సుప్రీం మార్గదర్శకాలు హైకోర్టులు పాటించకపోతే?

సుప్రీం మార్గదర్శకాలు హైకోర్టులు పాటించకపోతే?

బెయిల్ దరఖాస్తులను పరిష్కరించడానికి రోజుల తరబడి వాదనలు వినాల్సిన అవసరం లేదు. పది నిమిషాల్లో వాదనలు ముగించాలి. అంతకు మించి సమయం కేటాయిస్తే అది కోర్టు సమయాన్ని వృథా చేయడమేనని సుప్రీంకోర్టు గత డిసెంబర్​నెలలో ఓ బెయిల్​ పిటీషన్​ను పరిష్కరిస్తూ అన్నది. ఢిల్లీ హైకోర్టు ఓ బెయిల్​దరఖాస్తును 20 రోజులకు పైగా విచారించింది. జస్టిస్​ సంజయ్​కిషన్​ కౌల్, జస్టిస్​ ఏఎస్ ​ఓకా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్​ ఆ దరఖాస్తును విచారించింది. 

సుప్రీం చెప్పిన ఈ మాటలు ఒక్క రెగ్యులర్ ​బెయిల్స్​కి మాత్రమే కాదు. ముందస్తు బెయిల్స్ కు కూడా వర్తిస్తుంది. ఈ విషయం న్యాయమూర్తులకూ తెలుసు.న్యాయవాదులకూ తెలుసు. అయినా బెయిల్​దరఖాస్తుల విచారణ రోజుల తరబడి జరగడం సర్వసాధారణమైపోయింది. అయితే ఈ పరిస్థితి బాగా పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తుల విషయంలోనే కన్పిస్తుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను హైకోర్టులు ఖాతరు చేస్తున్నట్టు అనిపించడం లేదు. 

కోర్టులు డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తులకు మాత్రమే ఉపయోగపడుతాయన్న  ప్రజల అభిప్రాయం మరింత బలపడే అవకాశం కన్పిస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి నోటిమాట ద్వారా వెలిబుచ్చిన ‘దారుణమైన, ఆమోదయోగ్యం’ కాని ఉత్తర్వులు అన్న మాటలకు విలువ లేకుండా పోతున్నది. ‘ఈ ఉత్తర్వులు జారీ చేయడానికి మేం సంతోషంగా లేం. ముందస్తు బెయిల్​పై ఆర్డర్​జారీ చేయడానికి ఎంత సమయం కావాలి?’ అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నరసింహ నిరాశ, ఆశాభంగాన్ని వ్యక్తపరిచారు. ఇవేవీ హైకోర్టు న్యాయమూర్తులు పట్టించుకున్నట్టు కన్పించడం లేదు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. కక్షిదారులు పట్టించుకుంటున్నారు. 

ఆసక్తికర వ్యాఖ్యలు..

కొలీజియం గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్​ జె.చలమేశ్వర్​ ఈ మధ్య కొచ్చీలో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు. అవి ఆసక్తికరమే కాదు.. వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి కూడా. ఆయన మాటల్లో చెప్పాలంటే.. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే, బదిలీలు చేసే కొలీజియంలో పారదర్శకత లేదని, న్యాయమూర్తుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు కొలీజియం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, చాలా మంది న్యాయమూర్తులు సోమరులని, నిర్ణీత సమయానికి తీర్పులు రాయరని, మరికొంతమంది అసమర్థులని ఆయన అన్నారు. కొలీజియం ముందు కొన్ని ఆరోపణలు వచ్చినా కొలీజియం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడైనా చర్యలు తీసుకోవాలి. 

కానీ ఆ పని కూడా కొలీజియం చేయడం లేదు. ఎక్కువలో ఎక్కువ బదిలీలకు సిఫారసు చేస్తారని ఆయన అన్నారు. ఓ రెండు తీర్పులు అర్థం కావడం లేదని, వాళ్లు రాసిన ఇంగ్లీష్ భాష గందరగోళంగా ఉందని సుప్రీంకోర్టు ఆ తీర్పులను హైకోర్టుకు పంపిందని కూడా ఆయన అన్నారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల గురించి కూడా సుప్రీంకోర్టు ఇటీవల కీలక కామెంట్స్​చేసింది. కొన్నింటిని తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతే తప్ప ఆ న్యాయమూర్తులను ఏమీ అనలేదు. ఎందుకంటే వాళ్లు శాశ్వత న్యాయమూర్తులు. స్కిన్​టు స్కిన్​ కేసులో చెప్పిన తీర్పుని సుప్రీం కోర్టు తప్పు పట్టి బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి  పుష్పా గనేడి వాలాని  శాశ్వత న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సిఫారస్​ చేయలేదు. 

చివరికి ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమెకు విధించిన శిక్ష ఆమె చేసిన తప్పిదానికి  సమానంగా లేదన్న అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు.  అలాంటి చర్యలు శాశ్వత హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో సుప్రీంకోర్టు తీసుకునే వీలు లేదు. మరో విషయం సుప్రీంకోర్టుకు హైకోర్టు సబార్డినేట్​కాదు. మరి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా హైకోర్టు ప్రవర్తిస్తే సుప్రీంకోర్టు ఏం చేయాలి? సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఆలోచించాలి. 

కోర్టు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు

ముందస్తు బెయిల్​ మంజూరు చేసే ముందు కోర్టులు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటాయి. ఆ వ్యక్తిపై ప్రతిపాదించిన ఆరోపణల స్వభావం, వాటి తీవ్రత, ఆరోపణలు చేయడానికి దారి తీసిన సంఘటనల సందర్భం, కేసు విచారణను దరఖాస్తుదారుడు ఎదుర్కొంటాడానన్న విషయం, అదే సాక్షులను భయబ్రాంతులను చేసే అవకాశం ఉందానన్న విషయం, వాటికి సహేతుక, ప్రజల హితం, ‘రాజ్య’ ప్రయోజనాలు అన్న విషయాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.  నేరం రుజువు అయ్యే వరకు ముద్దాయి నిర్దోషి అన్న భావనను కూడా కోర్టులు కలిగి ఉండాలి. ఈ విషయాలను గురుభక్ష్​ సింగ్​ సిబ్బియా, ఏఐఆర్​1980 సుప్రీంకోర్టు 1632 కేసులో చెప్పింది. 

వీటినే మళ్లీ సుశీల అగర్వాల్ ​కేసులో పునరుద్ఘాటించింది. కేసులో తీవ్రత ఉండి ఆరోపణలు బలంగా ఉంటే ఆ వ్యక్తి ముందస్తు బెయిల్​కి అర్హుడు కాదు. ఈ విషయాన్ని కోర్టులు గమనించాలి. వీటన్నింటి కన్నా ముఖ్యం కోర్టులు మీద విశ్వసనీయత. అది క్రమక్రమంగా తగ్గిపోయే అవకాశం కన్పిస్తుంది. అడహక్​హైకోర్టు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తులకు భేదం ఉంటుంది. అడహక్​న్యాయమూర్తులను సుప్రీంకోర్టు తొలగించే అవకాశం ఉంటుంది. శాశ్వత న్యాయమూర్తులను తొలగించే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. అభిశంసన సూత్రం ద్వారా మాత్రమే వారిని తొలగించే అవకాశం ఉంది. వారి బదిలీలను సిఫారసు చేసే అధికారం మాత్రమే సుప్రీంకోర్టు కొలీజియంకు ఉంది. ఆ బదిలీలను ఆమోదించాల్సింది కేంద్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు బదిలీల సిఫారసులు అమలుకు నోచుకోనివి ఎన్నో.

ముందస్తు బెయిల్​ అంటే?

ముందస్తు బెయిల్​ గురించి గతంలో చాలా తీర్పులు వచ్చాయి. అయితే 2020లో సుశీల అగర్వాల్​వర్సెస్​(ఎన్ సీటీ ఆఫ్​ ఢిల్లీ) 2020(5) ఎస్​సీసీ 21వ కేసు ప్రముఖమైనది. ఇది రాజ్యాంగ బెంచ్​వెలువరించిన తీర్పు. న్యాయమూర్తులు అరుణ్​మిశ్రా, ఇందిరా బెనర్జీ, వినీత్​సరాన్, ఎంఆర్​షా, ఎస్​రవీంద్ర భట్​లు ఈ తీర్పు వెలువరించారు. అరెస్టుకు ముందు బెయిల్​ ఇచ్చే ఉత్తర్వులను యాంటిసిపేటరీ బెయిల్​అంటారు. క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లోని సెక్షన్​438 ప్రకారం ఇచ్చే ఉత్తర్వులను ప్రకారం ఆ దరఖాస్తుదారుడు అరెస్ట్ కావాలి. 

అరెస్టు అయిన వెంటనే విడుదల కావాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్​21 ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు మద్దతు తెలిపే ఉత్తర్వులు ఇవి. సెక్షన్​437, 439 క్రిమినల్​ప్రొసీజర్​ కోడ్​ప్రకారం జారీ అయ్యే ఉత్తర్వులు వ్యక్తి అరెస్ట్​అయిన తర్వాత బెయిల్​మంజూరు చేసే ఉత్తర్వులు. సెక్షన్​438 ప్రకారం జారీ అయ్యే ఉత్తర్వులు అరెస్ట్​కు ముందు జారీ చేసే ఉత్తర్వులు. ఇలా చాలా విషయాలను ఈ కేసులో సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టులు బ్లాంకెట్​ ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదు. ఏ నేరానికి, ఏ ముద్దాయికి బెయిల్​ మంజూరు చేస్తున్నారో ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలియ జేయాల్సి ఉంటుంది.

-  డా. మంగారి రాజేందర్ జిల్లా, సెషన్స్​ జడ్జి(రిటైర్డ్)