
మెదక్, వెలుగు: రాజకీయాలను బీఆర్ఎస్ డబ్బు మయం చేసి, ఇతర పార్టీలపై తప్పుడు ప్రచారం చేస్తుందని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. మళ్లీ ఈ ప్రభుత్వం వస్తే వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవన్నారు. బీఆర్ఎస్కు రిజైన్ చేసి కాంగ్రెస్లో చేరిన తర్వాత తొలిసారిగా బుధవారం మెదక్ వచ్చిన ఆయన చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని, ఓటు మాత్రం కాంగ్రెస్కు వేయాలని కోరారు. బీఆర్ఎస్లో ఉన్నపుడు ర్యాలీలకు, డీజేలకు పర్మిషన్ తీసుకోకున్నా అడిగేవారు కాదని, పార్టీ మారగానే పర్మిషన్ లేదంటూ ఇబ్బంది పెడుతున్నారన్నారు.
‘మీరైతే వెయ్యి కార్లతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ర్యాలీలు తీయొచ్చు..మీకో న్యాయం, ఇతరులకో న్యాయమా’ అని? సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. తనను ప్యారాచూట్లో దిగానని కొందరు అంటున్నారని, తనపై కామెంట్ చేసిన వారి సొంత ఊరు అదేనా అని ప్రశ్నించారు. బ్యాక్ పెయిన్ సమస్యతో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానని, భయపడి పారిపోయే వ్యక్తిని కాదన్నారు. తమతో తిరిగితే పథకాలు రావని భయపెడుతున్నారన్నారు. వారంలో ఎలక్షన్ కోడ్ వస్తుందని, ఎన్నికల తర్వాత ఇండ్లు ఇస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలకు నరకం చూపెడతారన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మండల కాంగ్రెస్అధ్యక్షుడు శ్రీనివాసరావు, మహమ్మద్ పాషా, ఎంపీటీసీ పాషా, ధన్ సింగ్ పాల్గొన్నారు.