రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామంటారా? : కోమటిరెడ్డి పై జగదీశ్ రెడ్డి ఫైర్​

  • నేను వ్యక్తిగత ఆరోపణలకు దిగితే... రోడ్ల మీద తిరగలేవు

నల్గొండ, వెలుగు : ‘‘నేను వ్యక్తిగత ఆరోపణలకు దిగితే.. నువ్వు (మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి) రోడ్ల మీద తిరగలేవు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామంటారా? మంత్రిపదవి ఇచ్చింది అందుకేనా?” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై బీఆర్ఎస్​ నేత జగదీశ్  రెడ్డి ఫైర్​ అయ్యారు. శనివారం నల్గొండలో మీడియాతో ఆయనతో మాట్లాడారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక మాజీ సీఎం కేసీఆర్​పై నెపెం నెడుతున్నారని విమర్శించారు. 

నాగార్జునసాగర్​ ఎడమ కాల్వ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే హారతులు పట్టిన ద్రోహులు కాంగ్రెస్  నేతలని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ పార్టీ 420 హామీలు ఇచ్చిందని, ఆ హామీల్లో నెరవేర్చింది ఒక్కటే అని పేర్కొన్నారు. అది కూడా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసి పంచాయితీకి తెరతీసిందన్నారు. మిగతా హామీల గురించి నిలదీస్తే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఎస్సారెస్పీలో నీళ్లు ఉన్నా ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. త్వరలో కేసీఆర్​ బయటకు వస్తారని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్​రావు, కంచర్ల భూపాల్​ రెడ్డి, రవీంద్ర కుమార్, గాదరి కిశోర్​ కుమార్, జడ్పీ చైర్మన్​ బండా నరేందర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.