో పని దొరక్కపోవడంతో పెద్ద బిడ్డ సరితకు పదేళ్లున్నప్పుడు బతుకుదెరువు కోసం మహారాష్ట్రలోని భీవండికి వెళ్లాడు. అక్కడికి పోయినప్పటినుంచి ఏనాడూ ఇంటికి డబ్బు పంపలేదు. భార్యా, పిల్లల బాగోగులు చూడలేదు. ఎనిమిదేళ్లు గడిచేసరికి పెద్ద కూతురు సరిత పెళ్లీడుకొచ్చింది. అమ్మాయికి పెళ్లి చేయాలని తండ్రికి కబురు పంపినా, ఫోన్ చేసినా పట్టించుకోలేదు. దీంతో ఊరివాళ్లంతా కలిసి 40 వేల రూపాయలు జమ చేసి ఆమె పెళ్లి చేశారు.  ఈ పెళ్లి.. అదే ఊళ్లో ఉంటున్న ఎన్ఆర్ఐ రేండ్ల శ్రీనివాస్​తోపాటు, ఆ ఊరి యూత్‌‌ను ఆలోచించేలా చేసింది. తమ ఊరి ఆడబిడ్డలను తల్లిదండ్రులు భారం అనుకోవద్దు. అందుకోసం వాళ్లకు భరోసా కల్పించాలి అనుకున్నారు. ఆ ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘మా ఊరి మహాలక్ష్మి’ ఫౌండేషన్.

ఐదు వేలు డిపాజిట్‌‌

సరితకు వచ్చిన కష్టం ఇంకెవరికీ రావొద్దని అంతా కలిసి ‘మా ఊరి మహాలక్ష్మి’ పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఊళ్లో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరిట ఐదు వేల రూపాయలు ఫిక్స్​​డ్ డిపాజిట్ చేస్తున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ చిన్నారుల తల్లిదండ్రులు కూడా కొంత డబ్బును ఫిక్స్​డ్​ చేస్తున్నారు. దీని వల్ల పిల్లలు పెద్దయ్యేసరికి కొంత డబ్బు చేతికి అందుతుంది.

ఫౌండేషన్ మెంబర్స్‌‌గా..

ఈ ఫౌండేషన్‌‌ 2018లో ఎన్​ఆర్​ఐ రేండ్ల శ్రీనివాస్ స్థాపించారు. అంగన్‌‌వాడీ టీచర్​ మడుపు గోవిందమ్మను ప్రెసిడెంట్‌‌గా, గోపు రాజు వైస్‌‌ ప్రెసిడెంట్‌‌గా, మల్యాల సునీత కన్వీనర్‌‌గా, అరుణ, మధు, వార్డు మెంబర్లు, సర్పంచ్​  మెంబర్స్‌‌గా ఉన్నారు. 2017లో ఫౌండేషన్‌‌ పెట్టకముందే ఇద్దరి పేరిట ఫిక్స్​డ్​ డిపాజిట్ చేశారు. ఆ తరువాత 2018లో ఏడుగురి పేరిట, 2019లో పుట్టిన తొమ్మిది మంది పేరున కూడా డబ్బులు డిపాజిట్ చేశారు. ఆ డిపాజిట్‌‌ డబ్బును పెళ్లి టైంకి అందే ఏర్పాటు చేశారు. చిన్న మొత్తమే అయినా ఊళ్లో ఒక కొత్త ఆలోచనకు దారితీసింది.

మేమున్నామంటూ…

గల్ఫ్​ దేశాల్లో ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలకు ఫౌండేషన్​ తరఫున మేమున్నామంటూ ఆదుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయిపల్లికి చెందిన రాజ్​కుమార్ దుబాయిలో చనిపోయాడు. అతని కూతురు పేరు మీద పది వేల రూపాయలు ఫిక్స్​డ్​ డిపాజిట్ చేశారు. ఇదే మండలం చిన్నమెట్​పల్లికి చెందిన గాజంగి శేఖర్​ చనిపోగా అతని ఇద్దరి కూతుళ్ల పేరు మీద 30 వేల రూపాయలు డిపాజిట్ చేశారు. నిర్మల్ జిల్లా కడెం మండలానికి చెందిన దుర్గం రాజగంగయ్య దుబాయిలో చనిపోగా అతని కూతురు పేరిట రూ.30 వేలు జమచేశారు. గతేడాది కొండయ్యపల్లికి చెందిన గోపు నర్సయ్య ఒమన్ దేశంలో చనిపోయాడు. మున్నూరుకాపు సంఘం సభ్యులు 50 వేలు, టీఈఎంకేఏ ఫౌండర్ సోమారపు అరుణ్​కుమార్  పది వేలు అతని కూతురు గోపు వర్షిని పేరిట ఫిక్స్​డ్ డిపాజిట్ చేశారు. నిర్మల్​ జిల్లా కడెం మండలం నర్సాపూర్​కు చెందిన భానుచందర్​ గత నెలలో కరోనాతో చనిపోతే.. అతడి కుటుంబాన్ని ఫౌండేషన్​ తరఫున ఆదుకున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి
ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడ దనే ఉద్దేశంతో మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ తరఫున కొంత డబ్బు ఇస్తున్నాం. మేం అందిస్తున్న సాయం చాలా తక్కువే. కానీ, ఈ సాయం ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో భరోసా నిస్తోంది. ఆడపిల్లలు పుట్టిన వెంటనే ప్రభుత్వం వాళ్ల పేరిట కొంత మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే బాగుంటుంది. తల్లిదండ్రుల మీద భారం పడదు. –మడుపు గోవిందమ్మ,
ఫౌండేషన్ ప్రెసిడెంట్‌అందరినీ ఏకం చేశాం
ఊళ్లో ఆడబిడ్డలను కన్న తల్లిదండ్రులు అధైర్య పడొద్దని అందరినీ ఏకం చేశాం. ఎన్ ఆర్ ఐ మిత్రులు, గ్రామస్తులు, నాయకుల సహాయ సహకారాలతో పదిమందికీ సాయం చేస్తున్నాం. ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తు లో మరిన్ని మంచి పనులు చేయాలనుకుంటున్నాం. –రేండ్ల శ్రీనివాస్ , ఫౌండర్‌‌

for more News…

రాత్రిపూట మహిళలకు ఫ్రీ రైడ్ అంటూ వైరల్ మెసెజ్

చిన్న పట్టణాల్లో ఉద్యోగాలిస్తాం-బీపీఓ కంపెనీలు

గుడ్లు ఫ్రిజ్​లో స్టోర్​ చేస్తే డేంజర్

వ్యాక్సిన్ పంపిణీకి మెకానిజం రెడీ చేయండి