ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సహకరిస్తే ఏడాదిలోనే కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రి వస్తారని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. హిందూయిజం అంటే ఇతర మతాలను వ్యతిరేకించడం కాదని.. అందరినీ కలుపుకొనిపోవడమని అన్నారు.
‘మోదీ కేబినెట్‌లో ఒక్క ముస్లిం అయినా ఉన్నారా? 15 శాతం జనాభా ఉంటే ఒక్క పదవి కూడా ఇవ్వరా? మేం ఒకటో రెండో పదవులు ఇస్తే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు ఈ దేశ ప్రజలు కాదా? స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనలేదా? ఇప్పుడు నేను ఇలా మాట్లాడినందుకు హిందువులకు వ్యతిరేకి అని ప్రచారం చేస్తారు. కానీ అది ఎక్కువ రోజులు నడవదు” అని చెప్పారు.
‘‘మోదీ ఐస్, నైస్ ఫార్మూలాతో ముందుకెళ్తున్నారు. ఐస్ అంటే ఇన్‌కంట్యాక్స్, సీబీఐ, ఈడీ. నైస్ అంటే నార్కోటిక్స్” అని పేర్కొన్నారు. ‘‘భద్రాచలంలో పెద్ద రామమందిరం ఉంది. అది మాకు గర్వకారణం. మోదీ, అమిత్ షా భద్రాచలానికి వస్తే.. నేను అయోధ్యకు వెళ్తాను” అని చెప్పారు. ‘‘ఏపీ, తెలంగాణ మధ్య సాగునీళ్లు, ఇతర విభజన సమస్యలు ఉన్నాయి. మేం వాటిని పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాం. పంచాది పెట్టుకోవాలనుకోవడం లేదు” అని తెలిపారు.