పంటలు నీటమునిగితే పైసా కూడా ఇయ్యరు

తెలంగాణ ఏర్పాటు తర్వాత రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని అధికార పార్టీ లీడర్లు అనేక వేదికలపై చెప్పారు. రైతు బంధు లాంటి విప్లవాత్మక పథకం తీసుకొచ్చామని, అలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని ఇప్పటికీ చెబుతున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే.. ఒక్క రైతు బంధు మినహా వ్యవసాయానికి సంబంధించి మిగిలిన అన్ని పథకాలు, సబ్సిడీలను ప్రభుత్వం అనధికారికంగా ఆపేసింది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు లేక పంటలు ఎండినా, బాగా వానలు పడి మునిగినా.. పంట నష్టం అంచనా వేసి ఎకరానికి ఇంత అని పరిహారం వచ్చేది. కానీ స్వరాష్ట్రంలో ప్రకృతి విపత్తులతో రైతులు పంట నష్టపోతే సర్కారు స్పందించడం లేదు. నిరుడు వానాకాలం లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగితే పైసా కూడా ఇయ్యని టీఆర్ఎస్​ప్రభుత్వం.. మొన్నటి నుంచి పడుతున్న వానలకు దాదాపు13 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినా.. కనీసం నష్టం అంచనాలు కూడా తయారు చేయడం లేదు. ఒక్క రైతు బంధు మాత్రమే ఇచ్చి తమది రైతు ప్రభుత్వం అనడం సమంజసం కాదు. గత వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా కోటి 29 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. కాగా 2021 అక్టోబర్‌‌, నవంబరు నెలల్లో కురిసిన వర్షాలకు పంటలు భారీగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో సాగైన మొత్తం పత్తిపంటలో సగం మేర దెబ్బతిన్నది. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో లక్షల ఎకరాల్లో మిర్చి పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. లక్షల్లో పెట్టుబడి పెట్టి నిండా మునిగామని పలువురు రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. వరంగల్‌‌లోని ఆయా ప్రాంతాల్లో వ్యవసాయశాఖ మంత్రి పర్యటించి, పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్​ పంట నష్టంపై నిర్ణయం తీసుకుంటారని ఇద్దరు మంత్రులు ప్రకటించి వెళ్లిపోయారు. పంట నష్టం వివరాలు కొంత మేరకు సేకరించినా.. ప్రభుత్వం పైసా పరిహారం ఇయ్యలేదు. ఈ వానాకాలం సీజన్​లో ఇప్పటి వరకు 53.79 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గత వారం నుంచి కురుస్తున్న వర్షాలకు దాదాపు13లక్షల ఎకరాలకు పైగా పంటనష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. నిరుడు పంట నష్టపోతే రూపాయి కూడా పరిహారం ఇయ్యని ప్రభుత్వం.. ఈసారి పంట మునిగితే కనీసం అంచనాలు కూడా రెడీ చేయడం లేదు. ఇదీగాక కాళేశ్వరం బ్యాక్​వాటర్​తో పంటలు నీటమునిగి నష్టపోతున్న రైతులదీ ఇలాంటి పరిస్థితే. గత రెండు మూడేండ్లుగా వారు ఏటా పంటలు వేయడం.. బ్యాక్​వాటర్​లో మునిగి నష్టపోవడం పరిపాటిగా మారింది. దీనిపై కొంత మంది రైతులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించగా.. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

హైకోర్టు తీర్పును అమలు చేయలె..
2020లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నాలుగు నెలల్లోగా విపత్తుల నిర్వహణ చట్టం కింద ఇన్‌‌పుట్‌‌ సబ్సిడీ సాయాన్ని అందించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. పంట నష్టాన్ని మూడు నెలల్లో లెక్కించాలని, మరో నెల రోజుల సమయంలో ఇన్‌‌పుట్‌‌ సబ్సిడీ ఇవ్వాలని పేర్కొంది. పంటల బీమా లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందిపడిన చిన్న, సన్నకారు రైతులను, కౌలు రైతులను కూడా ఆదుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నష్టం లెక్కించక పోగా హైకోర్టు తీర్పును సవాల్‌‌ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లింది. రైతు సంక్షేమం కోసం ఆలోచించే రైతు ప్రభుత్వం చేయాల్సిన పనేనా ఇది? రాష్ట్రంలో సుమారు 61 లక్షల మంది రైతులు ఉండగా, వారిలో నాలుగోవంతు సుమారు 15 లక్షల దాకా కౌలు రైతులే ఉన్నారు. వీరు యాసంగిలో 30 లక్షల ఎకరాల్లో, వానాకాలం 45 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో కౌలు రైతులు రాష్ట్రంలో సాగులో ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం వారిని రైతులుగానే గుర్తించడం లేదు. వారికి రైతు బంధు సహా ఏ ఒక్క ప్రభుత్వపర సాయం అందించడం లేదు. పట్టాదారుకు ముందే కౌలు చెల్లిస్తున్న రైతులు.. పంట నీట మునిగితే.. కౌలు, పెట్టుబడి సహా నిండా మునుగుతున్నారు. అప్పు తెచ్చి సాగు చేసే రైతులు గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఎంతో గొప్ప పథకం అని చెబుతున్న రైతు బంధు అమలు చేస్తున్నా.. రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు.

పంటల బీమా ఏది?
ప్రకృతి విపత్తులు వస్తే అండగా మేమున్నామని ప్రభుత్వం భరోసా కల్పిస్తే.. రైతు ధైర్యంగా సాగు భూమిలో బంగారం పండించగలడు. కానీ ప్రభుత్వాలు రైతుకు ఆ భరోసా ఇవ్వడం లేదు. విత్తనం నాటాలంటే భయం.. అది కల్తీదో.. మంచిదో తెలియదు. ఎరువులు, పురుగుమందుల విషయంలోనూ అదే భయం. చేతికొచ్చిన పంటను పకృతి ఏం చేస్తుందోనన్న భయం.. పండిన పంటను కుప్ప నూర్చి మార్కెట్​కు తీసుకుపోయినా.. భయమే.. ప్రభుత్వం కొంటదో కొనదోనని.. ప్రైవేటు వ్యాపారులు ఎంత ధర తగ్గించి అడుగుతారోనని.. ఇలా రైతుకు అడుగడుగునా అడ్డంకులే. వాటిని తొలగించడంలో ప్రభుత్వాలు నేటికీ నిర్లక్ష్యం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గత మూడేండ్ల నుంచి పంటల బీమా అమలు చేయడం ఆపేసింది. ఈ ఏడాది బడ్జెట్‌‌లో పంటల బీమాకు నిధులే కేటాయించలేదు. గత రెండు వానాకాలం సీజన్లలో పంట నష్టపోయిన రైతులకు ఒక్క పైసా సాయం చేయలేదు. బెంగాల్‌‌ తరహా పంట బీమాపై అధ్యయనం చేస్తున్నామని చెప్పి చేతులు దులుపుకుంది. పంట నష్టపోయి.. కంటతడి పెట్టుకున్న రైతు కన్నీళ్లు తుడవలేని.. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రైతు బంధు ఇచ్చి.. తమది దేశంలోనే రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం కంటే దుర్మార్గం మరొకటి ఉండదు. 

కేంద్రం ఇచ్చిన పరిహారం వాడుకొని..
2020 సెప్టెంబర్, అక్టోబర్‌‌ నెలల్లో కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంట పెద్దమొత్తంలో నీళ్లపాలైంది. వరి, పత్తి, కంది, పెసర, నువ్వులు, మినుములు, సోయా, మిరప పంటలకు భారీ నష్టం జరిగింది. కాగా రాష్ట్రంలోని18 జిల్లాల్లో 2.04 లక్షల హెక్టార్ల వరి, 3.10 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయని రాష్ట్ర సీఎం కేసీఆర్​ కేంద్రానికి లేఖ రాశారు. 5.97 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, విపత్తుల సహాయ నిధి నుంచి రూ.552 కోట్లు, నష్టం అంచనాలు వేస్తే ఎంఎస్‌‌పీ మేరకు ఇన్‌‌పుట్‌‌ సబ్సిడీ కింద రూ.7,219 కోట్లు నష్టం జరిగిందని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి 6 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు రిపోర్టు చేసింది.  విపత్తుల నిర్వహణ కింద రూ.595 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర వాటాతో కలిపితే ఆ మొత్తం రూ.978 కోట్లు. సెంట్రల్‌‌ హైలెవెల్‌‌ కమిటీ రూ.245.96 కోట్ల సాయాన్ని రాష్ట్రానికి అందించింది. ఇందులో ఇన్‌‌పుట్‌‌ సబ్సిడీ కింద రూ.188.23 కోట్లు వాడుకునేందుకు అనుమతి ఇచ్చింది. కానీ కేంద్ర సాయాన్ని కూడా రాష్ట్ర సర్కారు రైతులకు అందజేయలేదు. విపత్తుల నిధులను వాడుకునే లెక్కలను కూడా కేంద్రానికి పంపలేదు. 
- మరిపాల శ్రీనివాస్‌‌, సీనియర్ ​జర్నలిస్ట్​