కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు… వరదలతో జనం నష్టపోయి విలవిలాడుతుంటే.. వారికివ్వాల్సిన వరద సహాయాన్ని టీఆర్ఎస్ నాయకులు పందికొక్కుల్లా బొక్కేశారని.. వాటి తాలూకు ఆధారాలన్నీ తీసుకుని అధికారులకు ఫిర్యాదు చేశానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. బాధితులందరికీ మంగళవారంలోపు ఇవ్వకపోతే బుధవారం నాడు జీహెచ్ఎంసీలోనే వంటా వార్పు చేసి.. విస్తర్లను మున్సిపల్ ఆఫీసులో వేసిరేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమ నిరసనతోనైనా సిగ్గొస్తుందేమో చూడాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సీఎం సహాయ నిధి నుండి 550 కోట్ల రూపాయలు వరద సహాయంగా టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తే… వారంతా పందికొక్కులా మెక్కేసినందుకు తన భాద్యత గా ప్రశ్నించడానికే వచ్చానని రేవంత్ రెడ్డి తెలిపారు. వరద సహాయం అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలసి జోనల్ కమిషనర్ ను కలసి రాత పూర్వకంగా ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వరద సాయం గా ఇచ్చిన డబ్బుల్లో చాలా వరకు టీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్లాయని.. శవాల మీద చిల్లర ఎరుకున్నట్లుగా టీఆర్ఎస్ వాళ్లు ప్రవర్తించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 1500 వందలు ముందుగా ట్రాన్స్ఫర్ చేసినట్లు ఎందుకు చేయలేదని అడిగితే సమాధానం లేదని.. అంతా అడ్డగోలుగా పంచారని ఆయన విమర్శించారు. తమిళనాడులో జయలలిత, బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ లాంటివాళ్లు మెక్కి ఎలా జైలుకు వెళ్లారో అందరికీ తెలుసునని ఆయన గుర్తు చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ వారు చేసిన అక్రమాలను అన్ని ఆధారాలతో జోనల్ కమీషనర్ కి పిర్యాదు చేశానని… మిగతవాళ్లందరికీ మంగళవారం వరకు ఇవ్వకుంటే… బుధవారం ఇక్కడే వంట వార్పు చేసి విస్తర్లు మున్సిపల్ ఆఫీసు లో వేస్తాము… అప్పుడైనా సిగ్గోస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డేగలు, గద్దల్లా శవాలు పీక్కుతున్నట్లుగా వారి లీడర్స్ ప్రవర్తించారు… వాళ్లు బస్తీలోకి వస్తే… చీపుర్ల తో తరిమే పరిస్థితి వస్తుంది.. 150 డివిజన్ల లోని అన్ని బస్తీల్లో పైసలు ఇవ్వాల్సిందేనని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.