పదే పదే కాదు.. లక్షల, కోట్ల సార్లు అంబేద్కర్ పేరు స్మరిస్తూనే ఉంటాం: టీపీసీసీ

పదే పదే కాదు.. లక్షల, కోట్ల సార్లు అంబేద్కర్ పేరు స్మరిస్తూనే ఉంటాం: టీపీసీసీ
  • మనుస్మృతి అమలుకు బీజేపీ కుట్ర
  • అంబేద్కర్​పై అనుచిత వ్యాఖ్యలతో వాళ్ల నిజస్వరూపం బయటపడ్డది: మహేశ్ గౌడ్
  • బీజేపీ నేతలకు అంబేద్కర్ ఫ్యాషన్ అయితే.. మాకు ఆరాధ్య దైవం
  • అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి 
  • బర్తరఫ్ చేసేదాకా పోరాటం ఆపబోమని వెల్లడి   
  • హైదరాబాద్​లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ 

హైదరాబాద్, వెలుగు: దేశంలో రాజ్యాంగానికి బదులు మనుస్మృతిని అమలు చేసేందుకు బీజేపీ, ఆరెస్సెస్ కుట్ర చేస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. మనుస్మృతిని, సావర్కర్ సిద్ధాంతాలను అనుసరించే బీజేపీ నేతలు.. అంబేద్కర్‎పై అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ల నిజస్వరూపాన్ని బయటపెట్టారని అన్నారు. అంబేద్కర్‎పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం హైదరాబాద్‎లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 

మహేశ్ గౌడ్ ట్యాంక్ బండ్‎లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించగా, లక్డీకాపూల్‎లోని కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం హైదరాబాద్ కలెక్టర్‎కు వినతిపత్రం అందించారు. దాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించాలని కోరారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ నేతలకు అంబేద్కర్ ఫ్యాషన్ అయితే.. మాకు ఆరాధ్య దైవం. అంబేద్కర్ పేరును పదే పదే కాదు.. లక్షల సార్లు, కోట్ల సార్లు స్మరిస్తూనే ఉంటాం” అని అన్నారు. 

అమిత్ షాది అహంకారం.. 

అమిత్ షా వ్యాఖ్యలపై నిరసన తెలిపినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడం సిగ్గుచేటని మహేశ్ గౌడ్ అన్నారు. ‘‘అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం. దేవుడి పేరు చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందడం బీజేపీ నేతలకు అలవాటుగా మారింది. నిత్యం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తప్పుపట్టే బీజేపీ నేతలు.. ఇప్పుడు ఏకంగా అంబేద్కర్ ను తూలనాడుతున్నారు” అని మండిపడ్డారు. 

రాజ్యాంగ రక్షణ కోసం బీజేపీపై దేశవ్యాప్తంగా పోరాటం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని, అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. ర్యాలీలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, రఘువీర్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.