నేను కొడితే మామూలుగా ఉండదు.. బయటకొస్తే మళ్లా భూకంపం పుట్టాలె : కేసీఆర్​

నేను కొడితే మామూలుగా ఉండదు.. బయటకొస్తే మళ్లా భూకంపం పుట్టాలె : కేసీఆర్​
  • తులం బంగారం కోసం కాంగ్రెస్​కు జనం ఓటేసిన్రు
  • నేను చెప్తే వినలే.. అత్యాశకు పోయి ఆగమైన్రు
  • కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టయింది
  • తెలంగాణకు ఇదో మంచి గుణపాఠమని కామెంట్​
  • ఫామ్​హౌస్​లో పార్టీ కార్యకర్తలతో సమావేశం

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్​ను నమ్మి అధికారమిస్తే ప్రజలను నట్టేట ముంచిందని బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్​ అన్నారు.14 నెలలు ఓపిక పట్టామని, ఇకపై ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అవసరమైతే తాను కూడా పోరాటానికి వస్తానని చెప్పారు.  ‘‘ఇన్నాళ్లూ నేను మౌనంగా ఉన్నా. గంభీరంగా ఉండి చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. వట్టిగ కొట్టను కదా. నేను బయటకు వచ్చిన్నంటే మళ్లీ భూకంపం పుట్టాలె’’ అని అన్నారు. ఝరాసంగం నుంచి పాదయాత్రగా వచ్చిన జహీరాబాద్​కు చెందిన 500 మంది పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఎర్రవల్లి ఫామ్​హౌస్​లో కేసీఆర్​తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్​ మాట్లాడారు. ‘‘ఏడాది గడిచిపోయింది. కాళేశ్వరాన్ని ఆడనే పండపెడుతున్నరు. పాలమూరు అక్కడ్నే పండుకున్నది. సంగమేశ్వర, బసవేశ్వర అక్కడే ఉండిపోయినయ్​. ఒకప్పుడు రూ.కోటి ఉన్న భూమి కూడా ఇప్పుడు రూ.50 లక్షలు పలకట్లేదు. భూముల ధరలు పోయినయని అందరూ అంటున్నరు. 4 ఎకరాలున్న రైతు.. 4 కోట్ల ఆసామిని అనుకునేటోళ్లు. మారుమూల ప్రాంతంలోనూ ఎకరాకు రూ.50 లక్షలదాకా ఉండే. అలాంటిది ఇప్పుడు ధరలు సగానికి సగం పడిపోయినయ్​. సగానికిసగం బిజినెస్​ పడిపోయిందంటున్నారు. అంత బాగుండే. ఇప్పుడేమైంది? మొత్తం నాశనం చేసిన్రు. వాళ్లను ఇట్లనే వదిలిపెడితే ఇంకింత నాశనం చేస్తరు. అందుకే ఫిబ్రవరి నెలాఖరులో ఓ భారీ బహిరంగ సభ పెట్టి.. సర్కారును నిలదీద్దాం. అందరూ దానికి కదలిరావాలె’’ అని పిలుపునిచ్చారు. 

మళ్లీ మనదే అధికారం

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్​ ఎంతో వ్యతిరేకతను మూటగట్టుకున్నదని కేసీఆర్​ అన్నారు. కాంగ్రెసోళ్లు దొరికితే కొడతం అన్నట్టుగా పరిస్థితులున్నాయని తెలిపారు. ‘‘వాళ్ల బొంద తెలివికి.. వాళ్ల పార్టీవోడే పోలింగ్​ పెడితే.. 75 శాతం మంది బీఆర్ఎస్​ కావాలన్నరు. 25 శాతమే వాళ్లకు ఓటేసిన్రు. అదీ వాళ్ల పరిస్థితి. ప్రజలు వంద శాతం డిసైడ్​ అయ్యారు. రాబోయే ప్రభుత్వం మనదే. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. రాబోయే రోజుల్లో విజయం మనదే. ప్రజలకు మంచి చెడులు తెలుస్తున్నయ్​. పరిస్థితిని కాంగ్రెసోళ్లు ఇంకా ఘోరం చేస్తరు. కాగ్​ నివేదిక ప్రకారం రూ.13 వేల కోట్ల ఆదాయం తగ్గింది. మార్చి కల్లా మరో రూ.2 వేల కోట్లు పోతయ్. మొత్తం 15 వేల కోట్లు పోయినట్టు. నేనేమో ఏటా రూ.15 వేల కోట్లు పెంచుకుంట పోయిన. ఇంక నాలుగైదు నెలలైతే జీతాలకూ పైసలుండయ్​. అందరికీ పెండింగ్​ పెట్టిన్రు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించిన్రు’’ అని వ్యాఖ్యానించారు.  ‘‘ఫాం హౌస్... ఫాం హౌస్ అని అంటారు. ఇక్కడ అల్లం, ఉల్లిగడ్డ తప్ప ఏమున్నయ్​? కాంగ్రెస్ వాళ్లు ఇక్కడకు వస్తే తలో పార ఇచ్చి తవ్వుకోమందాం’’ అని అన్నారు.

బీఆర్ఎస్​ పుట్టిందే తెలంగాణ కోసం

బీఆర్ఎస్​ పుట్టిందే తెలంగాణ కోసమని కేసీఆర్​ అన్నారు. తెలంగాణను సాధించింది గులాబీ జెండా అని, సాధించిన తెలంగాణను దారిలో పెట్టుకున్నది గులాబీ జెండానేని పేర్కొన్నారు. దేశంలో తెలంగాణను నెంబర్​ 1 గా చేసింది గులాబీ జెండానే అని చెప్పారు. మళ్లీ ఈ దరిద్రులొచ్చి దానిని నాశనం పట్టిస్తున్నరని కాంగ్రెస్​పై మండిపడ్డారు. మళ్లీ తెలంగాణను కాపాడడం బీఆర్ఎస్​తోనే సాధ్యమని చెప్పారు. అప్పుడప్పుడు కొన్ని దుష్ట దినాలొస్తాయని, చెడు ఘడియలొస్తాయని అన్నారు. మనోళ్లు కూడా అట్లనే ఓటేశారని పేర్కొన్నారు. ‘‘నేను అప్పుడే చెప్పిన. వీళ్లను నమ్మితే అమాంతం మింగుతరు.. రైతుబంధుకు రాం రాం అంటరు.. దళిత బంధుకు జై భీం అంటరు అని చెప్పిన. వీళ్లు ముంచుతర్రా నాయనా అని చెప్పినా. అయినా వాళ్లకు ఓటేసిన్రు. బాయిలపడ్డరు.. ఇరుక్కపోయిన్రు. ఉన్నయన్నీ పాయే.. మళ్లీ మొదటికొచ్చే. కైలాసమనుకుంటే పెద్దపాము మింగినట్టయింది పరిస్థితి. రైతులు కొంచెం బాగుపడ్డరనుకున్నం.. రైతు బంధు పడ్డప్పుడు రైతులు ఎంత సంతోషంగా ఉంటుండే. ఇప్పుడు అన్నీ పోయినయ్​. ఇప్పుడు రైతు భరోసా ఇస్తడో ఇవ్వడో భగవంతుడికెరుక. ఇచ్చినా ఎన్నికల కోసం ఇస్తడు.. మోసం చేస్తడు. కడుపునిండా ప్రేమున్నడో ఇట్లనే ఇస్తడా? కరోనా టైంలోనూ రైతు బంధును నేను ఆపలేదు. రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా.. రైతులకు రైతు బంధు వేసినం. నాలుగైదు మంచి స్కీమ్స్​ను తెచ్చి వారిని కాపాడుకున్నాం.  మత్స్యకార్మికులకు చేప పిల్లలు ఇచ్చినం’’ అని తెలిపారు. 

ముస్లింల కోసం  ఏమైనా చేశారా?
 
కాంగ్రెస్​ సర్కారు మొదటి నుంచి ముస్లింల ఓట్లేయించుకున్నదనిగానీ.. వారికి ఏమైనా చేసిందా? అని కేసీఆర్​ ప్రశ్నించారు. ‘‘మనం ముస్లిం పిల్లలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎన్ని గురుకులాలు కట్టినం. అద్భుతమైన చదువు చదువుకున్నరు. ఇప్పుడు విషాహారం, పురుగుల అన్నంతో సమస్యలు ఎదుర్కొంటున్నరు. పిల్లలు స్కూళ్ల నుంచి వెళ్లిపోతున్నరు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకెళ్లిపోతున్నరు. ఏం ఘోరం ఇది. ఇది చేసింది కాంగ్రెసోళ్లే. మళ్లీ ఆ పాత కాంగ్రెస్సే మోపైంది. మళ్లీ కరెంట్​ కోతలు మోపైనయ్​. ఎండాకాలం ఇంకేం గతైతదో. అడిగే నాథుడు లేడు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే.. పోలీస్​ స్టేషన్​లో పెట్టడం. ఇదేనా రాజ్యం? ఇట్లనే ఉంటదా రాజ్యం? ఎందుకొచ్చిందీ పరిస్థితి. గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకున్నం. సాగుకు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకున్నం. మెదక్​కు ఇవతల ప్రాంతం వరకు నీళ్లు అందినయ్. నారాయణఖేడ్​, జహీరాబాద్​లకు మల్లన్నసాగర్​ నుంచి సింగూరు నింపి.. అక్కడి నుంచి లిఫ్ట్​ చేసి సంగమేశ్వర, బసవేశ్వర రిజర్వాయర్లను తలపెట్టినం. టెండర్లు అయినయ్​.. కాంట్రాక్టర్లు వచ్చిన్రు.. పనులు మొదలైనయ్​. కానీ, ఇప్పుడు కాంగ్రెస్​ గవర్నమెంట్​ రాగానే టెండర్లను ఆపేసింది. ఎందుకు? ఎవరికోసం నిలిపేసింది? ఆందోల్​కు చెందిన ఓ మినిస్టర్​ ఏం చేస్తున్నట్టు? సీఎం, మంత్రి పదవులు ఎందుకు.. ప్రజలకు మంచి చేయడానికా లేదా డ్రామాలు వేయడానికా?’’ అని ప్రశ్నించారు.