అప్పుడు సాయన్నపై.. ఇప్పుడు సాయిచంద్​పై వివక్ష

అప్పుడు సాయన్నపై.. ఇప్పుడు సాయిచంద్​పై వివక్ష
అంత్యక్రియల్లో దక్కని అధికారిక లాంఛనాలు 
ప్రజాకవి గూడ అంజన్న విషయంలోనూ అంతే..  
సినీ స్టార్లు, ఏపీ నేతలు, నిజాం వారసులకు మాత్రం 
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు 

హైదరాబాద్, వెలుగు : దళిత నేతలు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వడం లేదు. అధికారిక పదవుల్లో ఉండి కన్నుమూసినా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం లేదు. నాడు ప్రజాకవి గూడ అంజన్న.. మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న.. నిన్న గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ వరకు ఇట్లనే వ్యవహరించింది. సినిమా స్టార్లు, ఏపీ నేతలు, నిజాం వారసులు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న సర్కార్.. దళిత నేతలపై ఎందుకు వివక్ష చూపుతున్నదని దళిత సంఘాలు, ప్రతిపక్షాలతో పాటు పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. 

‘‘సినీ నటులు కృష్ణంరాజు, హరికృష్ణ, కైకాల సత్యనారాయణతో పాటు నిజాం వారసులకు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. వాళ్ల కంటే గూడ అంజన్న, సాయన్న, సాయిచంద్ తక్కువనా?” అని ప్రశ్నిస్తున్నారు. 

సాయన్న అంత్యక్రియల్లో అనుచరుల ఆందోళన.. 

గతంలో తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాకవి, గాయకుడు గూడ అంజన్న చనిపోతే.. ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు ఎవరూ హాజరుకాలేదు. అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో నిర్వహించలేదు. కొన్ని నెలల కింద కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించలేదు. దీంతో శ్మశానవాటిక దగ్గరే సాయన్న అనుచరులు ఆందోళనకు దిగారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిని నిలదీశారు. మంత్రులు జవాబు చెప్పలేక వెనక్కి వెళ్లిపోయారు. చివరికి అభిమానులకు సాయన్న కుటుంబసభ్యులు నచ్చజెప్పి అంత్యక్రియలు జరిపించారు. ఇప్పుడు సాయిచంద్ మరణిస్తే సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో వచ్చి నివాళులు అర్పించారు. కానీ అంత్యక్రియలు మాత్రం అధికారిక లాంఛనాలతో నిర్వహించలేదు. 

దళితుల చావులపైనా వివక్ష: ఆర్ఎస్పీ 

‘‘వేల కోట్లు సంపాదించిన సినీ ప్రముఖులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన సీఎం కేసీఆర్.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన సాయిచంద్ కు ఎందుకు జరపలేదు. కేవలం దళితులైనందుకే సాయిచంద్, ఎమ్మెల్యే సాయన్న, గూడ అంజన్న అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపలేదు. కేసీఆర్ నియంత పాలనలో దళితుల చావులపైనా వివక్ష కొనసాగుతున్నది” అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. 

‘‘నిన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న.. నేడు ఉద్యమకారుడు సాయిచంద్.. దళిత నేతలపై అదే కక్ష.. అదే వివక్ష.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఈ బిడ్డలు అర్హులు కారా? ఏపీ ప్రముఖులకు, ఆఖరికి నిజాం వారసులకు దక్కిన గౌరవం.. తెలంగాణ కోసం బతుకులను ధారపోసిన ఈ దళిత నేతలకు ఎందుకు దక్కదు? దళిత ద్రోహి కేసీఆర్” అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ‘‘తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేసిన గొంతు మూగబోతే అధికారిక లాంఛనాలు గుర్తుకు రాలేదా? ఉద్యమకారులకు దక్కే గౌరవం ఇదేనా? పైసల కోసం ముఖానికి రంగేసి ఆడిపాడి ఆస్తులు కూడగట్టుకున్నోళ్ల సావులకు సకల మర్యాదలు, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు.. తెలంగాణ కోసం పోరాడినోళ్లకు మాత్రం లేవా? సాయిచంద్ పాట అవసరమైంది. సాయిచంద్ ఆట అవసరమైంది. కానీ అతని చావు దగ్గర మాత్రం కులమనే కట్టుబాట్లు కేసీఆర్ కు అడ్డం వచ్చినయా?” అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నించారు.