అలా చేయకుంటే.. 6 నెలలూ ఎండాకాలమే

మండు వేసవిలో ఉన్నట్టుండి భారీ వర్షాలు కురుస్తాయి. చలికాలం పగలు ఎండలు మండిపోతాయి. రాత్రులు విపరీతమైన చలి ఉంటుంది. వానా కాలంలో సక్కగ వానలు పడవు. ఒక ఏడాది వరదలొస్తే.. మరో ఏడాది కరువుతో అల్లాడిపోతాం. ఇప్పటికే సీజన్లలో మనం చూస్తున్న మార్పులివి. దీనికి మూల కారణం గ్లోబల్ వార్మింగ్. ఈ మార్పుల కంట్రోల్కు సరైన చర్యలు తీసుకోకుంటే 2100 సంవత్సరం నాటికి ఇండియా, చైనా సహా భూమిపై సగానికి పైగా దేశాల్లో సమ్మర్ డబుల్ అవుతుందని చైనా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఆరు నెలల పాటు ఎండా కాలమే ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల పర్యావరణంతో పాటు భవిష్యత్తు తరాల ఆహార భద్రత, ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

గ్లోబల్ వార్మింగే కారణం

సీజన్స్లో ఇప్పటికే మనం చాలా మార్పులు చూస్తున్నాం. ఈ మార్పులు మరితం తీవ్రం కాబోతున్నాయి. పోయే కొద్దీ ఎండాకాలం రావాల్సిన టైమ్ కన్నా ముందే స్టార్ట్ అయ్యి, ఎక్కువ రోజులు ఉండబోతోంది. చలికాలం లేట్గా మొదలై, త్వరగా ముగిసిపోనుంది. అయితే ఈ మార్పులన్నింటికీ గ్లోబల్ వార్మింగే కారణమని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వెహికల్స్, ఫ్యాక్టరీల నుంచి రిలీజ్ అవుతున్న కార్బన్ ఎమిషన్స్తగ్గించాలని ఏటా అన్ని దేశాలు టార్గెట్లు పెట్టుకుంటున్నా  ఫెయిల్ అవుతున్నాయని, కార్బన్ ఎమిషన్స్ కంట్రోల్ చేయకపోతే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ పోతుందని సైంటిస్టుల టీమ్ చెబుతోంది. పారిస్ ఒప్పందానికి లోబడి అన్ని దేశాలు గ్లోబల్ వార్మింగ్ను కంట్రోల్ చేయడమే ఉన్న ఏకైక పరిష్కార మార్గమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. యావరేజ్గా ఏటా గ్లోబల్ టెంపరేచర్లో 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ పెరుగుదల లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

సీజన్ మార్పులపై 1952 నుంచి డేటా తీసి..

చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్త, ఫిజియాలసీ ఓఫనోగ్రఫీ ఎక్స్పర్ట్ యుపింగ్ గువాన్ నేతృత్వంలోని సైంటిస్టుల టీమ్ 1952 నుంచి 2011 మధ్య జరిగిన వాతావరణ మార్పులపై డేటాను సేకరించి లోతైన అధ్యయనం చేశారు. ఆయా సంవత్సరాల్లో కార్బన్ ఎమిషన్స్ లెవల్, గ్లోబల్ వార్మింగ్ను ఆధారంగా చేసుకుని వేసవి, చలికాలం ఎన్నాళ్లు ఉంది? టెంపరేచర్స్ ఎలా నమాదయ్యాయి? వంటి అన్ని అంశాలను పరిశీలించారు. వాటిని ప్రస్తుత పరిస్థితులను లింక్ చేస్తూ భవిష్యత్తులో సీజన్ మార్పులు ఎలా ఉండొచ్చన్నదాన్ని అంచనా వేశారు. 

టిబెట్, యూరోప్ రీజియన్లలో తీవ్రమైన మార్పులు 

గ్లోబల్ వార్మింగ్ కంట్రోల్ చేసి, సీజన్ చేంజెస్ జరగకుండా చూసుకోకపోతే అనూహ్యమైన పరిణామాలు ఎదురవుతాయి. చలికాలం సమ్మర్ను తలపించేలా ఎండలు భగ్గుమనడం, ఎండాకాలంలో రాత్రులు మంచు కురవడం లాంటివి జరిగొచ్చని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్త యుపింగ్ అన్నారు. రెగ్యులర్ టెంపరేచర్లకు ఉన్నట్టుండి 25 శాతం పెరుగదల కనిపిస్తే దానిని సమ్మర్ మొదలైనట్టుగా తమ అధ్యయనంలో లెక్కగట్టామని చెప్పారు. 1950ల్లో సీజన్లు అన్నీ చాలా సక్రమంగా వచ్చేవని, వాతావరణాన్ని కూడా పక్కాగా అంచనా వేయగలిగేలా అప్పటి పరిస్థితులు నడిచాయని అన్నారు. ఆ తర్వాత క్రమంగా మార్పులు మొదలయ్యాయని చెప్పారు. అయితే 1952, 2011 మధ్య జరిగిన మార్పులను గమనిస్తే వేసవి 78 రోజుల నుంచి 95 రోజులకు పెరిగిందని, చలికాలం 76 రోజుల నుంచి 73 రోజులకు తగ్గిందని తెలిపారు. అలాగే వసంత రుతువు 124 రోజుల నుంచి 115 రోజులకు, శరదృతువు 87 నుంచి 82 రోజులకు తగ్గిందని చెప్పారు.  ఇప్పటికే సమ్మర్ ముందుగా మొదలవడాన్ని మనం చూస్తున్నామని, 2100 నాటికి క్రమంగా మార్పులు జరిగి ఎండాకాలం నిడివి ఆరు నెలలకు పెరుగుతుందని యుపింగ్ అన్నారు. చలికాలం 2 నెలలకు తగ్గుతుందని చెప్పారు. ఇండియా, చైనా, రష్యా, యూరప్లోని మెజారిటీ దేశాలు సహా ఉత్తరార్ధ భూగోళమంతా ఇదే పరిస్థితి ఎదురవుతుందని అంచనా వేశామన్నారు. టిబెటన్ పీఠభూమి రీజియన్ అయిన కాశ్మీర్, లడఖ్, చైనాలోని కొన్ని ప్రాంతాలు, యూరప్లోని ఫ్రాన్స్, ఇంగ్లండ్, ఇటలీ, స్పెయిన్, గ్రీస్ వంటి ప్రాంతాల్లో ఈ సీజన్ మార్పులు తీవ్రంగా ఉంటాయన్నారు. ఎండల తీవ్రత చాలా పెరుగుతుందని యుపింగ్ చెప్పారు.

ఎదురయ్యే సమస్యలివే

  • సమ్మర్ ఆరు నెలలకు పెరగడమే కాదు, వడగాలులు తీవ్రమవుతాయి. చలికాలంలో రాత్రి టెంపరేచర్స్ భారీగా పడిపోతాయి. కార్చిచ్చులు లాంటివి పెరిగి, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది.
  • సీజన్లలో మార్పులు రావడం వల్ల వర్షాలు పడే ప్యాట్రన్ మారిపోతుంది. దీంతో వ్యవసాయం మీద ఎఫెక్ట్ పడి దిగుబడులు తగ్గిపోతాయి. ఇది భవిష్యత్ తరాల ఆహార భద్రతకు ముప్పు వస్తుంది.
  • సీజన్ సైకిల్స్ మారడం వల్ల చాలా రకాల మొక్కలు, వృక్ష జాతులు, వాటి నుంచి వచ్చే పూలు, పండ్ల టైమింగ్స్ మారిపోతాయి. దీని వల్ల వలస పక్షులు అంతరించిపోయే పరిస్థితి రావచ్చు.
  • ఎండ తీవ్రత పెరగడం, మంచు తుఫాన్లు లాంటివి రావడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు పెరుగుతాయి. అలాగే చాలా రకాల జబ్బులకు కారణమైన దోమల లైఫ్ పెరుగుతుంది.