కార్డియాక్ అరెస్టా.. ? ఇట్ల బయటపడొచ్చు

లోకాన్ని భయపెట్టే కరోనా వైరస్ కన్నా హార్ట్ ఎటాకే పెద్ద కిల్లర్. క్యాన్సర్, ఎయిడ్స్.. ఏదైనా గుండె జబ్బుల తర్వాతనే అని లెక్కలు చెబుతున్నయ్. హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్టుతో ఈ భూమ్మీద ప్రతి 90 సెకండ్లకు ఒకరు చనిపోతున్నారు. ఏటా 17  మిలియన్ల​ మంది కార్డియాక్ అరెస్ట్​లతోనే  చనిపోతున్నారు. ప్రాణాంతకమే అయినా తెలివిగా ఉంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్​ విజయ్ రావు బోయినపల్లి.

గుండె సంబంధ మరణాల వార్తల్లో ఎక్కువగా హార్ట్ ఎటాక్ (గుండెపోటు) గురించే వింటాం. కానీ, వీటిలో కార్డియాక్ అరెస్టులే ఎక్కువ. హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ ఒకటి కాదు. రక్తనాళాల ద్వారా రక్త ప్రసరణ జరగనప్పుడు హార్ట్ ఎటాక్ (గుండె పోటు) వస్తుంది. ఇది సడెన్​గా రాదు. గుండె కొట్టుకోవడం సడెన్​​గా ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇది ఎందుకు జరుగుతుందో తెలియదు. హార్ట్ ఎటాక్ కార్డియాక్ అరెస్ట్​కు దారితీస్తుంది. కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు  అకస్మాత్తుగా కుప్పకూలిపోతారు.

హార్ట్ ఎటాక్ వస్తే కాసేపట్లో దవాఖానకు తీసుకుపోవచ్చు. కానీ, కార్డియాక్ అరెస్ట్ వల్ల సడెన్​గా గుండె ఆగిపోతుంది. అయిదు నిమిషాలకు మించి బతికే అవకాశమే లేదు. అయితే పక్కన ఉన్నవాళ్లు అలర్ట్ అయి సీపీఆర్ చేస్తూ కాసేపు కాపాడొచ్చు. వెంటనే ఏఈడీ(ఆటోమేటెడ్ ఎక్స్​టర్నల్​ డీఫిబ్రిలేటర్​) చేశారంటే ప్రాణాపాయం నుంచి మ్యాగ్జిమమ్ కాపాడుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఇన్స్యూరెన్స్​లు, హాస్పిటల్స్ కంటే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రెసిస్టేషన్), ఏఈడీని నమ్ముకుంటేనే బతికి బయటపడతారు. కార్డియాక్ అరెస్టులు 70 శాతం హాస్పిటల్ బయటే జరుగుతున్నాయి. వాటిల్లో 80 శాతం ఇంట్లోనే జరుగుతున్నాయి. హాస్పిటల్ బయట హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ వచ్చిన కేసుల్లో బతికే వాళ్లు 12 శాతమే. ఎక్కువమంది చనిపోవడానికి కారణం వాళ్లకు సీపీఆర్ చేయకపోవడమే. కాబట్టి ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే సీపీఆర్ గురించి అందరికీ అవేర్​నెస్ ఉండాలి. అప్పుడు ఏ ఇంట్లో ఈ సమస్య వచ్చినా ప్రాణాలను కాపాడుకోవచ్చు.

లైఫ్ సపోర్ట్

గుండె ఆగిపోయినప్పుడు (కార్డియో పల్మనరీ అరెస్ట్ జరిగినప్పుడు) గుండె రక్తాన్ని పంపింగ్ చేయదు. ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకోవు. అందువల్ల మనిషి అపస్మారకంగా ఉంటాడు. ఆ క్షణాల్లో తెలివిగా సీపీఆర్ చేస్తే  ఆక్సిజన్ అందేలా చేయొచ్చు. గుండె కొట్టుకునేలా చేసి ప్రాణం పోకుండా చేయొచ్చు. దీనికి మెడికల్ స్టాఫ్​ వచ్చి ట్రీట్​మెంట్ చేసేంత టైం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సీపీఆర్ గురించి కనీస అవగాహన కలిగి ఉండాలి. దీన్ని చేయడానికి మెడిసిన్స్ కా​నీ, మెడికల్ డివైజ్ కానీ వాడాల్సిన అవసరమే లేదు. పేషెంట్ కి లైఫ్ సపోర్ట్ ఇవ్వడమే సీపీఆర్. సీపీఆర్ని బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్ అయినా సీపీఆర్ చేయాలి. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు.. గుండె ఆగిపోతుంది. ఊపిరితిత్తులు పని చేయడం కూడా ఆగిపోతుంది. గుండె ఆగిపోయాక.. అయిదారు నిమిషాల వరకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. కానీ, రక్తప్రసరణ ఆగిపోతుంది. ఊపిరితిత్తులను రెండు చేతులతో బలంగా వత్తితే  గుండెలో మళ్లీ కదలిక మొదలవుతుంది.

ఇలా చేయాలి…

వెన్నెముక, బ్రెస్ట్ బోన్ (ఛాతిలో నిలువుగా ఉండే మధ్య ఎముక కింది భాగం నుంచి మూడు ఇంచుల పై భాగంలో అరచేతిని ఉంచి, అదమాలి) ఒత్తిడి కలిగించాలి. ఇలా వత్తేటప్పుడు ఛాతి అయిదు సెంటీమీటర్లకు తక్కువ కాకుండా లోపలికి అదమాలి. ఆరు సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోపలికి పోకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేస్తే హార్ట్ నుంచి ఆక్సీజనేటెడ్ బ్లడ్ బ్రెయిన్​కి వెళ్తుంది. ఈ లోగా అంబులెన్స్ వస్తే.. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ చేయడం కోసం ఇంక్యుబేషన్ చేస్తారు. అంటే.. నోటిలో ఒక ట్యూబ్ వేసి శ్వాసనాళంలోకి పైప్ వేసి, ఆంబూ బ్యాగ్ (బెలూన్) నుంచి గాలిని పంపింగ్ చేస్తారు. అలా ఆక్సిజన్ లంగ్స్​లోకి పంపుతారు. ఆ ఆక్సిజన్ బ్లడ్ నుంచి గుండె ద్వారా బ్రెయిన్​కి అందుతుంది. అలా ప్రాణం కాపాడవచ్చు.

పిల్లలు ఊపిరి ఆగిపోయి అపస్మారకంగా ఉన్నప్పుడు ఛాతి మధ్య ఎముక కింది భాగానికి కొంచెం పైన కాకుండా రొమ్ములు (నిపుల్స్​కి) సమాంతరంగా ఉన్న చోట అరచేయి పెట్టి ఎముకపై ఒత్తిడి కలిగించాలి.  పిల్లలు తినేటప్పుడు గొంతులో ఫుడ్ అడ్డంపడి ఊపిరి ఆగిపోతే కూడా సీపీఆర్ చేయొచ్చు. అయితే వాళ్లలో నాలుగు సెంటీమీటర్ల లోతుకే నొక్కాలి. సాధారణ వ్యక్తులు ఛాతిలో నొక్కడం వరకే చేయాలి. నోటి ద్వారా ఊపిరి ఇవ్వకూడదు. సీపీఆర్ చేసే ముందు 108 లేదా 104కి కాల్ చేయాలి. మెడికల్ స్టాఫ్​ వచ్చిన తర్వాత వాళ్లు నోటి ద్వారా ఊపిరి అందిస్తారు.

సీపీఆర్ చేసి ఏఈడీ సపోర్ట్ ఉన్నట్లయితే అబ్దుల్ కలాం బతికేవారు

అబ్దుల్ కలాం కార్డియాక్ అరెస్ట్‌‌తో సడన్‌‌గా కుప్పకూలిపోయారు. అప్పుడు ఆయన.. మణిపూర్‌‌‌‌లోని యూనివర్సిటీ హాల్లో లెక్చర్ ఇస్తున్నారు. సీపీఆర్​ చేసి, ఏఈడీ సపోర్ట్ ఉన్నట్లయితే బతికేవారు.

అమెరికాలో సాధారణ వ్యక్తులకు ఇలాంటి ప్రమాదం వస్తే మెడికల్ సపోర్ట్ దొరుకుతుంది.

సియాటెల్ నగరంలో రోడ్డు మీద వెళ్తున్న వాళ్లకు కూడా ఏఈడీ డివైజ్ అందుబాటులో ఉంటుంది.

బస్టాప్, మాల్స్, థియేటర్, మల్టీప్లెక్స్‌‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

దీన్ని అమెరికాలో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సీపీఆర్ ప్రోగ్రామ్ అంటారు.

మనదేశంలో రెండు శాతం మందికి మాత్రమే సీపీఆర్ గురించి నాలెడ్జ్ ఉంది.

కిల్లర్ కౌంట్

మన దేశంలో చనిపోయే ప్రతి లక్ష మంది జనంలో 4,280 మంది  కార్డియాక్ అరెస్ట్ వల్లే చనిపోతున్నారు. ఈ కార్డియాక్ డెత్స్‌‌లో 60 శాతం కార్డియాక్ అరెస్టులే.

ఏఈడీ

కార్డియాక్ అరెస్టు అయినప్పుడు ఊపిరి ఆగిపోయి, కింద పడిపోయి ఉంటారు. వీళ్లకు సీపీఆర్ స్టార్ట్​ చేసి, ఏఈడీని ఉపయోగిస్తే 80 శాతం బతికే అవకాశాలుంటాయి. ఏఈడీ  కిట్​ని అందుబాటులో ఉంచుకుంటే సాధారణ వ్యక్తులు కూడా అవసరమైనవారికి చికిత్స చేయొచ్చు. ఏఈడీ పవర్ ఆన్ చేసి, ప్యాడ్స్​ను  పేషెంట్​కి అటాచ్ చేసి పేషెంట్ కండీషన్ (పల్స్​ని) అనలైజ్ చేస్తారు. తర్వాత షాక్ బటన్ ప్రెస్ చేస్తే పెషెంట్​కు షాక్ కొడుతుంది. రెండు నిమిషాల తర్వాత మళ్లీ ఎనలైజ్ (పల్స్​రేట్) చేయాలి. సీపీఆర్ ఆపకుండా చేస్తూనే ఉండాలి. మెడకు పక్కన ఉండే కెరాటిడ్ ఆర్టరీ (మెదడు నుంచి గుండెకు రక్తం సరఫరా చేసే నాళం) పల్స్ చెక్ చేయాలి.  అయితే ఈ పల్స్​ డాక్టర్​ మాత్రమే చెక్​ చేయాలి. పల్స్ వస్తే గుండె సాధారణ స్థితికి వచ్చి కొట్టుకుంటున్నదని అర్థం. ప్రాణాపాయం ఉండదు. కొంత సేపటికి పేషెంట్ మెలకువలోకి వస్తాడు. తర్వాత సీపీఆర్ చేస్తూ హాస్పిటల్​కు చేర్చాలి.

ఈ ఏఈడీ కిట్ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుంది. కమ్యూనిటీ అసోసియేషన్స్, అపార్ట్​మెంట్స్, ఆఫీసుల్లో వీటిని అందుబాటులో ఉంచితే ఎవరికి ప్రాణాపాయం మీదకు వచ్చినా ఉపయోగించుకోవచ్చు. మీరు ఈ ఆర్టికల్ చదివేలోగానే (పది నిమిషాల్లో) ఈ భూమ్మీద 30 మంది కార్డియాక్ అరెస్ట్​​తో చనిపోయి ఉంటారు. సమస్య  తీవ్రత అంతలా ఉంది. మనదాకా రాకముందే కమ్యూనిటీ అవేర్​నెస్​తో  రెడీగా
ఉంటే ముప్పు  లేనట్టే. :::నాగవర్ధన్​ రాయల.

ఇవి కూడా చదవండి

అమెజాన్ లక్కీ లాటరీ పేరుతో టీచర్ ను ట్రాప్ చేసి.. 

‘పద్మాలయ’ భూములు వెనక్కి తీస్కోవాలి

అప్పుడు పబ్‌‌.. ఇప్పుడు వైల్డ్‌‌లైఫ్‌‌ హాస్పిటల్‌‌

కారు యాక్సిడెంట్.. పోలీసులకు బంగారం అప్పగించిన 108 సిబ్బంది