ప్రాజెక్టు ఏదైనా… పేదల భూముల్నేలాక్కుంటున్నారు

సాగునీటి ప్రాజెక్టులు, ఎకనమిక్​ సెజ్‌లు, రోడ్ల విస్తరణ ఇలా ఏ ప్రాజెక్టు, పథకం అయినా పేదల అసైన్డ్​ భూములనే రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్​ చేస్తోంది. ఇలాంటి వాటి కోసం రాష్ట్రంలో ఇంత వరకు సేకరించిన, ఇంకా సేకరించాల్సిన 7 లక్షల ఎకరాల భూమిలో 70 శాతం పేదలవే. ఈ ప్రాజెక్టుల కోసం పాలకులు, అధికారులకు భూస్వాముల భూములు కనపడటం లేదు. ఇలాంటి వారిని కాపాడుతున్న ప్రభుత్వం.. ఉన్న కొద్దిపాటి భూమినే నమ్ముకుని బతుకుతున్న పేదల ఉపాధి పోగొట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది.

సర్కారు భూస్వాముల కోసమేనా?

రాష్ట్రంలో ‘భూస్వాములు ఎక్కడ?’అని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రికి తానే స్వయంగా భూస్వామినని తెలియదా? ఇప్పటికీ 20 వేల మంది దగ్గరే 6 లక్షల ఎకరాలకుపైగా ఉన్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఇందులో కనీసం వెయ్యి మంది వద్ద లక్షల ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ అవసరాలకు, ప్రాజెక్టులకు వీరి భూములు సేకరించవచ్చు కదా? కానీ, పాలకులు అలా చేయరు. ఏ ప్రాజెక్టు లైనా వీరి భూముల దగ్గరగా వస్తే అవసరమైతే ప్రాజెక్టునే మార్చేస్తున్నారు. ప్రాజెక్టులను పేదల భూముల దగ్గరకు మార్చి వారికి ఉన్న కొద్దిపాటి జాగాను లాక్కుంటున్నారు. పైగా ఈ ప్రాజెక్టుల వల్ల పేదలకు లాభం కలుగుతుందని చెబుతున్నారు. అప్పటికీ పేదలు వినకపోతే అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో తమ ఆస్తులను లాక్కోవద్దని ఆందోళనకు దిగిన పేదలను నాన్‌బెయిలబుల్‌ కేసు కింద 60 రోజులు జైల్లో పెట్టారు. మహబూబ్‌నగర్‌ జిల్లా గట్టు మండలంలో సోలార్‌ పవర్​ ప్రాజెక్ట్‌ కోసం ఏపీ మంత్రికి తెలంగాణ ప్రభుత్వం 3,000 ఎకరాలు అసైన్డ్‌ భూమిని ధారాదత్తం చేసింది. స్థానికులు హైకోర్టుకు వెళ్లగా కోర్టు చివాట్లతో భూసేకరణను ఉపసంహరించుకుంది.

పెద్దోళ్లకు రక్షణగానే ధరణి

రాష్ట్రంలో 89,410.48 ఎకరాల సీలింగ్‌ భూమి అక్రమంగా భూస్వాముల వద్ద ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. భూదాన యజ్ఞ బోర్డు భూములు, దేవాలయ భూములు(63,872 ఎకరాలు), అటవీ భూములు, వక్ఫ్‌ భూముల(77,607 ఎకరాలు)ను పాలకుల అండతో పెట్టుబడిదారులు, భూస్వాములు ఆక్రమించుకుని అనుభవిస్తున్నారు. పోలీసు యంత్రాంగం వాళ్లకు రక్షణగా ఉంటూ పేదలపైనే కేసులు పెడుతోంది. ఇలాంటి వారు 3, 4 లింక్‌ డాక్యుమెంట్లను అక్రమంగా సృష్టించి పట్టాదారులుగా నమోదు చేసుకున్నారు. వారికి ధరణి వెబ్‌సైట్‌ రక్షణగా నిలుస్తోంది. ఈ వెబ్‌సైట్‌ కొనుగోలుదారులకు రక్షణ కల్పించడమే తప్ప, రెవెన్యూ రికార్డుల్లోని లోపాలను సరిదిద్దదు. ఈ వాస్తవాన్ని కొద్ది రోజుల్లోనే ప్రజలు గుర్తిస్తారు.

అసైన్డ్​ చట్టాల సవరణలు అమలు కాలె

అసైన్డ్​ భూముల మార్పిడిని నిషేధిస్తూ 1956 నాటి అసైన్డ్‌ చట్టానికి 1977లో నాటి ప్రభుత్వం సవరణలు చేసింది. 2007 వరకు అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన పేదలకు పట్టా హక్కు కల్పిస్తామని అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సవరణ చట్టానికి 2018లో మరో సవరణ తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 31–12–2017 వరకు అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన వారికి పట్టా హక్కులు కల్పిస్తామన్నారు. కానీ పై సవరణలేవీ నేటికీ అమలు కాలేదు. ప్రాజెక్టుల నిర్మాణంలో అసైన్డ్‌ భూములు ముంపునకు గురైతే చట్టబద్ధ పరిహారం ఇవ్వాలని 1993లో జీవో తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అసైన్డ్‌ భూముల సర్వే ప్రకారం 1956 నుంచి 2014 వరకు 22,55,617 ఎకరాలను 13,88,530 మందికి పట్టాలిచ్చినట్లు గుర్తించారు. ఇందులో 2,41,749 ఎకరాలను 84,706 మందికి అమ్ముకున్నట్టు రికార్డు చేశారు.

పేదల భూములే కావాల్నా?

నారాయణపేట జిల్లా మరికల్‌ గ్రామంలో దేవరంటి బీమప్పకు 1970లో సర్వే నంబర్ 449లో 1.20 ఎకరాలకు లావోని పట్టా ఇచ్చారు. బీమప్ప, అతను చనిపోయిన తర్వాత కుమారుడు, మనవడు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. బ్యాంకు నుంచి అప్పు కూడా తెచ్చుకున్నారు. అదే సర్వే నంబర్‌లో 140 ఎకరాలను మరో 72 మందికి పట్టాలిచ్చారు. వీరంతా దళిత, గిరిజన, వెనకబడిన కులాలకు చెందిన పేదలే. ఈ కుటుంబాలకు ఆ భూమే ఆధారం. ఇక మరికల్​ మండల కేంద్రంలో 400 ఎకరాల వరకు పేదలకు పట్టాలిచ్చారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఈ భూములపై ప్రభుత్వం కన్ను పడింది. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఆ భూములు వదిలేయాలని రెవెన్యూ అధికారులు, స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి వారిని బెదిరిస్తున్నారు. దీనిపై స్థానికులు నిరాహార దీక్షలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మండల కేంద్రానికి ఆనుకుని భూస్వాముల భూములున్నా పాలకుల దృష్టి మాత్రం పేదల భూములపైనే ఉంది. ఇలాంటి ఘటనలే ప్రతి జిల్లాలోనూ కొనసాగుతున్నాయి.

పేదల భూముల జోలికి పోవద్దు

పేదల ఉపాధిని నష్టపరిచిన ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు. కొంత కాలం యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకుని అక్రమాలు కొనసాగించినా, వేల కోట్లు, లక్షల ఎకరాలు అక్రమంగా సంపాదించినా ప్రజలు సహించరని గత అనుభవాలు చెబుతున్నాయి. ఎక్కడైనా ప్రాజెక్టు వస్తుందని తెలియగానే అధికారంలో ఉన్న వారు అక్కడ తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వ ప్రాజెక్టుకు 4,5 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముకుని వందల కోట్లు గడిస్తున్నారు. ఇలాంటి పాలకులకు పేదల ఆస్తులను కాజేయడంపై కనికరం ఉంటుందా? అసలు ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్ని ఎకరాలు కావాలి. ఎన్టీఆర్​ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్‌ స్టేషన్లను, ప్రభుత్వ కార్యాలయాలను గ్రామానికి దూరంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో నిర్మించేలా చేశారు. కానీ, నేటి పాలకులు రియల్‌ వ్యామోహంలో పడి పేదల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఇకనైనా పేదల ఆస్తుల జోలికి పోకుండా భూస్వాముల భూములను సేకరించాలి. ‑మూడ్‌ శోభన్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి,తెలంగాణ రైతు సంఘం.

for more News…

ఎలక్షన్లు రాంగనే… ఓటర్లపై ప్రేమ పుట్టె

పేరుకే మహిళా కార్పొరేటర్లు.. పెత్తనమంతా భర్తలదే

ఎన్నికల్లో మేమంతా నోటాకే ఓటేస్తం

ఎన్నికలపై ఉన్న శ్రద్ధ.. ఉద్యోగాల భర్తీపై లేదేం