- మేం 25 లక్షల ఎకరాలు పంచితే కేసీఆర్ లాక్కుంటుండు: రాహుల్
- రైతులకు రుణమాఫీ చేస్తం
- పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు
- యాత్రలో రాహుల్ హామీలు
మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ దళితులకు 25 లక్షల ఎకరాలు పంచిందని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ భూములను లాక్కోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం నారాయణపేట జిల్లా ఎలిగండ్ల నుంచి 23.3 కిలోమీటర్లు సాగింది. మహబూబ్‌నగర్ రూరల్ మండలం ధర్మాపూర్‌లోని జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకుంది. మన్యంకొండ దగ్గర ఏర్పాటు చేసిన మీటింగ్‌లో, దేవరకద్ర మండలం పెద్దగోప్లాపూర్ వద్ద చేనేత కార్మికులతో భేటీ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేనేతపై జీఎస్టీని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. జీఎస్టీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్టు నేత కార్మికులు ఆయన దృష్టికి తెచ్చారు. రంగుల మీద 18 శాతం, బట్టల అమ్మకం మీద, దారం మీద 5 శాతం చొప్పున జీఎస్టీ విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేనేతపై 20 శాతం సబ్సిడీ ఉండేదని, ప్రస్తుతం సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు చేనేతపై జీఎస్టీ ఎత్తేయడంతోపాటు నేత కార్మికులకు న్యాయం చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
ఉద్యోగాలు వస్తలేవు..
తెలంగాణలో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీని అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. యాత్రలో రోజూ రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువతను కలుస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటున్నట్టు చెప్పారు. లంచ్ బ్రేక్‌లో తనను ఆదివాసీలు కలిశారని, పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా వేధిస్తున్న విషయాన్ని చెప్పారని రాహుల్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. జీఎస్టీ వల్ల చిన్న, మధ్య తరహా వ్యాపారులు నష్టపోతున్నారని, వారిని ఆదుకుంటామని చెప్పారు. జీఎస్టీ, నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఇబ్బందులు పడ్డారని, సంపన్నులు మరింత లాభపడ్డారని చెప్పారు. యాత్రలో తనను కలిసిన యువకులు, స్టూడెంట్లను మీరేం కావాలనుకుంటున్నారని అడిగితే ఐఏఎస్.. పోలీస్.. అని చెప్తున్నారని, ఉద్యోగాలు వస్తున్నాయా అని అడిగితే వారి నుంచి సమాధానం రావడం లేదన్నారు.
టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే..
టీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటేనని, ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించుకుంటారని రాహుల్ ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో హింసను ప్రేరేపిస్తున్నాయని, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతున్నాయని ఫైర్ అయ్యారు. హింసను, ద్వేషాన్ని రూపుమాపేందుకే జోడో యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. యాత్రలో ఎవరన్నా కింద పడితే అందరూ కలిసి వారిని పైకి లేపి నడిపిస్తున్నారని, అదే భారతీయుల లక్షణమని చెప్పారు. వందల కిలోమీటర్లు నడుస్తున్నా అలసట రావడం లేదని, ప్రజల శక్తిని తనకు ఇస్తునందువల్లే ఎంత దూరం పోయినా.. యాత్రను ఇప్పుడే ప్రారంభించిన భావన కలుగుతోందని చెప్పారు.