రైతులకు రైతు బంధు పథకం కింద 15 వేలు, కౌలు రైతు లకు 12 వేలు ఇస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. జూన్ 30వ తేదీ శుక్రవారం ఖమ్మంలో డీసీసీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మం సభ నుంచే బీఆర్ఎస్ కు సమాధి కడ్తామన్నారాయన. ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదని.. బంగాళాఖాతంలో పడేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో పదికిపది సీట్లు గెలుస్తామన్నారు రేవంత్. ఈ సారి పువ్వాడ అజయ్ గెలవడం అసాధ్యమన్నారు . జూలై 2న ఖమ్మంలో జనగర్జన సభను విజయవంతం చేసి తీరుతామన్నారు. సభకు డబ్బులు కట్టి బస్సులు అడిగితే ఇవ్వట్లేదన్నారు. ఎవరు అడ్డుకున్నా తొక్కుకుంటూ సభకు రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రేవంత్.
ఖమ్మం జిల్లాకు భట్టి విక్రమార్క, రేణుక రెండు కళ్లని.. పొంగులేటి మూడో కన్ను అని అన్నారు రేవంత్. పొంగులేటికి వ్యాపారులున్నాయి కాబట్టి బీజేపీలో చేరుతారనుకున్నానని కానీ.. అభిమానులు, అనుచరుల కోరిక మేరకు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు రేవంత్. పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతున్నారనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి కదిలారని అన్నారు.