పశువులకు ఇన్సురెన్స్ బంద్!
పాడి పరిశ్రమకు సర్కారు ప్రోత్సాహం నిల్
ఏడేళ్లుగా నిలిచిన ఇన్సురెన్స్ స్కీం
జగిత్యాల, వెలుగు : రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కొనసాగిస్తే ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది. కానీ ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలను చిన్నచూపు చూస్తోంది. సర్కారు పశు బీమా నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పాడి పశువులకు రైతు వాటా ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కొంత కలిపి బీమా సౌకర్యం కల్పించేది. పశువులు చనిపోయినపుడు వచ్చిన ఇన్యురెన్స్డబ్బులతో రైతులు మళ్లీ పశువులను కొనుగోలు చేసుకునేవారు. రాష్ట్రంలో పశుసంవర్థక శాఖ లెక్కల ప్రకారం 31 జిల్లాల్లో ప్రస్తుతం 90.5 లక్షల పశువులు ఉన్నాయి. ఏడేళ్ల క్రితం ఒక్కో పశువు ఇన్సురెన్స్ కోసం ఏడాదికి సుమారు రూ. 300- నుంచి రూ. 500 వరకు ప్రీమియాన్ని రైతులు ప్రభుత్వానికి చెల్లించేవారు. పశువులు మరణిస్తే వాటి రకాన్ని బట్టి రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు పరిహారం అందేది. ఏడేళ్లుగా ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టడంతో పశువులు మృతిచెందినపుడు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇటీవలి కాలంలో పశువుల ధరలు పెరగడంతో ప్రస్తుతం ప్రైవేట్ ఇన్సురెన్స్ సంస్థలు పశువుల రకాన్ని బట్టి రూ. 5- వేల నుంచి రూ. 10 వేల వరకు ప్రీమియం వసూలు చేస్తున్నాయి. దీంతో రైతులు ఇన్సురెన్స్తీసుకునేందుకు వెనుకాడుతున్నారు.
ఏటా వేలల్లో మృతి
ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, వ్యాధులతో ఏటా వేల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయి. జగిత్యాల జిల్లాలో లంపి స్కిన్, ప్రకృతి వైపరీత్యాలు, విద్యుత్ షాక్, ఇతర వ్యాధుల బారిన పడి ఇప్పటివరకు 120 పశువులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇలా వివిధ కారణాలతో ఏడాదికి సుమారు ఒక్క జిల్లాలోనే సుమారు నాలుగు వేల వరకు పశువులు మృత్యువాత పడుతున్నాయి. పశువుల అకాల మరణాలతో రైతులకు రూ. వేలల్లో నష్టం వాటిల్లుతోంది. అప్పు చేసి కొన్న పశువులు అర్ధంతరంగా మరణిస్తే ఆ రైతుల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. ప్రతి ఏడాది భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించి ప్రైవేటుగా ఇన్సురెన్స్తీసుకునే ఆర్థిక స్తోమత తమకు లేదని రైతులు వాపోతున్నారు. సర్కార్ ఆదుకోవాలని కోరుతున్నారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన సనుగుల లక్ష్మణ్కొడుకు తిరుపతి(18) రెండు నెలల క్రితం గేదెలు మేపడానికి వెళ్లాడు. అక్కడ గేదె కరెంట్ షాక్ కు గురవడంతో దానిని కాపాడబోయి మృతిచెందాడు. గేదె సైతం దక్కలేదు. ఓ వైపు కొడుకు మృతి, మరోవైపు జీవనాధారమైన గేదె చనిపోవడంతో లక్ష్మణ్కుంగిపోయాడు. సర్కార్ పశువుల బీమా అందజేస్తే కనీసం ఆర్థిక భరోసానైనా ఉండేదని అంటున్నారు.
జగిత్యాలకు చెందిన పాడి రైతు చిన్నారెడ్డి ఇరవై ఏళ్లుగా 30 బర్రెలతో ఫాం నడిపిస్తున్నాడు. ఏడాది కాలంలో రోగాలతో మూడు బర్రెలు చనిపోయాయి. మార్కెట్ లో ఒక్కో మేలురకం బర్రె విలువ రూ. 70 వేల- నుంచి రూ. 80 వేల వరకు ఉంది. పశువుల మృతితో తీవ్ర నష్టం వాటిల్లడంతో కొన్ని బర్రెలు అమ్మేశాడు. ప్రస్తుతం పది మాత్రమే ఉన్నాయి. పశువుల మృతితో పాడి పరిశ్రమ కలిసిరాక తీవ్రంగా నష్టపోయి అప్పుల్లో కూరుకుపోతున్నామని వాపోతున్నాడు.
అంత ప్రీమియం ఎట్ల కట్టాలె
ఐదేళ్లుగా డెయిరీ ఫాం నడిపిస్తున్నా. దాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే ఖర్చులు పెరిగి ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఇన్సురెన్స్ప్రీమియం భారీగా పెంచేశారు. అందుకే ఇన్సురెన్స్తీసుకోవట్లే. రోగాలు వచ్చి బర్రెలు చనిపోతే ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలి. లోన్స్ ఇవ్వడంతోపాటు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలి.
– శంకరమ్మ, మహిళా రైతు
రూ. 40 వేల ఆవు చనిపోయింది
లంపీ స్కిన్వ్యాధి కారణంగా ఆవులు, ఎద్దులు చనిపోతున్నాయి. ముందస్తుగా వ్యాక్సిన్వేసినప్పటికీ వ్యాధి సోకుతోంది. రూ. 40 వేల విలువ చేసే ఆవు మృతిచెందింది. ఇన్సురెన్స్ లేక ఆర్థికంగా నష్టపోయా.
– రాజం ఎల్లయ్య, కోటిలింగాల